Sunday, February 14, 2016

ఇవాళో దిక్కుమాలిన దినం

ప్రేమికులకూ ఓ దినం ఉందంట.. అది ఫిబ్రవరి 14 అంట.. అంటే ఈ ఒక్కరోజులోనే ప్రేమ పుట్టి చచ్చిపోతుందా?
అసలు ప్రేమ అంటే ఏమిటి?.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం.. తల్లి దండ్రులను, భార్యా పిల్లలను తోబుట్టువులను, బంధు మిత్రులనూ ప్రేమిస్తాం..
మరి కేవలం యువతీ, యువకుల మధ్య ఆకర్షణ, శృంగారమే ప్రేమ అని ఎలా అనగలం?.. ఇదే నిజం అయితే జంతువులకు, మనుషులకు తేడా ఏం ఉంది? పాశ్చాత్య పోకడలు, చెత్త సాహిత్యం, సినిమాలు, మీడియా ప్రేమకు అర్ధం మార్చేసి దాన్ని ఒకే కోణంలో చూపుతున్నాయి..
ప్రేమికులు దినం పేరుతో విచ్చల విడిగా సినిమా థియేటర్లు, పార్కులు, పబ్బులు అంటూ తిరుగుతూ.. వికృత చేష్టలు చేస్తూ,  భజరంగ్ దళ్ వాడో పట్టుకొని ఎక్కడ పెళ్లి చేస్తాడోనని భయపడటంలో అర్థం ఉందా?
ప్రేమ అనేది తాత్కాలిక ఆకర్షణ కాదు.. దీనికో విస్తృత అర్ధం ఉంది.. ప్రేమ అనంతం, శాశ్వతం, నిత్యనూతనం.. ఇలాంటి ప్రేమకు ఓ దినం పెట్టుకోవడం భావ్యమేనా?
నిజానికి ఈ దిక్కుమాలిన వాలెంటైన్స్ డే మనది కాదు.. ఇదో మత పరమైన వేడుక.. వాలైంటన్ అనే మత ప్రచారకుడు సైనికులు యుద్దం చేయరాదంటూ, పెళ్లిళ్లు చేసుకొని సుఖంగా ఇంటి పట్టునే ఉండండంటూ ప్రచారం చేస్తుంటే రోమన్ చక్రవర్తి క్లాడియర్-ii అతన్ని బంధించారు.. ఇతగాడు ఏకంగా జైలర్ కూతురుకు ప్రేమ లేఖ రాశాడు.. ఈ ముసలి మత ప్రచారకుడు కూతురు వయసులో ఉన్న యువతికి లవ్ లెటర్ రాయడం ఏమిటి అని ఎవరూ ప్రశ్నించలేదెందుకో?
చివరకు చక్రవర్తి వాడిని ఉరి తీయడంతో ఇదో గొప్ప త్యాగదినం అంటూ వాలంటైన్స్ దినాలు మొదలుపెట్టారు..ఇలాంటి అర్థం పర్థం లేని వేలంటైన్స్ దినం మనకేల?..
ప్రేమ తత్వం మన దేశానికి కొత్త కాదు.. ప్రేమలు. పెళ్లిల్లూ భారతీయ సంస్కృతిలోనూ ఉన్నాయి.. పురాతన కాలంలో గంధర్వ వివాహాలు, స్వయంవరాలు తెలిసినవే.. రాధాకృష్ణులు, నల దమయంతులు.. ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.. సమాజ పరిణామ క్రమంలో సామాజిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రేమను వ్యక్తం చేసుకోవడానకి భారతీయులకంటూ ఉత్సవాలున్నాయి.. వసంతోత్సవం తెలిసిందే కదా?

ప్రేమను వ్యక్తీకరించుకోడానికి మన సంస్కృతి ప్రకారమే అవకాశాలు ఉన్నాక వేలంటేన్స్ డేలు ఎందుకో.. నా దృష్టిలో ఒదొక కమర్షియల్ వెస్ట్రన్ కల్చర్ మాత్రమే.. ఫిబ్రవరి 14 అంటే పక్తు వ్యాపారమే కనిపిస్తుంది.. గ్రీటింగ్ కార్డులు, బొకేల వ్యాపారానికి, గిఫ్టులు, హోటల్, రిసార్టుల వేడుకలు, టీవీ చానెళ్ల కమర్షియల్ ప్రోగ్రామ్ కోసమే పనికొచ్చే వేడుక ఇది. ఈ రోజున రోడ్లు, పార్కులు, రిసార్టుల వెంట తిరిగేవారిలో నిజమైన ప్రేమికులు చాలా తక్కువే.. ప్రేమ పేరిట బరితెగించి వాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే వారూ ఉన్నారు..
ప్రేమికులకు అడ్డు పడుతున్నారంటూ నిందించేవారు కూడా కాస్త ఆలోచించాలి.. విచ్చల విడిగా వ్యవహరించే వారిని ఓ కంట కనిపెట్టకపోతే ఆ నష్టం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.. నిజమైన ప్రేమను అర్థం చేసుకోండి.. నచ్చిన వారిని వివాహం చేసుకొని జీవితాన్ని పంచుకోండి..
నా వ్యాఖ్యలు కొందరికి కోపం కలిగించి ఉండొచ్చు.. ఉన్నమాటంటే ఎవరికైనా ఉలుకే..

No comments:

Post a Comment