Tuesday, December 15, 2015

దేశం కన్నా కుటుంబమే మిన్న..

1978 డిసెంబర్ మాసంలో లక్నో నుండి ఢిల్లీ వెళ్లుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయింది. కారణం: ఇందిరా గాంధీని అరెస్టు చేశారని.. 2015 డిసెంబర్ మాసంలో పార్లమెంటు సమావేశాలకు ఆటంకం. కారణం: సోనియా గాంధీని తన ఎదుట హాజరు కమ్మని న్యాయ స్థానం ఆదేశించినందుకు.. రెండు ఘటనలకు 37 ఏళ్ల తేడా.. కానీ రెండు చర్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.. నాడు, నేడూ ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేసిన పనే..
ఆనాడు కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో ఉంది.. రాజకీయ ప్రేరిత కుట్రలో భాగంగా ఇందిరను అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.. సోనియా గాంధీ విషయంలోనూ రాజకీయ కుట్రే అని కాంగ్రెస్ వాదన.. ఏది నిజం? ఏది అవాస్తవం?..
1978, 2015.. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఒక కుటుంబానికి చెందిన వారు.. వారిపై చర్యలు చేపట్టింది న్యాయస్థానమే.. రెండింటిలోనూ ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం లేదు.. వారు చేసిన తప్పుల ఫలితం కారణంగానే కేసుల్లో ఇరుక్కున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది..
మరీ విచిత్రం ఏమిటంటే ప్రస్తుత నేషనల్ హెరాల్డ్ కేసు 2013లో నమోదైంది.. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.. న్యాయ స్థానాలపై అధికార పార్టీల ప్రభావం ఉందని వారు భావించనట్లయితే, ఆనాడే కేసు నమోదు కాకుండా అడ్డుకోవచ్చుకదా?.. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేసినంత మాత్రాన, దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నించడమేనా?

ఇంతకీ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ అధికార పత్రిక ఆస్తులను ఒక కుటుంబం అడ్డగోలుగా అమ్ముకొని తమ వ్యక్తిగత ఖాతాల్లో వేసుకుంటే ఆ పార్టీ నాయకులు వెనుకేసుకురావడం ఎంత వరకూ సమంజసం?.. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తుల కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారా?.. దేశంకన్నా కుటుంబమే మిన్న అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా?.. ఏప్రిల్ ఇంకా నాలుగు నెలల దూరంలో ఉంది.. మరి ఎవరిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. దేశ ప్రజలనా?.. ప్రజలు అంత అమాయకులుకాదు మోసపోవడానికి..

No comments:

Post a Comment