Monday, June 10, 2013

అద్వానీ మార్గదర్శకత్వం అవసరం

భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పార్టీ పదవులన్నీ త్యజించడం ఆశ్చర్యాన్ని కలిగించింది అనడం కంటే నివ్వెరపరచింది అని చెప్పక తప్పదు.. అద్వానీజీ జీవితాన్ని గమనిస్తే మచ్చలేని ఆదర్శం, వ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.. రాజకీయాల్లో విలువలు పాటించే అదురైన నాయకుల్లో ఒకరు ఆయన..
అద్వానీజీ గతంలో చేసిన ఎన్నో వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి.. ఆయన అలా మట్లాడినందుకు చాలా మంది ఆగ్రహించినప్పటికీ అందులో ఏదో నిగూఢార్ధం ఉందని నేను భావించేవాన్ని.. మహ్మద్ అలీ జిన్నాలో అద్వానీ ఒక లౌకిక వాదిని చూడటం నాకు ఆందోళన కల్గించింది.. అయితే అద్వానీజీ స్వీయ జీవిత చరిత్ర My Country.. My People( నా దేశం.. నా ప్రజలు) చదివాక ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని గ్రహించి సంతృప్తి చెందాను..
లాల్ కృష్ణ అద్వానీ గారికి రాజీనామా చేయడం కొత్తేమీ కాదు.. తన మనసుకు బాధ కలిగించినప్పడు పదవులను తృణపాయంగా త్యజించిన ఉదాహరణలు గతంలో ఉన్నాయి.. అయితే ఈసారి మాత్రం నరేంద్రమోడీకి ప్రచార కమిటీ బాధ్యలు అప్పగించడంపై కినుక వహించి అద్వానీజీ రాజీనామా చేశారనే వార్తను చూసి నిజంగా షాక్ తిన్నాను..
కరాచీలో పుట్టి దేశ విభజన తర్వాత అనివార్యంగా ఢిల్లీకి వచ్చేసిన అద్వానీజీ ఆరెస్సెస్ ద్వారా సమాజ సేవలోకి ప్రవేశించారు.. అటల్ బిహారీ వాజపేయిజీతో కలిసి జనసంఘ్, జనతా, బీజేపీ పార్టీల వ్యవస్థాపకులుగా, అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఉప ప్రధానిగా పని చేశారు అద్వానీజీ.. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో లోక్ సభలో కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీకి సారధ్య బాధ్యతలు స్వీకరించి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా నడిపించిన ఆయనదే..
అటల్జీ రెండోసారి(నిజానికి మూడోసారి) ప్రధాని పదవికి స్వీకరించాక తన చిరకాల సహచరుడు అద్వానీజీని ఉప ప్రధానిని చేశారు.. ఈ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో భాజపా(ఎన్డీఏ) పరాజయం పాలైంది.. 2009 ఎన్నికల్లో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పేరు ముందుగానే ప్రకటించి ఎన్నికల భరిలోకి దిగినా కాలం కలిసి రాలేదు.. ఈలోగా దేశంలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి..
దేశం ఇప్పడు యువ మంత్రం అలాపిస్తోంది.. అంతే కాదు తక్షణ ఫలితాలు చూపే నాయకున్ని కోరుకుంటోంది.. వారి దృష్టి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై పడింది.. (క్షమించాలి ఇది నా సొంత వ్యాఖ్యానం కాదు.. ఇటీవలి సర్వేలు వెల్లడించిన విషయం) సహజంగానే భాజపా నాయకులపై వత్తిడి పెరిగింది.. అగ్రనేత అభిమతానికి వ్యతిరేకంగా మోడీని తెరపైకి తెచ్చారు.. అద్వానీజీ రాజీనామా ద్వారా తన మనస్థాపాన్ని తెలియజేశారు.. నరేంద్ర మోడీ స్వయానా అద్వానీ ఆశీస్సులతో ఎదిగిన నాయకుడే.. 1990లో అద్వానీ చేపట్టిన సోమనాథ్ అయోధ్య రథయాత్రను నడిపించడంలో క్రియాశీల పాత్ర పోషించారు మోడీ..

ఇక్కడ అద్వానీని కానీ, మోడీని కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. అద్వానీజీ మనోవేదన అర్థం చేసుకోతగిందే.. అయితే జరిగిన పరిణామాల నుండి తిరిగి వెనక్కి వెళ్లడం కష్టమే.. అద్వానీజీ విశాల దృక్పథంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది.. దేశ రాజకీయాల్లో కురువృద్దులైన అద్వానీజీ తన అనుభవాన్ని ప్రస్తుత పార్టీ నాయకత్వానికి అందించాలి, ఆయన మార్గదర్శకత్వం భాజపాకు ఎంతో అవసరం..



No comments:

Post a Comment