Thursday, August 8, 2013

అర్థంలేని ఆందోళనలూ, అపోహలూ..

తెలంగాణ వస్తే ఆంధ్రా, రాయలసీమ జనం తట్టా బుట్టా బిస్తరు సర్దుకొని వెళ్లిపోవాలా?.. సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ నుండి పంపేస్తారా?..
ఈ తరహా ప్రచారం ఉభయ ప్రాంతాల ప్రజల్లోనూ అపోహలు పెంచుతున్నాయి.. రాష్ట్ర విభజన సమస్యను కొందరు దేశ విభజన మాదిరి ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డా రెండూ భారత దేశంలో ఉంటాయి.. భారత రాజ్యంగానికి లోబడే ఉంటాయి.. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులూ, విధులూ అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.. ఉన్న ఫలానా వెళ్లిపొమ్మని పంపేయడానికి చట్టాలు అంగీకరించవు..
కొందరు రాజకీయ నాయకులు తిన్నది అరగక, స్వలాభాల కోసం చేసే రెచ్చగొట్టే ప్రకటనలు ఉభయ ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి.. ప్రతి చిన్న విషయానికి మేమున్నామంటూ ఆర్భాటం చేసే మేధావి వర్గాలు ఈ సమస్య పరిష్కారానికి, ఉద్రిక్తలను తగ్గించడానికి ముందుకు రాకపోవడం బాధాకరం..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు స్వప్రాంతానికి వచ్చేస్తే, తమకు కొత్తగా ఉద్యోగాలు రావని ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.. ఇప్పడున్న ఉద్యోగులు 10-15 ఏళ్లలో రిటైరైపోయి ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నా తమ వయోపరిమితి (ఏజ్ బార్) దాటిపోతుందని వారి భయం.. ఇది అర్థం చేసేకోదగ్గదే అయినా పూర్తిగా వాస్తవం కాదు..
తెలంగాణ వస్తే తాము స్వస్థలాలకు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇవ్వాలని సీమాంధ్ర ఉద్యోగుల డిమాండ్.. ఉన్నపళాన పోతే తమ పిల్లల చదువులు, భవిష్యత్తు ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.. ఇదీ నిజమే.. కానీ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని తామే నడపాలని కోరుకోవడం భావ్యమేనా? ప్రభుత్వాలు ఒప్పుకున్నా తెలంగాణ యువతరం అంగీకరిస్తాందా? 610 జీవో అమలై ఉంటే ఈ పరిస్థతి ఇంత వరకూ వచ్చి ఉండేదికాదు..  వదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయమైనప్పుడు ఈలోగా ఏర్పాట్లు చేసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంది.. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన అర్థరహితం..
రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా వరకూ ఏర్పడే అవకాశం ఉంటుంది.. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలకు ఏనాడో ప్రాధాన్యత తగ్గింది.. ఇప్పుడున్న ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో ఉంటాయనే గ్యారంటీ లేదు.. ఉన్నా వేల సంఖ్యలోనే.. ప్రతి ఏటా లక్షకు పైగా గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు తయారవుతున్న ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించగలమా? భవిష్యత్తులో ఇక ప్రయివేటు రంగమే దిక్కని స్పష్టంగా తెలుస్తోంది.. ఈ పరిస్థితుల్లో ఈ ఆందోళనలు అవసరమా చెప్పండి..

రాష్ట్ర విభజన విషయాన్ని పరిపాలనా సౌలభ్యం, స్థానికులు మనోభావాల కోణంలో చూసినప్పుడు ఎలాంటి సమస్యలు కనిపించవు.. కానీ తమవి కానీ వనరులపై కన్నేసి దానికి తెలుగు జాతి ఐక్యత అనే ముసుగేసినప్పుడే సమస్యలు వస్తున్నాయి.. మనమంతా ముందు భారతీయులం.. మనది భారత జాతి.. ఆ తర్వాతే తెలుగు వాళ్ల.. తెలంగాణ, సీమాంధ్ర వాసులం..

No comments:

Post a Comment