Monday, April 27, 2015

నిజాయితీపై కత్తి కట్టిన ప్రభుత్వం

నీతి, నిజాయితీ, అంకిత భావంతో పని చేసే ఉద్యోగులకు బహుమానం బదిలీయా? పదోన్నతులను అడ్డుకునేందుకు కేసులు బనాయిస్తారా? ఐఏఎస్ ప్రమోషన్ జాబితాలో ఉన్న ఒక ఉన్నతాధికారిణికి తీరని అన్యాయం జరిగింది. అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసి పగతీర్చుకున్నారు కొందరు పెద్దలు.. ఎందుకిలా జరిగింది?.. తనకు అప్పగించిన బాధ్యతను ముక్కుసూటిగా, చిత్తశుద్దితో నిర్వర్తించడమే ఆమె చేసిన పాపమా?
తెలంగాణ రాష్ట్ర సహకార శాఖలో అధనపు రిజిస్ట్రార్ కిరణ్మయి.. కొందరు అధికారుల అవినీతి వ్యవహారాన్ని బయట పెట్టడం, వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడమే ఆమె చేసిన నేరం. ఆ అవినీతి అధికారులకు కొందరు నాయకులు అండగా నిచిలి కొమ్ము కాస్తున్నారు. గతంలో కూడా కిరణ్మయి ఒక హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలను బయట పెట్టారు.. కానీ ఆ నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియదు, కానీ ఈ అవినీతిలోని ముఖ్య పాత్రధారి మాత్రం ప్రభుత్వంలో కీలక పదవి పొందారు.
పలు ఆర్థిక అక్రమాల కేసుల్లో విచారణాధికారిగా పని తీరుకు కిరణ్మయి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. కిరణ్మయికి ఇప్పుడు పదోన్నతి లభించాల్సి ఉంది.. ఐఏఎస్ హోదా పొందే జాబితాలో ఉన్నారు.. సరిగ్గా ఇక్కడే కపట నాటకాలు నడిచాయి. ఆమెపై పగబట్టినవారంతా పావులు కదిపారు.. తమను కేసుల నుండి తప్పించేందుకు డబ్బు అడిగారంటూ అవాస్తవ ఫిర్యాదులు చేశారు. వెంటనే ప్రభుత్వంలోని పెద్దలు విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు బయటకు వచ్చినా, ఆలోగా కిరణ్మయి పదోన్నతి ఆగిపోవడమే వారి లక్ష్యం..
ఈ వ్యవహారంలో తెలంగాణ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కిరణ్మయికి అండగా నిలిచింది. సీబీసీఐడీ విచారణ కోసం డిమాండ్ చేశాయి. తమ శాఖలో తమను ఇబ్బంది పెడుతున్న ఓ అధికారిపై ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. కానీ కిరణ్మయిపై అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అగత్యం పెద్దలకు ఏర్పడినట్లుంది. కిరణ్మయి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు.. కానీ స్వరాష్ట్రం వచ్చాక ఆమె అన్యాయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ కథలో తాజా మలుపు ఏమిటంటే కిరణ్మయిని బదిలీ చేసి అప్రధాన్యపు పోస్టు ఇచ్చారు. ఆమెపై క్రమశిక్షణా చర్యల పేరిట వరంగల్ జిల్లా సహకార ట్రిబ్యునల్ సభ్యురాలిగా బదిలీ చేశారు.. మరో ట్విస్ట్ ఏమిటంటే, క్రమశిక్షణా చర్యలకు గురి కావాల్సిన వ్యక్తి దర్జాగా తన పూర్వపు పదవిలో ఆసీనుడైపోయారు. నిజాయితీగా వృత్తి ధర్మాన్ని పాటించడమే కిరణ్మయి చేసిన నేరమా?.. ఒక్కసారి ఆలోచించండి.. మనమంతా ఆమెకు అండగా నిలుద్దాం.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల్లో చలనం వచ్చి కిరణ్మయికి న్యాయం జరగాలని కోరుకుందాం..

No comments:

Post a Comment