Monday, March 23, 2015

నిన్న ఆంధ్ర.. ఇవాళ తెలంగాణ.. ఇదీ పత్రికల తీరు..

పొద్దున్నే న్యూస్ పేపర్ కొందామని రోడ్డు మీదకు వెళ్లాను.. అప్పుడే బైక్ మీద వచ్చిన ఒకాయన ‘తెలంగాణ పేపర్ ఇమ్మని షాపు వానికి డబ్బిచ్చాడు?.. షాపాయన ఏ తెలంగాణ? అని అడిగాడు. వచ్చిన కస్టమర్ పేపర్ల వరుస వైపు చూసి తనకు కావాల్సిన తెలంగాణ పత్రిక కొనుక్కొని పోయాడు.. అవును మరి నిన్న మొన్నటి దాకా నమస్తే తెలంగాణదిన పత్రిక ఒక్కటే ఉండేది..  ఇప్పడు మన తెలంగాణ,  ‘నవ తెలంగాణ వచ్చి చేరాయి.. మరి కొన్ని తెలంగాణ పేపర్లు వస్తాయట(?).. వీటికి తోడు నమస్తే హైదరాబాద్ అనే పత్రిక కూడా ఉంది..
తెలుగు పత్రికలకు మూస పేర్ల ధోరణి కొత్తేమీ కాదు.. ఒకప్పుడు ఆంధ్ర పేరుతో వరుసగా దిన పత్రికలు వచ్చాయి..ఆంధ్ర పత్రిక’ ‘ఆంధ్ర ప్రభ’ ‘ఆంధ్ర భూమి’ ‘ఆంధ్ర జ్యోతి.. ఆంధ్ర పత్రిక ఎప్పుడో మూత పడింది.. మధ్యలో ఆంధ్ర జనత అనే దిన పత్రిక కొంత కాలం నడిచి ఆగిపోయింది.. మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడేందుకు జరిగిన పోరాట కాలంలో ఆ పదానికి డిమాండ్ ఉండేది.. అలా ప్రధాన పత్రికలన్నీ మూసగా ఆంధ్ర పేరిట వచ్చేశాయి..
తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ప్రభావంతో సీన్ రివ్స్ అయింది.. నిన్న మొన్నటి దాకా ఆంధ్రబ్రాండ్ మాదిదే ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ పత్రికలు వస్తున్నాయి.. తెలంగాణ అస్థిత్వం, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ పూర్తిగా లోకల్ ఫ్లేవర్ నింపుకొని వస్తున్న కొత్త తరం దిన పత్రికలకు ఆధరణ బాగానే ఉంది.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో టీఆరెస్ నమస్తే తెలంగాణను ప్రమోట్ చేసింది.. సీపీఐ తన విశాలాంధ్ర దినపత్రిక టైటిల్ తెలంగాణ ప్రాంతంలో గుది బండ అనుకుందేమో అందుకే మన తెలంగాణ పేరుతో కొత్త దిన పత్రికను తెచ్చింది.. మరి సీపీఎం వారి దిన పత్రిక ప్రజాశక్తి టైటిల్ ఎవరికీ అభ్యంతరకరం కాదే? మరి నవ తెలంగాణ ఎందుకు తెచ్చినట్లో?..
ఆంధ్రపేరిట పత్రికలు ఎన్ని వచ్చినా పాఠకులు వాటిని పూర్తి పేరుతో కాకుండా ‘పత్రిక, ప్రభ, భూమి, జ్యోతి, జనత..’ అని పిలుచుకుంటున్నారు. కానీ ‘తెలంగాణ పత్రికలను నమస్తే, మన, నవ.. అని పిలుకోవడం ఇబ్బందే.. నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్ర అనే మూస టైటిల్స్ కు భిన్నంగా ఈనాడు దిన పత్రిక పుట్టుకొచ్చి తెలుగు జర్నలిజంలో సంచలనాలు సృష్టించింది.. ఆ తర్వాత కాలంలొ వచ్చిన ఉదయం, వార్త, సాక్షి దిన పత్రిక విజయానికి వాటి టిటిల్స్ లో ఉన్న వినూత్నత్వం కొంత కారణం..
ప్రస్తుతం తెలుగులో ఉన్న అన్ని ప్రధాన దిన పత్రికల్లాగే  తెలంగాణ టైటిల్ తో వచ్చిన పత్రికలు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధమనే ముద్ర వేసుకున్నాయి.. కాదని ఎవరైనా వాదిస్తే వారిని అమాయకంగా చూడటం మినహా మరేం చేయలేను.. ఈ నేపథ్యంలో రాజకీయేతర స్వతంత్ర వార్తల తెలంగాణ పత్రిక కూడా వస్తే బాగుండు అనిపిస్తోంది.. కానీ అది అత్యాశే అనిపిస్తోంది.. ప్రపంచ వ్యాపంగా ప్రధాన దినపత్రికలు సమాచార సాంకేతిక విప్లవం పుణ్యమా అని ప్రింట్ ఎడిషన్లను మూసేని, క్రమంగా ఆన్ లైన్ కు వెళ్లిపోతున్నాయి.. తెలుగులో కూడా ఈ పరిణామం క్రమంగా ప్రారంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఈ అంతర్జాతీయ పత్రికలైనా ఎంత కాలం ఉంటాయో, మరే కొత్త టెక్నాలజీ వస్తుందో చెప్పలేని పరిస్థితి.. ప్రస్తుతానికైతే అన్ని పత్రికలకూ నేను విష్ యూ ఆల్ ది బెస్ట్ అనే చెబుతున్నా.. పత్రికలు, ఛానళ్లు ఎన్ని వస్తే అన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని నమ్మే సగటు జర్నలిస్టును కదా నేను..

No comments:

Post a Comment