Sunday, February 21, 2016

మాతృ భాషను మరువకండి..

ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ ముందుగా మాట్లాడే మాట అమ్మా (తన తల్లి మాట్లాడే భాషలో).. మాతృభాష అనే పదం ఇలా వచ్చిందే.. ప్రతి నాగరికత, సంస్కృతి, సాంప్రదాయ సముదాయానికి ఒక భాష ఉంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా భాషలు ఉంటే అందులో మనుగడలో ఉన్నది 500 లోపే అంటారు.. మన భాషను కోల్పోతే ఉనికి కోల్పోయినట్లే..
ఈనాడు తెలుగు భాష పరిస్థితి గురుంచి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాతృభాషగా ఉన్నవారు 18 కోట్లు ఉంటారని అంఛనా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మాట్లాడుతున్న తెలుగులో తెలుగుఎంత అని ఆలోచించాలి.. మనం మాట్లాడే ప్రతి పది పదాల్లో కచ్చితంగా 2 నుండి 4 దాకా ఇంగ్లీషు లేదా అన్య భాషా పదాలే ఉంటాయి.. మన భాషను సుసంపన్న చేసుకోవడానికి కొత్త పదాలను కల్పుకోవాల్సందే.. కానీ తెలుగులో పదాలు ఉన్నా అన్య భాషా పదాలనే వాడుతున్నాం.. ఇందుకు తప్పు ప్రధానంగా మీడియా సంస్థలదే.. ఆ తర్వాతే ప్రభుత్వాలను నిందించాలి..
టీవీ చానళ్లలో మన భాష ఎలా ఉందో ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. పత్రికల్లో సైతం ఈ ధోరణి ప్రారంభమైంది.. ఈనాడు వారు కొంత మేర కొత్త పదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, ఇతర మీడియా సంస్థలు అందుకు దూరంగా ఉంటున్నాయి.. వాస్తవానికి ఈ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు విశ్వవిద్యాలయం, ఉభయ రాష్ట్రాల ప్రెస్ అకాడమిలు కానీ ఈ విషయంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి.. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను భాషను రక్షించుకుందామనే సోయి లేకుండా పోయింది..
ప్రపంచంతో అను సంధానానికి ఇంగ్లీషు తదితర భాషలు కావాల్సిందే.. కానీ మన అస్థిత్వాన్ని కాపాడేది మాతృభాష మాత్రమే.. మన పిల్లలు ఏ మీడియంలో చదివినా పర్వాలేదు.. కానీ మన భాష సంస్కృతులను మరవకుండా పెంచితే చాలు.. భావి తరాలకు మేలు చేసినవాళ్లమవుతాం.. పిల్లలకు తెలుగు పాటలు, పద్యాలు, సుభాషితాలు, సూక్తులు నేర్పించండి.. ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని చదివేలా ప్రోత్సహించండి.. తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడండి.. తెలుగు పదాలను ఎక్కువగా వాడండి.. మన వంతుగా ఈ మాత్రం ప్రయత్నం చాలు.. తెలుగు భాషను భావితరాలకు అందేలా కొనసాగించిన వారిమవుతాం..

1947లో భారత దేశం విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది.. పశ్చిమ పాకిస్తాన్ ఉర్దూ భాషను తూర్పు పాకిస్తాన్ పై రుద్దేందుకు ప్రయత్నించింది.. దీంతో అక్కడి ప్రజలు తమ బెంగాళీ భాషను రక్షించుకునేందుకు ఉద్యమించారు..  ఈ సందర్భంగా 1952 ఫిబ్రవరి 21న జరిగిన కాల్పోల్లో నలుగురు భాషాభిమానులు అమరులయ్యారు.. ఈ ఘటనే బాంగ్లా దేశ్ ఆవిర్భావానికి దారి తీసింది.. ఈ స్పూర్తితో యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించింది..

No comments:

Post a Comment