Wednesday, June 26, 2013

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు


అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. ఈ సామెత ప్రస్తుతం ఉపయోగించడం సమంజసం కాకపోవచ్చు.. కానీ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతల వ్యవహారం చూస్తుంటే ఇలా వ్యాఖ్యానించక తప్పడం లేదు..
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులను బయటకు తీసుకొచ్చి సురక్షితంగా స్వస్థలాలకు పంపడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు తమకు తోచిన సాయం చేస్తున్న తెలుగుదేశం నాయకులపై తమ ప్రతాపం చూపారు.. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం సిద్ధం చేసిన టీడీపీ నాయకులతో గొడవ పడి, యాత్రికులను ఆ విమానంలో ఎక్కొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాలని వత్తిడి తెచ్చారు.. ఇరు పార్టీల నేతలు ఎయిర్ పోర్టులో కాట్లాడుకొని తెలుగువారి పరువు గంగపాలు చేశారు.. ఇద్దరూ బాధితులకు సాయం చేయాలనే అనుకున్నప్పుడు సమన్వయం ఎందుకు ఉండదు? ఇది పచ్చి రాజకీయమే కదా?
చార్ ధామ్ యాత్రలో అష్ట కష్టాలు పడి ఢిల్లీ చేరుకున్న యాత్రీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భవనాల్లో ఉచిత వసతి గదులు, ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి.. ప్రత్యేక విమానాల్లో వారి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నాయి.. కానీ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ లోని  తెలుగు యాత్రికులను యాచకుల కన్నా అధ్వాన్నంగా చూస్తున్నారు..  అక్కడ ఉన్న ఖరీదైన గదులు బాధిత యాత్రికులకు ఉచితంగా కేటాయించడం అక్కడి రెసిడెంట్ కమిషనర్ గారికి ఇష్టం లేదట..  హాళ్లలో నేలపైనే పడుకునే అవకాశం కల్పించాడు ఈ దయామయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి హడావుడి చేసి మందలించాక ఏవో కొన్ని గదులు ఇచ్చాడట.. వేల సంఖ్యలో వస్తున్న యాత్రీకులకు వసతి కల్పించడం కష్టమట.. యాత్రికులకు అన్నం, చారు, పెరుగన్నంతోనే సరిపుచ్చుతున్నారు.. ఇదేమని ప్రశ్నిస్తే క్యాంటీన్లో డబ్బు పెట్టి కొనుక్కొమ్మని సలహా ఇస్తున్నారు.. టీడీపీ వారు హెల్త్ క్యాంప్ పెడితే మందులు బయటకు విసిరేయించిన మహానుభావుడు ఈ రెసిబెంట్ కమిషనర్..
అయ్యా శశాంక్ గోయల్ ఏపీ భవన్ మీ తాత గారి జాగీర్ కాదు, మీ అత్తగారు కట్నం కింద నీకు ఇచ్చింది కాదు.. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నుల కింద ఇచ్చిన పైసలతో కట్టిన భవనం అది.. నీ జీతం కూడా ప్రజలే చెల్లిస్తున్నారని గుర్తు తెచ్చుకో.. కష్టాల్లో ఉన్న తెలుగు యాత్రికులను ఇంత ఘోరంగా అవమానిస్తున్న అహంభావి, మూర్ఖపు రెసిడెంట్ కమిషనర్ గారికి బుద్ది చెప్పే వారే లేరా?



No comments:

Post a Comment