Friday, May 23, 2014

ఒక నిమిషం.. నిండు ప్రాణాలను తీసింది..

ఎంసెట్ నిర్వాహకుల మతిలేని విధానం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చలగాటం ఆడుతోంది.. ప్రపంచంలోని ఏ పరీక్షలకూ లేని తుగ్లక్ విధానం ఇది.. నిమిషయం ఆలస్యం అయిందనే కారణంతో పరీక్షకు అనుమతించకపోవడం ఎంత దర్మార్గం.. 
ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులకు గేట్ వే లాంటి ఎంసెట్ ప్రవేశ పరీక్ష లక్షలాది మంది తల్లిదండ్రులకు జీవన్మరణ సమస్యగా మారింది.. వేలాది రూపాయలు దారపోసి సంవత్సరమంతా కోచింగ్ తీసుకుంటారు.. పిల్లలు ఆకలిదప్పులు, నిద్రాహారాలు త్యాగం చేసి తమ లక్ష్యం కోసం కష్టపడతారు.. తీరా పరీక్ష కేంద్రానికి నిమిషయం ఆలస్యం చేరాడనే సాకుతో అనుమతి ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి?..
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారంటే ఎన్నో కారణాలు ఉంటాయి.. ఎంత ముందుగా బయలు దేరినా దారిలో ట్రాఫిక్ సమస్యనో, వాహనం చెడిపోవడమో, ప్రమాదానికి గురి కావడమో, బస్సు, రైలు ఆలస్యమో.. ఏదో కారణం కచ్చితంగా ఉంటుంది.. ఎవరూ ఉద్దేశ్య పూర్వకంగానో, కుట్ర పూరితంగానో ఆలస్యంగా రారు.. ఇంకాస్త అడ్వాన్స్ గా ఇంటి నుండి బయలు దేరవచ్చుకదా అనే కుంటి సలహాలు ఇక్కడ అనవసరం..
జేఈఈ మెయిన్స్, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు లేని ఒక నిమిషం నిబంధన ఎంసెట్ కే ఎందుకు?.. ఆలస్యంగా వస్తే దాని తాలూకు ఫలితం అనుభవించేది విద్యార్థే కదా? మీ సొమ్మేం పోయింది..
నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బాహార్ పేటకు చెందిన రాఘవేందర్ తన కొడుకూ ఉదయ్ కుమార్ ను తీసుకొని బైక్ మీద ఎంసెట్ పరీక్షా కేంద్రానికి బయలు దేరాడు.. వెనక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీ కొని రాఘవేందర్ అక్కడిక్కడే మరణించాడు.. నాన్నా..లే నాన్నా.. వెళ్దాం నాన్నా.. అంటూ ఆ తనయుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు.. తండ్రి ఇక లేడనే బాధలోనూ ఆయనకు ఆశయం గుర్తుకు వచ్చింది.. తనను ఇంజినీర్ చేయాలనే తండ్రి కలను సాకారం చేసేందుకు అంతడి బాధలోనూ ఎంసెట్ పరీక్ష రాశాడు..

కనీసం ఈ కన్నీటి సంఘటన అయినా ఎంసెట్ నిర్వాహకులు హృదయాలను కరిగించాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment