Sunday, March 15, 2015

పీవీకి ఓ న్యాయం.. సింగుకు మరో న్యాయం..

ఇద్దరూ మాజీ ప్రధానులు.. ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఇద్దరినీ కేసులు వెంటాడాయి.. కానీ పార్టీ ఇద్దరి విషయంలో వేర్వేరు విధానాలు అవలంభించింది.. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయం.. అదే కాంగ్రెస్ నీతి, రీతి, తత్వం..
పాములపర్తి వెంకట నరసింహారావు.. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. పదవీ కాలంలో ఎన్నో కేసులు వెంటాడాయి.. చివరకు అన్నీ వీగిపోయి కడిగిన ముత్యంలా బయట పడ్డారు.. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా నరసింహారావు పట్ల అమానుషంగా, అన్యాయంగా వ్యవహరించింది.. చివరకు ఆయన చనిపోతే నివాళ్లర్పించేందుకు ఏఐసీసీ కార్యాలయంలోకి పార్థివ దేహాన్ని అనుమతించలేదు.. దేశ రాజధానిలో పీవీ అంత్యక్రియలకు చోటివ్వలేదు..
డాక్టర్ మన్మోహన్ సింగ్.. అదృష్టం కలిసి వచ్చి అనూహ్యంగా దేశానికి ప్రధానమంత్రి అయిన ఆర్ధిక వేత్త.. పదవిలో ఉన్నప్పుడు జరిగిన కుంభ కోణాలకు ఇప్పుడు కేసులు మొదలయ్యాయి.. ఇంకా న్యాయ స్థానానికి వెళ్లలేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలచింది.. ఏ తప్పూ చేయలేదంటోంది (మరి చేయించిన వారెవరో?) పార్టీ అధ్యక్షురాలు ఏకంగా పాదయాత్ర చేసి ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించేసింది..
ఎంత తేడా?.. ఎంత వివక్ష?.. ఎందుకిలా?.. ఏమిటీ ద్వంద్వ నీతి?
ఎమ్మెల్యే స్థాయి నుండి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవుల దాకా పని చేసి చేసిన పీవీ నరసింహారావు రాజకీయాలు చాలించి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేద్దామని మూటా, ముల్లె సర్దుకున్నాడు.. అంతలో రాజీవ్ గాంధీ మరణించారు.. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అనూహ్యంగా ఆయనను ప్రధానమంత్రి పదవికి ఎన్నుకున్నారు.. రాజనీతి కోవిదుడైన పీవీ దేశాన్ని ఆర్ధిక సమస్యల నుండి గట్టెక్కించారు. కానీ ఆయన చేసిన పాపం ఒకటే.. సోనియా గాందీ కోటరీకి విధేయంగా నడచుకోకపోవడం.. స్వతంత్రంగా వ్యవహరించిన ఆయనపై పగబట్టారంతా? ఎన్నికల్లో పార్టీ ఓటమితో పక్కకు నెట్టేశారు.. జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన పెద్దాయన చివరకు అనామకుడైపోయాడు.. పదవిలో ఉన్నప్పుడు విధేయంగా మెలిగిన వారంతా చివరి రోజుల్లో పట్టించుకోకుండా ఆయన మానాన ఆయనను వదిలేశాడు..
పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కూడా అనుకోకుండానే అదృష్టవంతుడయ్యాడు.. అయితే ఈయన పరిస్థితి వేరు.. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చేసరికి సోనియా గాంధీకి విదేశీయత శాపంగా మారింది.. తనయునికి రాజకీయ ఓనమాలు వంట బట్టలేదు( ఇప్పటికీ కూడా).. పార్టీలో ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్లు ఉన్నా ఎక్కడ పుట్టి ముంచుతారో అనే భయం.. అలా అమ్మగారి దృష్టి మన్మోహన్ సింగ్ పై పడింది.. అలా ప్రధానమంత్రి అయి కూర్చున్న ఈ మౌనీ బాబా అమ్మగారికి విధేయత ప్రదర్శించడంలో రెచ్చిపోయాడు.. ఎంతలా అంటే ఏ ఫైలులో ఏం జరుగుతుందో తెలియనంతగా.. కళ్లకు గంతు కట్టినట్లుగా పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేశాడు. చివరకు ఇరుక్కు పోయాడు.. నిలువునా కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది..  అయినా సింగు గారికి ఢోకా లేదు..

పీవీకి ఓ న్యాయం.. సింగుకు మరో న్యాయం.. అదే సోనియా మార్క్ రాజకీయం..

No comments:

Post a Comment