Tuesday, March 25, 2014

ఫలక్ నూమా అద్దం..

నా చిన్నప్పడు మా ఇంటి పైకి వెళ్లి చూస్తే ఫలక్ నూమా ప్యాలస్ ఎంతో అందంగా, గంభీరంగా కనిపించేది.. నేను పుట్టి పెరిగిన బస్తీలో వినిపించిన ముచ్చట ఇది..
ఫలక నూమల ఓ అద్దం ఉంది.. ఎవ్వలన్నా అబద్దం ఆడితే, గా అద్దంల బరుబత్తల (నగ్నంగా) కనిపిస్తరు.. అబద్దాలు ఆడేటోళ్లను నిజాం నవాబు అద్దం ముంగట నిలబెడ్తడు.. బర్బత్తల ఉన్నట్లు కనిపిస్తే హంటర్ తో కట్టించి పంపుతడు..
పసిప్రాయంలో ఆ ముచ్చట నిజమే అని నమ్మాను నేను.. నిజంగా ఫలక్ నూమా ప్యాలస్ లో అలాంటి అద్దం ఉందా? అబద్దం ఆడితే మన పరిస్థితి ఏమిటి అనే భయపడే వాన్ని.. కానీ వయసు, బుద్ధి పెరిగిన కొద్దీ అసలు ఈ కథే ఒక అందమైన అబద్దం అని అర్థమైపోయింది.. ఇక ధైర్యంగా అవసరమైప్పడు చిన్న చిన్న అబద్దాలు ఆడటం మొదలు పెట్టాను..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన ఇళ్ల ముందుకు పిలవని చుట్టాళ్లా నాయకులు ఊడిపడతారు.. వాగ్దానాలు ఎన్నో ఇస్తారు.. అవి చేస్తాం, ఇవి పరిష్కరిస్తాం అంటూ అర చేతిలోనే స్వర్గాన్ని చూపిస్తారు.. గొర్రె కసాయిని నమ్మినట్లు నమ్మేస్తాం.. గెలిపించి చట్ట సభలకు పంపుతాం.. కాలం గడుస్తున్న కొద్దీ వారి మాటలు పెద్ద అబద్దాలు, చెల్లని ప్రామిసరీ నోట్లని అర్ధం అవుతుంది.. ఏదైనా పని పడా వారి దగ్గరకు పోతే, అసలు ఎవడీడు అన్నట్లు చూస్తారీ వెధవలు.. సాటి మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వరు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిగ్గు లేకుండా మళ్లీ ఊడిపడతారు.. మీకు ఎంతో చేశాం.. మీరు ఇంకా బతికే ఉన్నారంటే అది మా పుణ్యమే అని చెవులో పూలు పెడతారీ దగుల్భాజీలు.. ఈసారి కొత్తగా ఇవి చేయబోతున్నాం అని మరోసారి నమ్మజూపుతారు.. వారు చెప్పేవన్నీ అబద్దాలే అని తెలుసు.. కానీ ఏదో మూలన ఉన్న చిన్న ఆశ మళ్లీ నమ్మేలా చేస్తుంది..

ఇలాంటి సమయంలో నాకు అనిపిస్తుంది.. ఆ ఫలక్ నూమా అద్దం నిజంగానే ఉంటే ఎంత బాగుండునో అని చేను కూడా ఈ దగుల్భాజీలను అద్దం ముందు నిలబెట్టి, మీరు బరుబత్తల ఉన్నార్రా అని తేల్చి నాలుగు తగిలించి పంపేవాన్ని కదా అని.. (క్రాంతి దేవ్ మిత్ర)

No comments:

Post a Comment