Saturday, March 21, 2015

సంఘ శిల్పికి 125 ఏళ్లు..

దేశ వ్యాప్తంగా విక్టోరియా మహరాణి రాజ్యాభిషేక వజ్రోత్సవాలు జరుగుతున్నాయి.. పాఠశాలల్లో పిల్లలకు మిఠాయిలు పంచుతున్నారు. ఎనిమిదేళ్ల విద్యార్థి తనకు ఇచ్చిన మిఠాయిని అవమానకరంగా భావించి విసిరకొట్టాడు..  కొంత కాలానికి అదే పాఠశాలకు ఓ బ్రిటిష్ అధికారి తనిఖీకి వచ్చాడు.. ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థులంతా వందేమాతరం అంటూ స్వాగతం పలికారు.. మళ్లీ అదే విద్యార్థి ఈ పనికి కారణమని తేలింది.. పాఠశాల నుండి బహిష్కారానికి గురైన ఆ విద్యార్థి పెద్ద వాడయ్యాక డాక్టర్ అయ్యాడు.. కానీ జబ్బులకు కాకుండా దేశానికి పట్టిన రుగ్మతలకు చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాడు.. అలా మొదలైందే సంస్థే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS).. దాన్ని స్థాపించిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జన్మించి ఈ ఉగాదికి 125 ఏళ్లు పూర్తయింది..
1889వ సంవత్సరంలో ఉగాది పర్వదినం రోజుల నాగపూరులో జన్మించారు కేశవ బలిరామ్ హెడ్గేవార్.. హైదరాబాద్ సంస్థానం(నేటి తెలంగాణ) లోని నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం నుండి వలస వెళ్లిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం వారిది.. చిన్నప్పటి నుండే కేశవున్ని బ్రిటిష్ వారి పాలనలోని ఆనాటి దేశ పరిస్థితులు కలవర పరిచాయి.. చదువుకునే వయసులోనే సమాజం, దేశం కోసం ఆలోచించడం ప్రారంభించారాయన.. అణువణువునా దేశ భక్తిని నింపుకొని దేశ హితం కోసమే జీవించడం ప్రారంభించారు హెడ్గేవార్.. కాంగ్రెస్ పార్టీతో పాలు పలు విప్లవ సంస్థలతో సంబంధాలు పెంచుకున్నారు. 1916లో కలకత్తాలో వైద్య విద్యను పూర్తి చేసుకొని తిరిగి నాగపూర్ వచ్చారు. పెళ్లి చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టమని సూచించారు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు.. కానీ అప్పటికే హెడ్గేవార్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అందు కోసం జీవితాన్ని దేశం కోసం సమర్పించుకున్నారు. ప్రాక్టీస్ చేయకున్నా సన్నిహితులంతా ఆయనను డాక్టర్జీగా పిలవడం ప్రారంభించారు.
1920లో నాగపూరులో జరిగిన కాంగ్రెస్ మహాసభల నిర్వహణ బాధ్యత డాక్టర్ హెడ్గేవార్ స్వీకరించారు.. ఇందు కోసం పని చేసిన వాలంటీర్లలో క్రమశిక్షణ లోపాన్ని గమనించారాయన.. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇంకా సంపూర్ణ స్వరాజ్యం మాట ఎత్తలేదు.. ఆ పార్టీ విధానాలలోని లోపాలను గమనించి క్రమంగా దూరం అయ్యారు. మన దేశం, సమాజం కోసం స్వాభిమానం, దేశభక్తి, క్రమశిక్షణ, అంకిత భావం, కులాలకు అతీతంగా హిందువుల ఐక్యత కోసం నిస్వార్ధంగా పని చేసే సంస్థ అవసరం అని భావించారు డాక్టర్జీ.. ఇది చాలా కష్టమైన పని అని ఆయనను అంతా నిరుత్సాహ పరిచారారు. కానీ డాక్టర్జీ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు. అలా 1925లో ఏర్పాటైన సంస్థే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. RSS
RSSను దేశ వ్యాప్తంగా విస్తరించడానికి డాక్టర్జీ దేశమంతా పర్యటించారు. అనేక మంది వ్యక్తులను కలుపుకొనిపోయారు. ఎంతో మంది సమాజ సేవకులను తయారు చేశారు. వ్యక్తి కన్నా సంస్థ, సమాజం గొప్పదని భావించారు డాక్టర్జీ.. అందుకే సంఘానికి తాను గురువుగా ఉండే అవకాశాన్ని తిరస్కరించారు. స్పూర్తినిచ్చే భగవాధ్వజాన్నే గురు స్థానంలో ప్రతిష్టించారు. సర్ సంఘ్ చాలక్ పదవిలో ఉన్నా తాను సాధారణ స్వయంసేవకున్నే అని వినమ్రంగా చెప్పుకునేవారు డాక్టర్జీ.. జగద్గురు శంకరాచార్యులు ఆయనకు రాష్ట్ర సేనాని బిరుదును ప్రధానం చేశారు.. కానీ అలా పిలిపించుకునేందుకు నొచ్చున్నారాయన.. తనకు సన్మానాలు, సత్కారాలు, బిరుదులు వద్దని స్పష్టం చేశారు. సాధారణ వ్యక్తిగా ఉండటానికే ఇష్టపడ్డారు.. డాక్టర్ హెడ్గేవార్ అవిశ్రాంతంగా పని చేసి సంఘాన్ని ఒక అజేయ సంస్థగా రూపు తెచ్చారు.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా తుది శ్వాస వరకూ సమాజ చింతనతోనే జీవించారు. నిద్రలోనూ దేశ హితం గురుంచే కలవరించారు డాక్టర్జీ.. 1940 జూన్ 21న తుది శ్వాస విడిచారు.

డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆనాడు నాటిన చిన్ని మొక్క ఇప్పడు వట వృక్షంగా మారి దేశ వ్యాప్తంగా విస్తరించింది.. ప్రపంచ వ్యాప్తమైంది. లక్షలాది మంది స్వయం సేవకులు డాక్టర్జీ చూపించి మార్గంలో నడుస్తున్నారు. భారత దేశాన్ని పరం వైభవం దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. డాక్టర్జీ జన్మించింది 1889 ఏప్రిల్ 1.. అయితే వారు భారతీయ కాలమానం ప్రకారం వారు ఉగాది నాడు పుట్టారు.. అందుకే ఉగాది రోజునే ఆ మహానీయుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.. యుగద్రష్ట డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ 125వ జయంతి సందర్భంగా వారి స్పూర్తితో మనమంతా ముందుకు సాగుదాం..

No comments:

Post a Comment