Monday, March 10, 2014

ఏం సాధించాలని ఈ పార్టీ?

కథ కొత్తదేం కాదు.. పాతదే. టైటిలూ పాతదే.. అయినా చూడాలట ఈ సినిమా..ఈ మధ్య టీవీల్లో ట్రైలర్లు, ఎఫ్ఎంలలో పాటలు వినీ వినీ.. పత్రికల్లో రివ్యూలు చూసీ చూసీ సదరు చిత్రాలు చూడాలనిపించడం లేదు..
నిన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతాడని వింటూనే ఉన్నాం.. టీవీల్లో, పత్రికల్లో రెండు నెలలుగా జోరుగా సాగిన ప్రచారం ఆచరణలోకి వచ్చేసింది.. జై సమైక్యాంధ్ర పార్టీ.. (టైటిల్ ఊహించిందే.. లేదా ముందుగా ప్రచారం చేయబడిందే)
తెలంగాణ ఏర్పాటు ఖాయమని చాలా నెలలుగా అందరికీ తెలుసు.. నిజంగానే అడ్డుకునే తలంపు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో అడ్డుకునేవారు.. అది అసాధ్యమేం కాదు..
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడం.. క్యాబినెట్ లో ఆమోదించడం.. పార్లమెంట్  ఉభయ సభలో బిల్లు పెట్టి పాస్ చేయించడం.. దీనంతటికి రెండు, మూడు నెలలు పట్టింది..
తెలంగాణ రాదు గాక, రాదు.. మా స్టార్ బ్యాట్ మెన్ అడ్డుకుంటారని ఆయనగారి విధేయుడు గొప్పలకు పోయారు..  కానీ ఫలితం ఏమైంది జరగాల్సింది జరిగింది..
అధిష్టానం తన అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని, తెలంగాణ ఇవ్వడానికే సముఖంగా ఉందని తెలియగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా ఇస్తే ఆయనకు కాస్త గౌరవం దక్కేది.. హుందాగా ఉండేది.. కానీ కిరణ్ గారు చివరి వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.. అన్ని పనులూ చక్కబెట్టుకున్నారు.. చివరకు రాజీనామా ఇచ్చేశారు..
ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. జై సమైక్యాంధ్ర పార్టీ అంటున్నారు..
తాను ముఖ్యమంత్రిగా ఉండి కాపాడలిన సమైక్యాంధ్రను, పార్టీ పెట్టి కాపాడాడట.. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూశారా?.. సరే కిరణ్ గారి పార్టీ గెలిచి ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారనే అనుకుందాం.. తెలంగాణ, సీమాంధ్రలను కలిపి మళ్లీ సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయగలరా?

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే చేయలేని పనిని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి చేస్తానంటే నమ్మేదెవరు?

No comments:

Post a Comment