Wednesday, June 26, 2013

కాళరాత్రి 1975


మిత్రులారా ఉత్తరాఖండ్ అకాల వరదల వార్తల్లో పడి మనమంతా దేశ చరిత్రలోని చీకటి రోజును మరచిపోయినట్లున్నాం.. అత్యవసరపరిస్థతి(Emergency)పై గతంలో నేను Facebookలో రాసిన కథనంలోని కొంత బాగాన్ని మరోసారి ఇస్తున్నాను..........................
అవి ఇందిరాగాంధీ దేశాన్ని పాలిస్తున్న రోజులు. బ్యాంకు జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానిగా ఆవిర్భవించారు. అపర దుర్గగా ప్రతిపక్షం కీర్తించింది.. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అని పాలక కాంగ్రెస్ నేతలు భజనలు చేశారు. క్రమంగా ఇందిరాగాంధీలో గర్వం పెరిగింది. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది. ఇదే సమయంలో ఇందిర చుట్టూ కోటరీ ప్రారంభమైంది. వారిచ్చే సలహాలను ఆమె గుడ్డిగా అనుకరించడం మొదలు పెట్టారు. 
 ఇందిర తన వారసునిగా కుమారుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సంజయ్‌ క్రమంగా రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. క్రమంగా పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. ఇక ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోవడం ప్రారంభమయింది. ఇదేమని ప్రశ్నించిన వారి నోరు నొక్కడం ప్రారంభించారు. 
ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రముఖ గాంధేయ వాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలించడం ప్రారంభించింది.
ఇదే సమయంలో అమేధీ నియోజక వర్గం నుండి విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నందున ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు దాఖలు చేశారు. 
ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షం నుండి వత్తిడి రావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమెంది. కోర్టు తీర్పతో ఆమె ప్రధాని పదివిని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. క్రమంగా ఆమెలో దాగిన నియంత నిద్ర లేచింది. ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. 1975 జూన్‌ 25 అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలుకొని కీలక పత్రాన్ని చూపించారు. వెంటనే ఆయన మారుమాట్లాడకుండా రాజ్యంగంలోని 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ ఉత్తర్వుపై సంతకం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది..చీకటి రోజులకు తెరలేచింది.
ఆనాటి అర్ధరాత్రి ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకు పంపింది. అరెస్టయిన వారిలో జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, జార్జ్ ఫెర్నాండెజ్‌, రాజ్‌నారాయణ్‌ తదితర ప్రముఖ నాయకులు ఉన్నారు. ఎఎర్జెన్సీ పేరిట పత్రికల గొందు నొక్కారు. దేశంలో అసలేం జరుగుతుందో తెలియని వాతావరణం ఏర్పడింది. ప్రశ్నించే వారిని, మేధావులను, పాత్రికేయులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం మొదలు పెట్టారు. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. దేశంలోని జైళ్ళన్నీ లక్షలాది రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ ప్రజలు మరోసారి స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది.
19 నెలల నియంతృత్వ పాలన తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని ఆమెకు అర్థమైంది. 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తివేస్తూ ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే సంవత్సరం లోక్‌ సభ ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమయ్యాయి. ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. స్వయాన ఇందిరాగాంధీ రాయబరేలీలో తన ప్రత్యర్థి రాజ్‌ నారాయన్‌ చేతిలో ఓడిపోయారు. ఇందిర నియంతృత్వ విధానాలపై దేశ ప్రజల వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. అయితే మురార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వం అంతర్గత కలహాలతో కుప్పకూలడంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. కానీ ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రజలు ఈనాటికీ మరిచిపోలేదు.




No comments:

Post a Comment