Saturday, March 14, 2015

మీకు జీతాలా నాయనా?

ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ప్రజల్లో ఒక భాగమే.. వార్డు సభ్యుని మొదలు ఎమ్మెల్యే, ఏంపీలైనా, మంత్రులు,సీఎం, పీఎంలైనా ప్రజల్లోని వారే.. వీరు ప్రజల తరపున పని చేస్తున్నందుకు గౌరవ వేతనం ఇస్తారు.. అది జీతం కాదు. వీరందరికీ సొంతంగా జీవనోపాధి మార్గాలు ఉంటాయి.. లేవంటే వారి చేతగానితనమే. సూటిగా చెప్పాలంటే భార్యా పిల్లలను, కుటుంబాన్ని సొంత రెక్కల కష్టంపై పోషించలేని వారు సోమరిపోతులే.. ప్రజాప్రతినిధులుగా వారు అనర్హులు.. సొంత బరువు బాధ్యతలు తెలిస్తేనే కదా వారికి సమాజం కష్టాలు తెలిసేది.. దేశ, సమాజ హితం కోసం కుటుంబ జీవితాలను త్యాగం చేసే వారి విషయం వేరు..
ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధుల వేతనాలు గణనీయంగా పెంచేసుకోవడం సిగ్గు చేటైన విషయం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూసి అడ్డుకునే రాజకీయ పార్టీలు తమకు లాభదాయకంగా ఉన్న ఈ విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటున్నాయి.. అలా అని కూడా అనలేం గట్టిగా సమర్ధించుకుంటున్నాయి.. ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల్లో ఎంత మంది నిజాయితీగా పని చేస్తున్నారు? ఆమ్యామ్యాలు లేకుండా ఏపనైనా చేస్తారా? నిజానికి నిజాయితీగా పని చేసే ఏ ప్రజాప్రతినిధి కూడా తమ జీత భత్యాల గురుంచి పెద్దగా పట్టించుకోరు.. వారి దృష్టి ప్రజల సంక్షేమంపైనే ఉంటుంది.. ఉన్నంతలో సర్దుకునే తత్వం వారిది..

వారి గౌరవ వేతనాలు పెంచుకుంటే ఎవరికీ పెద్ద అభ్యంతరం లేదు.. కానీ సమాజంలో జీవన ప్రమాణాలు అదే స్థాయిలో ఉన్నాయా అనే విషయం కూడా అలోచించాలి. ప్రయివేటు రంగ ప్రాధాన్యత పెరిగాక ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగిపోతుంటే, ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అత్తెసరుగానే ఉన్నాయి.. పైగా కోతలు.. ఎప్పుడు జీతాలు  చేతికొస్తాయో తెలియదు.. కింది స్థాయి ఉద్యోగుల జీవితాలు మరీ దారుణం.. ఈ విషయంలో ఎప్పుడైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయా? నిజాయితీ గుండెలపై చేయి వేసి ఆలోచించండి.. ఆ తర్వాతే మీ జీత భత్యాలు పెంచుకునే విషయాన్ని పరిశీలించుకోండి..

No comments:

Post a Comment