Monday, April 27, 2015

పాక్ నుండి స్వేచ్చే లక్ష్యం..

పాకిస్తాన్ మా వనరులను కొల్లగొడుతోంది. ఇక్కడి నీరు, ఖనిజ సంపద తరలించుకుంటోంది.. కానీ మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది, అక్కడ మాకు ఎలాంటి రాజ్యాంగ పరమైన హక్కులు లేవు.. అంటున్నారు ప్రొఫెసర్ సెంగె హస్నన్ సెరింగె.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్ బాల్తిస్తాన్ వాసి ప్రొ.సెరెంగె అమెరికా కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిల్గిత్ బాల్తిస్తాన్ సంస్థను నిర్వహిస్తూ దానికి డైరెక్టర్ గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం (హైదరాబాద్) ఆహ్వానం మేరకు రెండు రోజులు నగరంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారాయన. జర్నలిస్టులు, మేధావులు, స్థానిక ముస్లింల ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. The Unknown Kashmir : Plight of Gilgit Baltistan అనే అంశంపై పురజనుల సభలో ప్రసంగించారు సెంగె హస్నన్ సెరింగె.
భారత దేశంలో పురాతన సాంస్కృతిక వారసత్వం సంబంధాలను గుర్తు చేశారు ప్రొ.సెరెంగె. గల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ బలవంతంగా కలిపేసుకున్నా, తమ మనుసులను మాత్రం జయించలేకపోయిందని అన్నారు. పాక్ పాలకులు తమను ద్వితీయ శ్రేణి పౌరులగానే చూస్తున్నారని తెలిపారు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న తమ నాయకుల గొంతులు నొక్కేస్తున్నారని, ప్రజలపై అరాచకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గిల్గిత్ బాల్తిస్తాన్ లో జరిగే నేరాలపై విచారణ, శిక్షల శాతం ‘0’ అని స్పష్టం చేశారు. ఇస్లామిక్ ఛాందస వాదులకు, తాలిబాన్లకు తమ ప్రాంతం కేంద్రంగా మారిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో చైనా పెడుతున్న పెట్టుబడులు తమ ప్రాంత అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడవని, గిల్గిత్ ప్రాంతం వారికి ఒక ట్రాన్సిట్ హబ్ మాత్రమే అంటున్నారు. మధ్య ఆసియా దేశాలకు కూడలిగా ఉన్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రజలు భారత దేశంతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు ప్రొ.సెరింగె.. జమ్మూ కాశ్మీర్తో రోడ్డు మార్గం తెరచుకుంటే తమ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

భారత దేశంతో తమకు సంస్కృతిక వారతస్వం సంబంధాలు ఉన్నా, గత 70 దశాబ్దాలుగా ఏర్పడ్డ అంతరం వల్ల ఇప్పటి తరానికి పెద్దగా మానసిక బంధం లేకుండా పోయిందని ప్రొ. సెరెంగె తెలిపారు. పాక్ చెరలో మగ్గిపోతున్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్వేచ్ఛను కోరుకుంటోందని, భారత్ తో సోదర బంధాన్ని వాంచిస్తోందని అంటున్నారు సెరెంగె. ప్రొఫెసర్ సెంగె హస్నన్ సెరింగె తన పేరు సింధు నది, టిబెట్ బౌద్దం, మహ్మద్ ప్రవక్తతో ముడిపడి ఉందని వివరించారు.


No comments:

Post a Comment