Sunday, June 16, 2013

అవకాశవాద కూటమి

కేంద్రంలో మరో కూటమి వస్తుందట.. ఇప్పటి వరకూ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అనే కప్పల తక్కెడలను చూశాం.. ఇప్పడు వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ అట.. పుట్టక ముందే నామ కరణం చేసేశారు..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పుట్టిన ఆలోచన ఇది.. ఇందు కోసం బిహార్ సీఎం నితిష్ కుమార్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లతో మంతనాలు జరుపుతున్నారు మమతా దీదీ.. అసలు ఈ ఫ్రంట్ కు ఫెడరల్ ఫ్రంట్ అనే పేరు కన్నా అవకాశవాద ఫ్రంట్ (Opportunist Front) అంటే బేషుగ్గా ఉంటుంది..
గతంలో ఈ ముగ్గురు జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఏ)లో ఉన్నవారే.. వీరి ముగ్గురికి బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.. ఎన్డీఏ సర్కారులు కీలక శాఖలకు మంత్రులుగా పని చేశారు.. బీజేపీకి, ఎన్డీఏకు దేశ వ్యాపంగా ఉన్న ఇమేజీని తమ రాష్ట్రంలో సొమ్ము చేసుకున్న ఈ నేతలకు ఆ కూటమి కష్టకాలంలో మతతత్వం గుర్తుకు వచ్చేసింది.. నిస్సిగ్గుగా మిత్ర ధర్మానికి తూట్లు పొడిచేశారు.. ఎవరికి కావలసిన కారణాలు వారికి ఉన్నాయి లెండి..
మమతా బెనర్జీ ముస్లిం ఓట్లు దూరం అవుతాయనే కారణంతో బీజేపీకి ఒకసారి దూరమై మళ్లీ వచ్చారు.. రెండోసారి కూడా గుడ్ బై చెప్పి  కాంగ్రెస్(యూపీఏ)తో చేరారు.. ఇప్పడు ఆ పార్టీని కూడా దూరం పెట్టేశారు.. ఇక నవీన్ పట్నాయక్ ఒడిషాలో ఎక్కువ సీట్లు అడిగిందనే కారణంగా  బీజేపీని దూరం చేసుకున్నారు..
ఇక నితిష్ కుమార్ తీరు మరీ విచిత్రంగా ఉంది.. గోద్రా సంఘటన జరిగినప్పుడు ఆయన వాజ్ పేయి సర్కారులో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నారు.. గుజరాత్ వెళ్లి సంఘటనా స్థలాన్ని చేసి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కూడా జరిపారు.. అప్పుడాయనకు మోడీలో మతతత్వం అసలు కనిపించలేదు.. కానీ బిహార్ సీఎంగా అయినప్పటి నుండి మోడీలో ఆయన మతతత్వ వాదిని చూడగలగడం ఆశ్చర్యకరమే.. బిహార్లో వరదలు వచ్చినప్పడు గుజరాత్ ప్రభుత్వం స్నేహ పూర్వకంగా పంపిన సహాయ నిధిని తిప్పి కొట్టాడు.. నరేంద్ర మోడీని బిహార్లో ఎన్నికల ప్రచారానికీ  రానీయలేదు.. ఇప్పడు మోడీ ఎక్కడ ప్రధాని అవుతాడోనని భయపడి బీజేపీకీ, ఎన్డీఏకు రాంరాం చెప్పేశాడు నితిష్..
ఇలాంటి అవకాశ వాదులు ఎన్డీఏకు దూరంగా ఉండటమే మంచిదేమో.. వీరి కలగూర కంపలోని ఇంకా ఏయే పార్టీలు వస్తాయో చూడాలి.. నితిష్, మమత, నవీన్ సంగతి ఇలా ఉంటే, తాను దూర సందులేదు.. మెడలో డోలు ఒకటి అనే నానుడిని తలపిస్తోంది ఓ ప్రాంతీయ పార్టీ అధినేత ధోరణి.. వాళ్లేదో ఫ్రంట్ పెట్టుకోవాలని సన్నాహాలు చేసుకుంటుంటే ఇంకా పుట్టని, పెట్టని ఆ కూటమికి నాయకత్వం వహించి చక్రం తిప్పాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు.. ఆ నాయక శిఖామణి గురుంచి తర్వాత రాస్తాను..


No comments:

Post a Comment