Monday, June 24, 2013

చేతనైతే ఆదుకోండి..రాజకీయం వద్దు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడి వరదల్లో తమ వారిని కోల్పోయి, తిరిగి వచ్చే దారి లేక అక్కడే చిక్కుకుపోయిన తెలుగు వారిని ఆదుకునే విషయంలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు శవాలపై పేలాలు ఏరుకునేలా ఉందని వ్యాఖ్యానించడానికి నేను బాధపడుతున్నాను.. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి ఆదుకోవాల్సి సమయంలో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ రాజకీయం చేయడం దారుణం..
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన ధోరణి ఏ మాత్రం సమర్ధనీయంగా లేదు.. వరదల్లోంచి ఎలాగోలా బయటపడి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ చేరుకున్న యాత్రీకులను అక్కడి అధికారులు యాచకుల కన్నా అధ్వాన్నంగా చూశారన్నది పత్రికలు, టీవీలు చూసినవారికి స్పష్టంగా అర్థం అవుతోంది.. వారు దిక్కులేని అనాధల్లా హాలులో నేలపై పడుకోవడం ఏమిటి? 19.85 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏపీ భవన్లో ఉన్న వందకు పైగా గదులు ఎవరి కోసం? కేవలం అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడానికేనా? బాధితులకు వీటిలో బస కల్పించకపోవడానికి కారణం ఏమిటి? బాధితులకు సాంబారు, పెరుగుతో మాత్రమే భోజనం పెట్టడం ఏమిటి? కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చే వరకూ ఏపీ భవన్ అధికారులు బాధితులను ఈ మాత్రం కూడా పట్టించుకోలేదని, వారి క్యాంటిన్లో 55రూ. పెట్టి టిఫిన్లు కొనుక్కోవాల్సి వచ్చిందనే వార్తలు నిజం కాదా?
ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విషయానికి వద్దాం? అమెరికాలో కుటుంబ సమేతంగా ఆయన చేసిన వ్యక్తిగత యాత్రను ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరంలేదు.. ఒక ప్రతిపక్ష నాయకునిగా, తెలుగుదేశం పార్టీ తరపున ఆయన బాధితులను ఆదుకోవడం అభినందనీయమే.. కానీ ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చి తెలుగువారు ఆపదలో చిక్కుకున్న వార్తలు వచ్చినప్పుడు వెంటనే యాత్రను రద్దు చేసుకొని రాకుండా, ఆలస్యంగా వచ్చి రాజకీయం చేయడం ఎందుకు? అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏమిటి? బాబుగారు వచ్చే వరకూ తెలుగు తమ్ముళ్లు సహాయక చర్యల్లో పాల్గొనకుండా ఏమి చేసినట్లు?
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తమ రాష్ట్రానికి చెందిన చార్ ధామ్ యాత్రికులను ఆదుకునేందుకు స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం, ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించడం చూశాం.. అలాగే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్లి తమ రాష్ట్రాల యాత్రీకుల బాగోగులను తెలుసుకున్నారు..

కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాత్రం అంత తీరిక లేదు.. పదే పదే ఢిల్లీకి వెళ్లి సోనియా, అహ్మద్ పటేల్, ఆజాద్ లను ప్రసన్నం చేసుకొని వచ్చే మన సీఎం గారికి ఉత్తరాఖండ్లో వేలాది మంది తెలుగు యాత్రీకులు గోడు పట్టదా? కేవలం మంత్రులను అక్కడికి పంపి సరిపుచ్చుకుంటారా? బాధితులను రాష్ట్రానికి విమానంలో తెచ్చామా? రైల్లో తీసుకొచ్చామా? రెండు వేలో, ఐదు వేలో సహాయంగా ఇచ్చామా? అన్నది ముఖ్యం కాదు.. వారి కన్నీళ్లు తుడిచి, భోజన వసతులు సక్రమంగా కల్పించి, జాగ్రత్తగా స్వస్థలాలకు చేర్చడమే అసలు సహాయం..

No comments:

Post a Comment