Thursday, March 20, 2014

1962 చేదు జ్ఞాపకాల నుండి గుణపాఠం నేర్చుకున్నామా?

చరిత్రలో కొన్ని పాత గాయాలు పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.. 1962 భారత్ -చైనా యుద్ధ చేదు జ్ఞాపకాలు ఈ కోవలోనివే.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే ముసుగును తొలగించుకున్న చైనా, పంచశీల సూత్రాలకు తిలోదకాలు ఇస్తూ భారత సరిహద్దులపై విరుచుకుపడింది.. అప్రమత్తంగా లేని మన సైన్యం ఓటమి పాలైంది..
ఈ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమని నాటి భారత మిలటరీ అకాడమీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్, బ్రిగేడియర్ పి.ఎస్.భగత్ విశ్లేషించారు.. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు.. ప్రధాని నెహ్రూతో పాటు రక్షణ మంత్రి కృష్ణమీనన్ ల నగ్న స్వరూపాలను ఈ నివేదిక ఎండగట్టింది..హెండర్సన్ బ్రూక్ నివేదికను చూసి ప్రధాని నెహ్రూ ఉలిక్కి పడ్డారు.. అంతే రహస్యంగా తొక్కి పెట్టేశారు.. అప్పటి నుండి అంతర్గత రహస్యంగానే ఉన్నఈ నివేదికను తాజాగా ఆస్ట్రేలియా జర్నలిస్టు నెవెల్లి మాక్స్ వెల్ బయట పెట్టడం సంచలనం సృష్టించింది.. నిజానికి హెండర్సన్ బ్రూక్స్ నివేదికలోని విషయాలు అన్నీ బహిరంగ రహస్యాలే..
స్వాతంత్ర్యం తర్వాత ప్రథమ ప్రధాని నెహ్రూ దేశ భద్రతను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు.. మన సైన్యానికి తగినన్ని ఆయుధాలు, వాహనాలు లేవు.. సరిహద్దుల దగ్గర పటిష్టమైన భద్రత కరువైంది.. కనీసం సైన్య నిర్వహణకు సరిపడే బడ్జెట్ కూడా ఇవ్వలేని దుస్థితి.. సైన్యాన్ని ఆధునీకరించకుండా, బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా వచ్చిన విధానాలే కొనసాగించారు.. అలీన ఉద్యమం పేరుతో శాంతి దూతగా పేరు తెచ్చుకొని నోబెల్ బహుమతి కొట్టేయాలనే ఆలోచనతో ఉన్న నెహ్రూ పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును తక్కువ అంఛనా వేశారు..
 చైనా అప్పటికే మన దేశంలో ఉన్న సరిహద్దుల విషయంలో పేచీ పెడుతోంది.. పైగా తాము ఆక్రమించిన టిబెట్ అధిపతి దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడాన్ని సహించలేకపోయింది.. అదను కోసం ఎదురు చూస్తోంది.. కానీ నెహ్రూ మాత్రం ఆదేశాన్ని గుడ్డిగా నమ్మారు.. ఆ దేశంలో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకొని, హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ మురిసిపోయారు.. ఇలాంటి పగటి కలలను భగ్నం చేస్తూ చైనా విరుచుకుపడింది.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇప్పటికీ చైనా ఆక్రమణలోని మన భూభాగాలు విముక్తి పొందలేని దుస్థితిలో ఉన్నాం..
1962 నాటి యుద్దం నుండి మన ప్రభుత్వం ఏమైనా గుణపాఠాలు నేర్చుకుందా అనే ప్రశ్నకు లేదని చెప్పడం ఎంతో విచారాన్ని కలిగిస్తోంది.. చైనాతో ఉన్న కీలక సరిహద్దుల రక్షణపై ఇప్పటకీ సరైన దృష్టి పెట్టలేదు.. తరచూ ఆ దేశ సైన్యం మన భూభాగంలోకి వచ్చి తిష్ట వేస్తున్నా, కొద్ది రోజుల తర్వాత కానీ సమాచారం అందని దుస్థితి.. చైనాకు ధీటుగా జవాబు చెప్పే సత్తా మనకు ఉందా అంటే నీళ్లు నమిలే దుస్థితిలోఉన్నాం.. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ చేసిన ప్రకటన ప్రకంపణలు సృష్టించింది.. భారత్ కు ప్రధమ శత్రువు చైనా అని కుండ బద్దలు చేశారు ఆయన.. నిజమే ఇది.. పాకిస్తాన్ మనకు కలనిపించే శత్రువు అయితే, చైనా కనపడని శత్రువు.. పాకిస్తాన్ కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించేది చైనాయే.. మన దేశం చుట్టూ ఉన్న దేశాలు క్రమంగా చైనా కౌగిలిలోకి పోతున్నాయి.. భారత్ ఇప్పుడు చైనా నుండి పెను సవాళ్లను ఎదుర్కొంటోంది.. గత పదేళ్లుగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ(కాంగ్రెస్) ప్రభుత్వం నెహ్రూ విధానాలనే ఇంకా గుడ్డిగా అనుసరిస్తూ వచ్చింది.. సమస్య తీవ్రత మరింతగా పెరిగింది..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఇది.. 1962 నాటి పరాజయం, దేశ రక్షణనకు సంబంధించిన సమస్యలు ఇప్పుడు చర్చకు రావడం మంచిదే.. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో దేశ ప్రజలంతా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment