Thursday, February 19, 2015

జర్నలిస్టుల ఆరోగ్యం హరతి కర్పూరమేనా..

రాష్ట్ర విభజన కారణంగా ఎక్కవగా నష్టపోయింది ఎవరంటే జర్నలిస్టులే.. అందునా డెస్క్ జర్నలిస్టులే.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు జరుగుతున్న మేళ్లు ఏమిటని అడిగితే వెంటనే చెప్పడానికి హెల్త్ కార్డులు అనేవి ఉండేది.. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణం ఆదుకున్నవి ఈ కార్డులే.. అదీ ఉదారంగా ఇచ్చినవేం కాదు.. ప్రీమియంలో సగం కంట్రిబ్యూషన్ జర్నలిస్టులే భరించేవారు..
రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పథకం కిరణ్ కుమార్ కాలానికి పలుచబడింది. అడ్డగోలుగా ఇన్స్యూరెన్స్ సంస్థలను మార్చేశారు.. రాష్ట్ర విభజన కాలంలో జర్నలిస్టులు ప్రీమియమ్ కట్టినా ప్రభుత్వం పాలసీలను రెన్యూ చేయలేదు.. దీంతో ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి..
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత తొమ్మిది మాసాలుగా జర్నలిస్టుల జీవితాలతో దోబూచులాడుతున్నాయి.. తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీత భత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో పోటీలు పడి నిర్ణయాలు తీసుకుంటున్న రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులను మాత్రం త్రిశంకు స్వర్గంలో పెట్టాయి. అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో తేల్చకుండా జాప్యం చేస్తున్నాయి. జర్నలిస్టుల్లో ఎవడు ఏ ప్రాంతం వాడో నిర్ధారించడం కష్టమైనందున, అవతలి ప్రభుత్వం ఇచ్చాక, తమం చూద్దాం అనే విధానం కొనసాగుతోంది. చివరకు ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా విషయంలో మొదటి అడుగు వేసింది.. కానీ అక్రిడిటేషన్లు ఉన్నవారికేనట.. మీడియాలో దాదాపు 70 శాతం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేవు, ఇందులో ఎందరో సీనియర్లూ ఉన్నారు.
కొత్త నిబంధన వల్ల ఎక్కువగా నష్టపోతున్నది డెస్క్ జర్నలిస్టులే.. రిపోర్టళ్లు తెచ్చిన వార్తలను వండీ వార్చీ ఒక రూపానికి తెచ్చేది వారే.. రాత్రింబవళ్లు షిప్టుల్లో పని చేయడం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు వారికే ఉంటాయి.. దురదృష్టవశాత్తు అక్రిడిటేషన్ల విషయంలో మొదటి నుండి వీరికి మొండి చేయే.. అక్రిడేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వమే డెస్క్ జర్నలిస్టులకు అవి లేవనే కారణంతో ఆరోగ్య బీమా నిరాకరిస్తోంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో వివక్ష లేకుండా అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు ఈ పనికి మాలిన నిబంధన పెట్టిందో ఏపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది.  అసలు ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి..

ఇప్పడు బుగులంతా మా తెలంగాణ జర్నలిస్టులకే.. బాబు ప్రభుత్వ స్పూర్తితో కేసీఆర్ సర్కారు కూడా డెస్క్ జర్నలిస్టులను వీధినా పడేస్తుందా అనే భయం పుట్టుకుంది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో సానుకూలంగా ఉన్నామని గత తొమ్మిది నెలలుగా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.. మమ్మల్ని రోడ్లెమ్మట తిప్పి నాయకులై కూచ్చున్న జర్నలిస్టు సంఘాల పెద్దలు కూడా నోరు మెదపడం లేదు.. చూడాలి ఏమౌతుందో ఏదో.. గుర్రమూ ఎగరవచ్చనే ఆశలైతే సజీవంగా ఉన్నాయి..

No comments:

Post a Comment