Thursday, March 6, 2014

ఎవరు హీరో?.. ఎవరు విలన్?

తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది.. సోనియా గాంధీ దేవత.. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారు.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రచారం. కొందరు అయితే ఆమెకు గుడి కడుతున్నారు.. తెలంగాణ తల్లి అంటూ కొలుస్తున్నారు.. తెలంగాణకు సోనియా ప్రదేశ్ అని పెట్టాలట.. ఒకాయనైతే నిండు పార్లమెంటులో ఆమె కాళ్లకు దండం పెట్టేశాడు..
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే అయితే, ఆ విషయాన్ని ఆమె పార్లమెంట్ లో ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేదు?.. ఎందుకుమౌన వ్రతం పాటించారు?.. ఎందుకు అంత భయపడిపోయారు.. మీ భావి ప్రధాని రాహుల్ గాంధీ పార్లమెంట్ రాకుండా ఎక్కడ దాక్కున్నాడు?

అసలు కాంగ్రెస్ నాయకులు ఎవరి చెవిలో పూలు పెడదామనుకుంటున్నారు.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లగానే చేసిన పాపం పోయినట్లేనా? తెలంగాణ ఇవ్వాలనే ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్లు? మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన వేయికి పైగా బలి దానాలు, ఆత్మాహుతులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? మీ జాప్యం కారణంగానే కదా తెలంగాణ ఇక రాదనే అందోళనతో వారు ఈ పనికి పాల్పడింది.. క్రెడిట్ తీసుకుంటున్నారు సరే.. మరి సమస్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకు మూల్యం కూడా చెల్లించాలి కదా?
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడానకి కారణం ఎవరు?.. 1969 తెలంగాణ ఉద్యమానికి కారణం ఎవరు?.. ఈ ఉద్యమాన్ని కఠినంగా అణచివేసి నిరసన కారులను పొట్టన పెట్టుకుంది ఎవరు?.. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితిని కలుపుకునే సమయంలో చేసుకున్న ఒప్పదాలను అమలు చేశారా? ముల్కీ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం తుంగలో తొక్కింది ఎవరు?.. 610 జీవో అమలు కాకుండా  తొక్కిపెట్టింది ఎవరు?.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలును సరి దిద్దకపోగా ఈ సెంటిమెంటును స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నది కాంగ్రెస్ నేతలే కదా?.. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మధ్యలో వచ్చిన తెలుగు దేశం ప్రభుత్వానికీ ఈ తప్పుల్లో భాగం ఉంది..
రెండో దశ తెలంగాణ ఉద్యమం వచ్చాక తెలంగాణ ఇస్తామని చెప్పి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వాగ్దానం చేసి పొత్తు పెట్టుకొని గెలిచాక,  ఎస్సార్సీల పేరిట మాట మార్చింది ఎవరు? 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్లీ నివేదిక అంటూ శ్రీకృష్ణ కమిటీ పేరిట కాలాయాన చేసింది ఎవరు? మీరు చేసిన జాప్యం కారణంగానే కదా బలిదానాలు, ఆత్మాహుతుల పరంపర కొనసాగింది.. కుంభకోణాలు, అవినీతి, అసమర్థ పాలన కారణంగా కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో కనీసం ఈ ప్రాంతంలో అయినా ఉనికిని కాపాడుకోవచ్చని కాంగ్రెస్ భావించింది.. పైగా తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కాలనే తాపత్రం కాంగ్రెస్లో మొదలైంది.. ఇక తప్పని పరిస్థితి రావడం వల్లే తెలంగాణ ఏర్పాటు వైపు మొగ్గు చూపారు.. విభజన తప్పదని ఏనాడో తెలిసినా, ఇంత సమయం తీసుకున్నా ఈ పనైనా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు.. వారాలు, నెలల తరబడి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించి, చివరకు రాజధాని లేని సీమాంధ్రతో సరికొత్త రగడను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ..
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే అయితే, ఆ విషయాన్ని ఆమె పార్లమెంట్ లో ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేదు?.. ఎందుకుమౌన వ్రతం పాటించారు?.. ఎందుకు అంత భయపడిపోయారు.. మీ భావి ప్రధాని రాహుల్ గాంధీ పార్లమెంట్ రాకుండా ఎక్కడ దాక్కున్నాడు?

ఇప్పడు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్రకు విలన్ అయిపోయింది.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ కలుస్తుందన్న ఆత్యాశ అడియాస అయిపోయింది.. ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదే.. ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీని క్షమించేద్దామా? శిక్షిద్దామా?..


No comments:

Post a Comment