Saturday, May 3, 2014

విలువల పతనం..

కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఓ నటుడి వీరాభిమాని అయిన టీనేజర్, నా కామెంట్స్ ను ఖండిస్తూ బాబూ క్రాంతీ.. అని సంబోధించాడు.. అతడు పుట్టింది 1990లో.. అప్పటికి నా వయస్సు 17 ఏళ్లు.. అతని కన్నా  పెద్దవాన్ని కాబట్టి బాబూ అనే సంబోధన సరికాదు అని చెప్పడానికి తమ్ముడూ.. అంటూ రాశాను.. వెంటనే అతని దగ్గర నుండి వచ్చిన ఎదురు దాడి... ఎవడు నీకు తమ్ముడు.. అని.. అతనిపై నాకు కోపం రాలేదు.. కొందరి సంస్కారం అంతే అని అంతటితో వదిలేశాను..
ఈ విషయాన్ని ఎందుకు ప్రస్థావిస్తున్నానంటే సమాజంలో  పతనమవుతున్న విలువల గురుంచి చెప్పడానికే.. నేను చదువుకున్న వాతావరణంలో సంస్కారానికి పెద్ద పీట ఉండేది.. పెద్దలను గౌరవించాలని, ఎదుటి వారితో సభ్యతగా మాట్లాడాలని, చెడ్డగా మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు, పాఠశాలలో గురువులు చెప్పేవారు.. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది.. పెద్దవారిని చాదస్తపు మనుషులుగా చూస్తున్నారు.. దిక్కుమాలిన సినిమాల ప్రభావంతో వరే అన్నయ్యా.. అని పిలుస్తున్న రోజులు ఇవి..
మన పాఠశాల్లో ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు, ర్యాంకులు సాధించాలంటూ విద్యార్థులపై వత్తిడి తెస్తుంటారు.. మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం అంటూ తల్లిదండ్రులు పోరు పెడుతుంటారు.. ఇలా కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ తమ పిల్లలు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకునేవారున్నారా అసలు? అనిపిస్తోంది..
దీనికంతటికీ కారణం ఒకటే మన చదువుల్లో నైతిక విద్య లోపించడమే.. కొన్నేళ్ల క్రితం వరకూ కూడా పాఠశాల్లో నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు, సూక్తులు చదివించేవారు.. వాటి ప్రభావం విద్యార్థులపై జీవితాంతం ఉండేది.. కానీ ఈనాటి చదువుల్లో ఆ పరిస్థితి ఉందా?...
మరీ బోరు కొట్టిస్తున్నానేమో సెలవు..

No comments:

Post a Comment