Saturday, March 8, 2014

‘యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా..’

ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారని మన పెద్దలు ప్రాచీన కాలం నుండే చెబుతూ వచ్చారు.. వైదిక యుగంలో స్త్రీ, పురుషుల బేధాలు ఉండేవి కాదు.. చదువులోనూ, శక్తి సామర్ధ్యాల్లోనూ, ఇతర అన్ని అవకాశాల్లోనూ లింగబేదం లేదు.. నాటి సమాజం మహిళలను గౌరవనీయ స్థానంలో ఉంచింది.. దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు ప్రతీకగా పూజించారు..
దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి.. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదిరత వీర వనితలు తమ ఉనికిని, శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు..
ఆధునిక యుగంలో అనేక మార్పులు వచ్చాయి.. విద్య, ఉపాది అవకాశాల్లో స్త్రీ పురుషులు పోటీ పడుతున్నారు.. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది.. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు.. రాజకీయం, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనా అనే బాధ కలుగుతోంది..
పొద్దున లేచి పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు మార్చినా ప్రముఖంగా కనిపించే వార్తలు బాధను కలిగిస్తుంటాయి.. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మనం ఇంకా అనాగరికులమేనా అనే సందేహం కలుగుతుంది.. రాజకీయాల్లోనూ వివక్షతే కొనసాగుతోంది.. రిజర్వేషన్ల పుణ్యమా అని పదవులు మహిళలకు దక్కినా పెత్తనం పురుషులదే.. అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలదీ ఇదే దుస్థితి.. గుడ్డిలో మెల్ల అన్నట్లు సోనియా, సుష్మ, మమత, జయ, మాయ తదితర మహిళా నేతల విజయగాధలు కూడా ఉన్నాయి.. అయితే మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం మోక్షం కలిగే పరిస్థితి కనిపించడంలేదు..

మార్పు అనేది మన కుటుంబాల నుండే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మణులను గౌరవిస్తూ, వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుంది.. ఇవేవీ చేయకుండా ఎవరిని నిందించినా ఫలితం ఉండదు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment