Monday, February 15, 2016

దేశంపట్ల బాధ్యతలేని వామపక్షాలు

వామపక్షాలు ఎవరి పక్షం?.. ఆ పార్టీలు భారత దేశాన్ని ఏనాడైనా అర్థం చేసుకున్నాయా?..
మన దేశంలో వారసత్వ రాజకీయాలకు తావులేకుండా, అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి లెఫ్ట్, రైట్.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్షీణించి, బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నిలవాల్సింది వామపక్షాలే.. కానీ ఈ పార్టీలు తమ లక్ష్యాలకు అందనంత దూరంలో ఉండిపోయాయి. కారణం.. ప్రారంభం నుండి వారు వేస్తున్నవి తప్పటడుగులే కాబట్టి..
తొలి రోజుల్లో భారత కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ (రష్యా) నమూనాతో మన దేశంలో కూడా విప్లవం తేవాలని పగటి కలలు కన్నారు.. భారత దేశాన్ని జాతుల సముదాయంగా అభివర్ణించి, ముక్కలు చేసి పాలిద్దామనుకున్నారు.. భారత దేశంలో తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) విలీనం అయ్యాక కూడా ఇక్కడ సాయుధ పోరాటం కొనసాగించారు.. చివరకు నెహ్రూ జోక్యం, రష్యా నియంత స్టాలిన్ ఆదేశంతో పోరాటాన్ని విరమించారు.
బ్రిటిన్ తో రష్యాకు సంబంధాలు బాగా ఉన్న కాలంలో భారత కమ్యూనిస్టులు మన దేశ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉన్నారన్నది చారిత్రిక సత్యం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారిపై పోరాటం చేపడితే ఆయన జపాన్ పెంపుడు కుక్క అంటూ నిందించారు కమ్యూనిస్టులు..
భారత దేశంపై చైనా దురాక్రమ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ CPI, CPMలుగా చీలిపోయింది.. సీపీఐ రష్యాకు, సీపీఎం చైనాకు మద్దతు పలికేవి..
రష్యాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పట్టిన చందంగా వ్యవహరించిన సీపీఐ, సోవియట్ యూనియన్ కుప్ప కూలడంతో అనాధగా మారింది.. మన దేశంపై చైనా దాడిని నిస్సిగ్గుగా సమర్ధించిన సీపీఎం ఇప్పుడు ఆ దేశంలోనే కమ్యూనిజానికి బీటలు పడటాన్ని జీర్ణించుకోలేకపోతోంది..
సైద్దాంతిక విబేధాలతో కమ్యూనిస్టులు ముక్కలు చెక్కలుగా చీలిపోతూ, ప్రజలకు దూరమవుతూ వచ్చారు.. వామపక్షాల ఐక్యత అన్నది పగటి కలగా మారింది.. 2014 లోక్ సభ ఎన్నికల్లో వారు గెలుచుకున్న సీట్ల సంఖ్య రెండు డిజిట్లు కూడా దాటలేదు..

భారత దేశ రాజకీయాల్లో క్రమంగా ఉనికిని కోల్పోతున్న వామపక్షాలు తమ పితృ దేశాలైన రష్యా, చైనాల అండ లేక ఇప్పుడు బిత్తరపోతున్నాయి.. ఇప్పుడు తమ విధేయ కేంద్రాన్ని పాకిస్తాన్ కు మార్చుకున్నాయేమో? అందుకే వేర్పాటు వాద, ఉగ్రవాద సంస్థలకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.. JNUలో జాతి వ్యతిరేక శక్తులకు బాసటగా నిలవడం దేనికి ప్రతీక?

No comments:

Post a Comment