Tuesday, January 21, 2014

చరిత్రకు వక్రభాష్యాలు వద్దు..

రాష్ట్ర విభజన పుణ్యమా అని కొత్త చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది.. అసెంబ్లీ రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా హైదరాబాద్ చరిత్రకు కొత్త భాష్యం చెబుతున్నారు మన నాయకులు..
నిరంకుశ పాలకుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ విషయంలో ఎలాంటి సానుభూతి చూపాల్సి అవసరం లేదు.. ఆయన ప్యూడల్ పాలన, రజాకార్ల రక్త చరిత్ర అందరికీ తెలుసు.. తెలియని వారు ఇంకా బతికే ఉన్న మన తాతయ్యలను అడిగితే చెబుతారు.. ఈ విషయాలను పక్కన పెడి
తే చరిత్రకు వక్ర భాష్యం చెబుతున్న తీరు అత్యంత విచారకరం.. అసలు వీరికి చరిత్ర తెలుసా? తెలిసినా తమ స్వార్ధ ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారా? ఒకసారి గమనించండి...
400 ఏళ్ల పాలనలో నిజాం సికింద్రాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేస్తే, 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను మొత్తం అభివృద్ధి చేశాను.. సింగపూర్ తో సమానంగా.. చంద్రబాబు నాయుడు
(బాబు గారూ మీరు పుట్టి, హైదరాబాద్ రాక ముందే ఇది ఎంతో అభివృద్ధి చెందింది చరిత్ర చదవండి.. సికింద్రాబాద్ బ్రిటిష్ వారి పెత్తనంలో ఉండేది, నిజాములకు సంబంధం లేదు)
నిజాం ప్రభువును పొగిడేందుకు గర్వ పడతాను, ఆయన నిజమైన సెక్కులరిస్టు అక్బరుద్దీన్ ఓవైసీ
(అవును మీరు రజాకార్ వారసులు కదా గర్వపడక ఏమి చేస్తారు.. నిజాం పాలనలో హిందువులపై జరిగిన అరాచకాలకు ఎందుకు విచారిస్తారు లెండి..)
తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం వెనుక కుట్ర దాగి ఉండి.. దొడ్డి కొమరయ్య నేలకొరుగుతూ జై ఆంధ్ర మహా సభ అన్నాడు పయ్యావుల కేశవ్
(అవునవును మీ దృష్టిలో ప్రత్యేక రాష్ట్రం కోరడం కుట్ర కిందే లెక్క.. అది సరే కానీ కొమరయ్య విషయంలో కొత్తగా పరిశోధన చేసిన మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే.. ఇంకా నయం జై తెలుగు దేశం అనలేదు..)
సీడెడ్ జిల్లాలను నిజాం అమ్మేయలేదా? ధూలిపాళ్ల నరేంద్ర
(అయ్యా నిజాం సీడెడ్ ను అమ్మేయలేదు.. సైన్య సహకార పద్దతిలో భాగంగా  బ్రిటిష్ సైన్యం రక్షణ స్వీకరించిన నిజాం బకాయిలను చెల్లించడనందుకు వారు లాగేసుకున్నారు.. కోస్తా జిల్లాల విషయమూ అంతే)
నిజాం పాలనలో బానిసత్వం, నిరంకుశత్వం, బానిసత్వం, అణచివేత ఉండొచ్చు కానీ అభివృద్ధి కూడా జరిగింది.. ఈటెల రాజేందర్ (నిజాంను పొగడటం, ఎందుకు సన్నాయి నొక్కులు ఎందుకు?)
మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన నిజాం దుర్మార్గుడు.. అతన్ని పొగడటం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే మోత్కుపల్లి నర్సింహులు
కొన్ని మంచి పనులు చేసినంత మాత్రాన నిజాం మంచి వాడంటే, బ్రిటిష్ వారిని ఏమనాలి జూలకంటి రంగారెడ్డి
తుపాకుల సామర్ధ్యం పరిశీలించడానికి 86 మందిని చంపిన దుర్మార్గుడు నిజాం యెండల లక్ష్మీనారాయణ
(భేష్.. ఈ ముగ్గురు నాయకులు వాస్తవంగా మాట్లాడారు.. మిగతావారు వీరిని చూసి నేర్చుకోవాలి)
ఇది నా దృష్టిలో పడిన వ్యాఖ్యలకు స్పందన మాత్రమే.. ఇంకా ఏవైనా ఉంటే దీనికి కలుపుకోవాలని మిత్రులకు మనవి.. 

టీఆర్ఎస్ అయినా, ఎంఐఎం అయినా నిజాం భజనను ఏమాత్రం అంగీకరించలేం.. నిజాం నవాబు అంత గొప్పోడు అయితే ఆయన పాలనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం సాగినట్లు?.. పోలీస్ యాక్షన్ ఎందుకు జరిగినట్లు.. మా నిజాము రాజు తరతరాల బూజు అని దాశరధి కృష్ణమాచార్య చెప్పింది మరిచిపోయారా? ఒక పాలకుడుగా, పాలనా అవసరాల దృష్ట్యా అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడు.. అది వారి తప్పనిసరి విధి.. కొన్ని మంచి పనులను చూపించి ఏకంగా నిజాం భజన చేయడం సహించరాని విషయం.. చరిత్రను ఇష్టానుసారం వక్రీకరించుకోవడం సహించరాని విషయం.. ముందు వాస్తవ చరిత్రను అధ్యయనం చేసి మాట్లాడండి.. నిజాం భజన ఆపి రాష్ట్ర విభజన సవ్యంగా జరిగేలా చూడండి చాలు..

No comments:

Post a Comment