Friday, May 30, 2014

పోలవరం గోల..

పోలవరంపై ఇప్పుడు చేస్తున్న గోల అర్థంలేని మూర్ఖత్వం.. పోలవరం ప్రాజెక్టును కడితే లాభాలేమిటి? నష్టాలేమిటి అనే చర్చ చాలా కాలంగా ఉన్నా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందరికీ తెలిసొచ్చింది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంతకాలం పట్టించుకోకుండా నిద్రపోయిన వారు ఇప్పుడేదో కొత్తగా ఏదో జరిగిపోయిందని గొంతు చించుకు అరుస్తున్నారు.. వాస్తవాలను మరుగుపరచి అవతలి వారిపై బురద చల్లుతున్నారు..
ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలనే నిర్ణయం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైనప్పుడే తీసుకున్నారు.. ప్రత్యేక రాష్ట్రం వస్తుందనే ఆనందంలో దీన్ని తెలంగాణలోని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోలేదు.. నిజానికి ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన అవసరం ఏమిటి? కలపకపోతే నష్టపరిహారం, పునరావాసం కల్పించడం ఇబ్బంది ఉంటుందని చెప్పేవారు ఒక విషయాన్ని ఆలోచించాలి..
పోలవరం కడితే నష్టపోతున్నది ఖమ్మం జిల్లా గ్రామాలు మాత్రమే కాదు.. ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాల గ్రామాలకు కూడా ముంపు ప్రమాదం ఉంది.. మరి ఆ గ్రామాలను నష్టపరిహారం, పునరవాసం పేరిట సీమాంధ్రలో కలుపుకుంటారా? వారికి వర్తించని సూత్రం తెలంగాణ విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నట్లు?
అసలు పోలవరం ప్రాజెక్టు డిజెన్ మార్చాలనే డిమాండును ఎందుకు పట్టించుకోవడం లేదు?.. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం నిర్మిస్తే ప్రయోజనాలు, లాభాల మాటేమిటో కానీ అనర్ధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మామూలు వరద రోజుల్లోనే భద్రాచలం పట్టణం నీట మునగడాన్ని మనం చూస్తున్నాం.. పోలవరం కడితే శాశ్వత జలసమాధి ఖాయం.. ఎంతో విలువైన ప్రకృతి సంపద, గిరిజనుల ఆవాసాలు, వారి సంస్కృతి, కొండలు, కోనలు, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది.. పాపికొండల అందాలను ఇకపై చూలేం.. ఈ ముప్పును నివారించాలంటే డిజైన్ కచ్చితంగా మార్చాల్సిందే..

పోలవరం విషయంలో రాజకీయ పార్టీలు తమ స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలు పక్కన పెట్టి నిండు మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను..


No comments:

Post a Comment