Saturday, August 3, 2013

మళ్లీ అవే వెన్నుపోట్లు..

మళ్లీ అవే నాటకాలు.. తెలంగాణ ప్రజలు ఐదు దశాబ్దాల కల నెరవేరిందని సంతోషపడుతున్న సమయంలో మళ్లీ పాత డ్రామాకు తెర తీశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో సీపీఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి.. ఇది అక్షరాలా నిజం.. తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణకు అనుకూలంగా తాము ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.. స్వయాన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును స్వాగతించారు.. కానీ సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఏమిటి? వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ మళ్లీ ఎందుకు కపటనాటకాలు ఆడుతున్నారు?.. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయమని మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరూ ఊహించారు.. అంత ముందు చూపు వారికి లేకపోయిందా?
రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు తమ పార్టీ విధానాలపై నిబద్దత ఉండాలి.. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ముందు తమ పార్టీలకు రాజీనామా చేయాలి.. కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులకు ఆ ధైర్యం ఉందా వీరికి.. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు?.. మీ పార్టీలనా?.. తెలంగాణ ప్రజలనా?.. కాదు. మీరు వంచిస్తున్నది మీ పార్టీలను, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను..
చరిత్ర ఎప్పడూ ఒకేలా ఉండదు.. మారిన పరిస్థితులను వాస్తవిక దృక్ఫథంతో, విశాల హృదయంతో ఆలోచించాలి.. ఆహ్వానించాలి.. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉంది.. చేరువలో సొంత రాజధాని రావడం వల్ల అన్ని విధాలా ప్రయోజనాలు సీమాంధ్ర జనమే పొందుతుంది కదా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఘననీయంగా పెరిగే అవకాశం ఉంది.. ఈ విషయాలను దాచి పెట్టి సమైక్యాంధ్ర పేరిట ఉద్యమాన్ని రెచ్చగొట్టడం ఎందుకు?.. ఎటు చూసినా సీమాంధ్ర జిల్లాల నుండి 150 నుండి 200 పై చిలుకు దూరంలో తెలంగాణ నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ ఉమ్మడ రాజధానిగా ఉండటం సాధ్యమేనా?
ఆంధ్ర ప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ తెలుసు.. తెలంగాణను విలీనం చేసుకునే సమయంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే కదా?.. ఆ ఒప్పందంలోని అంశాలనే పాటించనప్పడు వినీనానికి ఏమైనా అర్ధం ఉందా? అపార్ధాలకు ఆస్కారం లేకుండా సంతోషంగా విడిపోవాల్సిన సమయంలో ఏమిటీ వెన్ను పోట్లు? మళ్లీ 2009 నాటి సీన్ రిపీట్  చేయాలనే ఆలోచన ఎందుకు?

No comments:

Post a Comment