Wednesday, February 11, 2015

తాబేలు, కుందేలు కథ పునరావృత్తం కావొద్దు..

తాబేలు, కుందేలు కథ అందరికీ తెలిసిందే.. ఇద్దరికీ పరుగు పందెం జరిగింది.. తాను వేగంగా పరుగెత్తగలనని కుందేలుకు ధీమా.. తాబేలు గమ్యం చేరేలోపు తానో కునుకు తీసి, తేలికగా లక్ష్యాన్ని చేరుకోవచ్చనుకుంది.. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. తాబేలు విజేతగా నిలిచింది..

గత సర్వత్రిక ఎన్నికల్లో అనూహ్య మెజరిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ.. దేశ రాజధాని దిల్లీలో ఏడింటికి ఏడు సీట్లనూ ఊడ్చేసింది. ప్రజలు పాలించడానికి ఐదేళ్ల సమయం ఇచ్చారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానకి కావాల్సినంత సమయం ఉంది అని భావించారు కమల నాథులు.. కానీ అవతల ఆకలితో ఉన్నవాడు తీరిగ్గా పరమాన్నం వండి పెడతానంటే ఊరుకోడు.. అలాంటి సమయంలో వాడికి గంజే పరమాన్నంతో సమానం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజం. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
దిల్లీలో బీజేపీకి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నా, స్థానిక నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీదీ అదే పరిస్థితి.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఒకే ఒక్కడు కేజ్రవాల్.. జనానికి స్పష్టంగా కనిపించాడు.. బీజేపీ కిరణ్ బేడీని తెరపైకి తెచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. రోడ్డు మీద ఉండే వాడు ఏదైనా మాట్లాడగలడు.. ఎవరినైనా, ఏమైనా అనగలడు.. దాన్నే కడుపు మండినోడి ఆగ్రహం అంటారు.. కానీ అధికారంలో ఉండే వాడు ఆచి చూచి మాట్లాడాలి.. అక్కడే బీజేపీకి నష్టం జరిగింది.. ప్రత్యర్థులంతా ఒకటయ్యారు.. ఫలితం ఆప్ విజేతగా నిలిచింది

గర్వం తలకు ఎక్కితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టిన గతే పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ తమ కార్యకర్తలతో అన్నారు.. ఇది వాస్తవం.. ఈ మాట అందరికన్నా ఎక్కువగా కేజ్రీవాల్ కే వర్తిస్తుంది.. ఇప్పడాయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు.. ఇంకా పాత ధోరణిలోనే మఫ్లర్ మీద టోపీ పెట్టి మూస ప్రచార ఆర్భాటాలకు పోతే దిల్లీ జనం అంగీకరించరు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి.. లేకపోతే కుందేలు, తాబేలు కథ పునరావృత్తం అవుతుంది.

No comments:

Post a Comment