Thursday, May 22, 2014

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి..

దాసుడి తప్పులకు దండంతో సరి అని క్షమించొచ్చు.. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో?.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అర్ధంతరంగా రాజీనామా చేసినందుకు క్షమించమంటున్నాడు.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తాడట.. ఏ మొహం పెట్టుకొని?..
తెలివైనవాడు వనరులను జాగ్రత్తపరచుకొని, కొత్త మార్గాలవైపు అన్వేషణ సాగిస్తాడు.. కానీ అధికారం అనేది బంపర్ లాటరీ కాదు.. రాత్రికి రాత్రే విజయం ఇంటి ముందుకు రావడానికి.. ఢిల్లీ సీఎం పదవిని తాకట్టుపెట్టి ఇండియా పీఎం కావాలని కలలు కన్నాడా?.. చిత్తుగా ఓడిపోతానని తెలిసి కూడా నరేంద్ర మోదీపై పోటీ చేయడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకొని, మళ్లీ ఢిల్లీ పీఠం కోసం ప్రయత్నం చేయడం పిచ్చి కాకపోతే మరేంటి? ఆయనగారు కోరిన వెంటనే ఎన్నికల నిర్వహించాలట.. పాపం ఈసీ పని లేకుండా ఉందేమో?
కేజ్రీవాల్ కు రాజకీయ అనుభవం లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, కానీ అతని నిజాయితీని శంకించలేం అంటూ కొందరు మిత్రులు చెబుతున్నారు.. నమ్మగలమా?.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విషయంలోనూ స్పష్టత లేదు.. జాతీయ విధానాలు లేవు.. కాశ్మీర్ వేర్పాటు వాదులకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే నీళ్లు నలుముతుంది తప్ప జవాబు ఇవ్వదు.. ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తే, సీఎం ధర్నా చేయొద్దని రాజ్యాంగంలో ఉందా అని ఎదురు ప్రశ్నిస్తాడు కేజ్రీవాల్.. మరి సీఎం ధర్నా చేయవచ్చని ఎక్కడ రాసి ఉంది అని అడిగితే సమాధానం దాటేస్తాడు.. ఏం చేస్తాం తెలివి ఆయనొక్కడి సొంతమనుకుంటాడు..
ప్రత్యర్థులపై బురద చల్లి మీడియాలో ప్రచారం పొందడం అరవింద్ భాయికి వెన్నతో పెట్టిన విద్య.. అక్కడే బోల్తా పడ్డాడు.. నితిన్ గడ్కారీపై చేసిన అవినీతి ఆరోపణలకు గాను పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నాడు.. ఆధారాలు ఏవంటే చెప్పడు.. బెయిల్ కోసం 10 వేల పూచికత్తు కట్టమంటే కట్టనన్నాడు.. తప్పు చేయనప్పడు బెయిల్ ఎందుకు తీసుకోవాలి, అండర్ టేకింగ్ మాత్రమే ఇస్తానని లా పాయింట్ లేవనెత్తాడు.. జడ్జీగారికి వళ్లు మండి మూడు రోజుల కారాగారవాసం ప్రసాదించారు మన గజిబిజి వాలాకు..

సో.. నేను పునరుద్ఘాటించేది ఏమిటంటే తెలివి అనేది ఇకడి సొంతం కాదు.. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు..

No comments:

Post a Comment