Wednesday, March 5, 2014

కాల పరీక్షకు సిద్దం కండి..

2014 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది.. దేశ వ్యాప్తంగా 81.6 కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు.. 9 విడతలుగా సాగే ఈ పోలింగ్ ఏప్రిల్ 7న ప్రారంభమై మే 12న పూర్తవుతాయి.. ఫలితాలను మే 16న ప్రకటిస్తారు.. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగబోతున్నాయి..
జూన్ 2 తెలంగాణ ఏర్పడుతోంది.. ఈలోగానే సమైక్యాంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు పూర్తవుతాయి.. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భావి ప్రభుత్వాలను ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు తెలుగువారికి చాలా కీలకమైనవి.. రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న ప్రజలు ఎలా తీర్పు ఇస్తారనే ఆసక్తి తెలుగువారికే కాదు దేశ వాసులందరికీ ఉంటుంది..
రాష్ట్ర విభజన ఒకరికి సంబరం అయితే, మరొకరికి విచారం కలిగిస్తోంది.. విభజనకు ఎన్నికల తీర్పుకు సంబంధం లేదు.. అయినా విభజన ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది..  విభజన సరైందా, కాదా అనే చర్చ ఇక అసందర్భమే.. ఫలితాలు కూడా ఈ ప్రక్రియను ఆపే అవకాశం లేదు.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అన్ని పార్టీలకూ రాష్ట్ర విభజన ప్రక్రియలో పాత్ర ఉంది.. అయితే లాభాన్ని స్వీకరించేందుకు ముందుండే వారు నష్టం అంటే భయపడటం సహజం..
తెలంగాణలో తెలంగాణ మేమే తెచ్చాం అని గొప్పలకు పోతున్న పార్టీలు, సీమాంధ్రకు పోయే సరికి రాష్ట్ర విభజనకు మీరంటే మీరే కారణం అని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.. ఇలాంటి గుంట నక్క పార్టీలకు కచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పదు.. ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకునే సందర్భం ఇది..  మనం తీసుకునే నిర్ణయం ఇరు రాష్ట్రాల భవిష్యత్ ప్రయోజనాకు ఆశాజనంగా ఉండాలి.. ఇంకా ఉద్రేకాలకు ఉద్వేగాలకు పోయి తీర్పును ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు.. ఏది సబబో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మన ఓటు భవితను మార్చేలా ఉండాలి..

జైహింద్..

No comments:

Post a Comment