Wednesday, April 8, 2015

అలసత్వమే ఉగ్రవాదానికి ఊతం..

ప్రభుత్వాల అలసత్వమే ఉగ్రవాదానికి ఊతం.. కఠినంగా వ్యహరించాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం ఉపేక్షించినా నెత్తికెక్కి కూర్చుంటారు ఉగ్రవాదులు.. భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర చెబుతున్న సత్యం ఇది.. తెలంగాణ ఇందుకు భిన్నం కాదు..
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత హోంమంత్రి  చేసిన బాధ్యతా రహిత ప్రకటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.. అది దోపిడీ దొంగల పని, వారు ఉగ్రవాదులు కాదన్నారు.. జానకీపురంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించి నేరగాళ్లను మట్టు బెట్టిన తర్వాత కూడా హోంమంత్రి పల్లవి మారలేదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయొద్దు అనే కోణంలో మాట్లాడారు.. ఇంట్లో కంపు పెట్టుకొని మా ఇంటికి రండి అంటూ అతిథులను ఆహ్వానించగలమా?
చేతిలో సరైన ఆయుధాలు లేకుండానే ఉగ్రవాదుల వేట సాగించి, సహచరులను పోగొట్టుకున్నారు పోలీసులు.. అయిన వెనుకాడలేదు.. తుదిదాకా పోరాటం సాగించి వారిని హతమార్చారు. ప్రజలచే జేజేలు కొట్టించుకున్నారు. అదే ఊపులో కరడు గట్టిన ఉగ్రవాది వికారుద్దన్ గ్యాంగ్ పోలీసుల ఎస్కార్ పార్టీ చేతిలో హతమైపోయింది.. తెలంగాణ పోలీసులు ప్రజల దృష్టిలో హీరోలుగా అభినందనలు పొందుతున్నారు.
ప్రభుత్వం ముందుగానే అప్రమత్తంగా ఉంటే ఉగ్రవాదులు ఇంతగా బరి తెగించేవారా? ఓటు బ్యాంకు రాజకీయాలతో టాడా వంటి కఠిన చట్టాలను చెత్తబుట్టలో పడేసిన ఘనత మన ప్రభుత్వాలది. ఎక్కడ ఏ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పోలీసులు చాలా విషయాల్లో చేతులు ముడుచుకు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేటలో సీఐ దగ్గర సమయానికి ఆయుధం అందుబాటులో లేదట.. మిగతా పోలీసుల దగ్గర ఆయుధాలు లేదు.. ఉగ్రవాదులను వీరోచింతంగా వెంటాడిన మరో పోలీసు అధికారి తుపాకీ మొరాయించి విధిలేక వెనుదిరిగాడు. ఇదంతా ఒక ఎత్తయితే కాశ్మీర్లో మరణించిన ఓ జవానుకు స్వస్థలం పాలమూరు జిల్లాలో అంత్యక్రియల సందర్భంగా గౌరవవందనం సమర్పిస్తుండగా పేల్చాల్సిన తుపాకులు మొరాయించాయి.. ఏమిటీ దురవస్థ..

మన పోలీసు వ్యవస్థను న్యూయార్క్, సింగపూర్ రేంజికి తీసుకుపోవాలన్న పాలకుల ఆశయంలో తప్పులేదు.. వారికి సరికొత్త వాహనాలు ఇస్తే చాలదు.. ఆధునాతన ఆయుధాలు, శిక్షణ కూడా అవసరం.. రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఇవ్వాలి. అలాగే మన చట్టాలను పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఉగ్రవాదులపై పోరులో వీర మరణం పొందిన నల్లగొండ పోలీసులకు ఘనంగా నివాళులర్పిద్దాం..

No comments:

Post a Comment