Thursday, April 2, 2015

కలం లేనివాడు పాత్రికేయుడేనా?

సర్ కాస్త పెన్నిస్తారా?.. అన్నా జర పెన్నిస్తవా?.. ఈ అడుక్కోవడాలు వినీ వినీ చిరాకేస్తోంది.. ఏ బ్యాంకులోనో, రిజర్వేషన్ కౌంటర్ దగ్గరో ఎవరైనా పెన్ అడిగితే అర్ధం చేసుకొని ఇవ్వొచ్చు.. కానీ విచిత్రంగా ఇటీవల పెన్నులు అడుగుతున్నది తోటి జర్నలిస్టులే.. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది..
యుద్ధానికి వెళ్లే సైనికునికి ఆయుధం లేకపోతే ఎలా ఉంటుంది?.. జర్నలిస్టుకు కలం లేకపోతే అలాగే ఉంటుంది.. కానీ సొంతంగా పెన్ను కొని దగ్గర పెట్టుకోలేని కటిక పేద జర్నలిస్టులు ఎక్కువైపోయారు.. ఓ పెన్ను దగ్గరుంచుకుంటే నీ సొమ్మేం పోయిందయ్యా అంటే, మర్చిపోయొచ్చానని అందమైన అబద్దం చెప్పేస్తారు.. డబ్బాల కొద్దీ సిగరెట్లు ఊదేస్తారు.. కప్పుల కొద్ది టీలు లాగిస్తారు.. పీపాల కొద్దీ మందు ఖతం చేస్తారు.. కానీ సొంతంగా పెన్ను దగ్గర పెట్టుకోవడంలో వీరికి నామోషీ ఎందుకు వస్తోందో తెలియడం లేదు..
వాళ్లు అడిగేది పెన్నే కదా.. ఇస్తే పోలా.. ఎందుకింత రాద్దాంతం అంటున్నారా?.. ఇవ్వచ్చు కానీ ఎంత మందికని ఇచ్చేది.. వారికి పెన్ను ఇచ్చినా, పని అయిపోయాక తిరిగి ఇస్తారన్న గ్యారంటీ లేదు.. ఆ పెన్ను ఎక్కడో పోగొట్టుకొని మళ్లీ మరునాడు యధావిధిగా ఎలాంటి నామోషీ లేకుండా పెన్ను అడిగేస్తున్నారు.. ఇలాగైతే లాభం లేదని నిర్ణయించుకున్నా.. మిత్రుడు శ్రీ చమన్ మధు సలహాతో వినూత్న ఆలోచన అమలులో పెట్టేశాను..
ఆఫీసులో యధావిధిగా పెన్ను అడిగాడో మిత్రుడు.. ఓ పది రూపాయలుంటే ఇస్తావా అని అడిగాను.. ఎందుకూ అంటూ ఇచ్చాడు.. ఆ పది జేబులో పెట్టుకొని రెండు బాగా రాసే అర్డినరీ పెన్నులు ఇచ్చాను.. నేను చేసిన పనికి అవాక్కయ్యాడా మిత్రుడు.. ఏమిటిది అన్నాడు.. అదంతే జర్నలిస్టుగా నీ బాధ్యతారహితంగా పెన్నులేకుండా వచ్చినందుకు అపరాధ రుసుం అని చెప్పేశాను.. మొహం మాడ్చుకొని వెళ్లిపోయాడు.. అలా ఇద్దరు ముగ్గురుకు షాక్ లు తగిలేసరికి నన్ను పెన్ను అడగటం మానేశారు.. మిత్రుడు మధు ఐడియా నచ్చితే మీరూ ఆచరణలో పెట్టండి..

ఒక్క జర్నలిస్టులే కాదు.. సమాజంలో చదువుకున్న ప్రతి నాగరికుడు విధిగా జేబులో పెన్ను పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.. ఎంత డిజిటల్ యుగం వచ్చినా కలం అవసరం తప్పని సరి..

No comments:

Post a Comment