Thursday, February 25, 2016

సీబీఐ మాజీ డైరెక్టర్ గారి కష్టాలు

అది పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలం.. పలు సంక్షోభాలు, కుంభకోణాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఆ సమయంలో 1996లో జైన్ హవాలా కుంభకోణం వెలుగు చూసింది.. ప్రతిపక్ష నేత లాల్ క్రిష్ణ అడ్వానీతో సహా పలువురు అగ్ర నాయకులపై CBI కేసులు నమోదు చేసింది.. దీనికి ఆధారం ఓ డైరీలోని ఓ కాగితం ముక్కపై LK అని రాసి ఉండటం.. తనపై వచ్చిన తప్పుడు అభియోగంతో మానసిన వేదనకు గురైన అడ్వానీ తాను నిర్దోషినని తేలే వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. 18 నెలల విచారణ తర్వాత అడ్వానీపై ఆరోపణలు నిరాధారమని కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు..
ఈ మధ్యనే ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిపై CBI కేసు నమోదు చేసింది.. తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొని ఎగ్గొట్టాడని ఆరోపణ.. ఈ ప్రముఖ వ్యక్తి మరెవరో కాదు.. జైన్ హవాలా కేసు సమయంలో CBIకి డైరెక్టర్ గా ఉన్న కె.విజయ రామారావు.. అభియోగాలు ఎదుర్కొంటున్నది ఆయన కొడుకు శ్రీనివాస కళ్యాణరావు.. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, నిర్ధోషిగా బయట పడతాడని చెబుతున్నారు విజయరామారావు.. తాను సీబీఐని తప్పు పట్టనని అది సమర్ధవంతమైన సంస్థ, ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని అనుకోవడం లేదని అని అంటూ కితాబిచ్చారు ఆయన.. పాపం తాను డైరక్టర్ గా పని చేసిన సంస్థ గురుంచి తక్కువ చేసి చెప్పుకోలేడు కదా..
కేవలం రెండక్షరాలను ఆధారంగా చేసుకొని ఓ అగ్రనేత రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని చూసేందుకు సీబీఐని అడ్డు పెట్టుకుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పుడు ఆ సంస్థకు అధిపతిగా ఉన్న విజయరామారావుకు కష్టం వచ్చి పడింది.. పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడం కష్టమే మరి..
అన్నట్లు తెలుగు నాట పెను రాజకీయ మార్పులకు పరోక్ష కారకులు మన విజయరామారావు గారే.. సీబీఐ డైరెక్టర్ పదవీ విరమణ తర్వాత టీడీపీలో చేరి 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విజయరామారావును రాష్ట్ర మంత్రి చేశారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇందు కోసం ఒకే సామాజిక వర్గం అనే సాకుతో కె.చంద్రశేఖరరావుకు తిరిగి మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరించారు చంద్రబాబు.. ఆగ్రహించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి లేపడం.. దశాబ్దన్నర కాలంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.. కొసమెరుపు ఏమిటంటే ఈ రాజకీయ పరిణామాలకు కారణమైన విజయరామారావు ఇటీవలే టీడీపీకి గుడ్ బై  చెప్పి టీఆర్ఎస్ లో చేరడం..

No comments:

Post a Comment