Saturday, February 21, 2015

ప్రాచీన హోదాతో ఏం సాధించాం..

అరవం వాడు ప్రాచీన భాషా హోదా దక్కించుకున్నాడని మనమూ అరిచాం, మాకూ ఆ హోదా ఇవ్వమని గగ్గోలు పెట్టాం.. తెలుగు భాషపై ఎక్కడలేని ప్రేమ కురిపించాం.. సరే అఘోరించండి అంటూ కేంద్ర ప్రభుత్వం మన భాషకూ ప్రాచీన హోదా విదిల్చింది.. ఇది జరిగింది 2009లో.. అంటే ఐదేళ్లు గడచిపోయాయి. కానీ ఏమైందీ?.. తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చుకొని మనం ఏం సాధించామూ?..
కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా, పరిశోధనా కేంద్ర ఏర్పాటు కోసం స్థలం ఇవ్వలేకపోయింది గతించిన ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం.. అడ్డమైన వారందరీకి ఉదారంగా భూములు దోచి పెట్టిన మన నాయకమన్యులకు, మాతృ భాష అభివృద్ది కోసం ఓ పాత బంగళా అయినా కేటాయించడానికి మనస్సు అంగీకరించలేదు.. ఫలితంగా తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం మైసూరులోని భారతీయ భాషల అధ్యయన కేంద్రంలోనే కొనసాగుతోంది.. ప్రాచీన భాష హోదాలో తెలుగు భాషా సాహిత్య అధ్యయన, పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.5 కోట్లు కేటాయించింది.. కానీ అవీ ఉపయోగించుకోలేకపోయాం.. దీంతో ఈ మొత్తాన్ని రూ. 2.5 కోట్లకు కుదించింది.. అయినా మనలో చలనం లేదు.. మన పరిస్థితికి జాలి పడిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ. కోటి మాత్రమే ఇస్తోంది..
ప్రస్తుతం మనం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశాలుగా విడిపోయాం.. ప్రాచీన భాష హోదా దేవుడెరుగు.. మన తెలుగు భాష ఉనికే పట్టింపులేనిదిగా మారింది.. ఇరు తెలుగు రాష్ట్రాలు పొరుగున ఉన్న తమిళనాడును చూసి బుద్ది తెచ్చుకోవాలి.. వారి భాషకు నిజంగా ప్రాచీన హోదా ఉందా, లేదా అనేది మనకు అనవసరం.. కానీ మాతృభాషను, సంస్కృతిని, ఉనికిని కాపాడుకోవడానకి వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించక తప్పదు..

భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడేది తెలుగే.. ఇరు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగోళ్లం ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాం.. కానీ మన ఉనికినే ప్రమాదంలో పడేసుకుంటున్నాం.. ( ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

No comments:

Post a Comment