Monday, August 5, 2013

అమరజీవి ఆత్మ ఘోషిస్తోంది..

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ ఘోషిస్తోంది.. తన చరిత్రను వక్రీకరిస్తున్న తీరు చూసి..
పొట్టి శ్రీరాములు ఎందుకు ఆత్మార్పణం చేశారో తెలుసా? మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం.. ఒక్కసారి వాస్తవ చరిత్రను క్లుప్తంగా చూడండి..

మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది.. అది నగరంలో 1912 సంవత్సరంలో తొలిసారిగా ఊపిరి పోసుకున్న ఆంధ్ర రాష్ట్ర స్వప్నం 1914లో ఆంధ్ర మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో బలంగా వినిపించింది.. 1918లో కాంగ్రెస్ పార్టీ ఆంద్ర కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.. ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సానుకూలంగానే స్పందించి, స్వాతంత్ర్యం తర్వాత చూద్దాం అంటూ దాటవేశారు.. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్ తిరిగి మొదలైంది..

ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేందుకు సిద్దపడ్డా, మద్రాసు విషయంలో పేచీ వచ్చింది.. మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ తెలుగు వారు పట్టుబట్టగా తమిళులు మోకాలడ్డారు.. దీంతో కేంద్ర ప్రభుత్వం మద్రాసు విషయంలో మెట్టు దిగితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సిద్ధమంటూ మడత పేచి పెట్టింది.. మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తల లేని మొండెం వంటిదని, తమకు అలాంటి రాష్ట్రం ఆమోదయోగ్యం కాదని తెలుగు నాయకులు ఖరాఖండిగా చెప్పేశారు.. వాస్తవానికి ఒకప్పడు మద్రాసు నగరం (చెన్నపట్నం) తెలుగు వారిదే.. కానీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి తమిళ తంబీల జనాభా తామర తంపరలా పెరిగిపోయింది.. మద్రాసు మాదే అని క్లైమ్ చేసుకోవడం మొదలు పెట్టారు..
ఈ దశలో గాంధేయ వాది పొట్టి శ్రీరాములు మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ తో 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్షకు ఆనాటి మద్రాసు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.. 1952 డిసెంబర్ 15న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరుడయ్యారు.. దీంతో ఆంధ్ర రాష్ట్రం భగ్గుమన్నది.. తీవ్ర హింస చలరేగింది..

నెహ్రూ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. కానీ అందులో మద్రాసు లేదు.. ఆనాటి వృద్ద నాయకత్వం తమ జీవితంలో ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తామో లేదో అనే బెంగతో వెంటనే ఒప్పేసుకుంది.. కానీ పొట్టి శ్రీరాములు ఏ మద్రాసు గురించి పట్టు పడుతూ దీక్ష ప్రారంభించాడో ఆ మద్రాసు మాత్రం మనకు దక్కలేదు.. నిజం చెప్పాలంటే పొట్టి శ్రీరాములు ఆశయం నెరవేరలేదు.. నెరలేదు అనడం కన్నా పదవుల కోసం కాళ్లు చాచుకొని కూచున్న ఆ నాటి తెలుగు నాయకులు అమరజీవి ఆశయానికి తూట్లు పొడిచారని చెప్పడమే సబబుగా ఉంటుంది.. అలా 1953 అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం సిద్దించింది..
ఆంధ్రా రాష్ట్రమైతే వచ్చింది కానీ వారికి అసలు కష్టాలు తెలిసి వచ్చాయి.. మద్రాసును ఉమ్మడి రాజధానిగా కొంత కాలం కొనసాగించాలని ఆంధ్ర నాయకులు కోరగా, తక్షణం మద్రాసు విడచి వెళ్లాలని ఆనాటి ముఖ్యమంత్రి రాజీజీ హుంకరించాడు.. సరైన మౌళిక సదుపాయాలు లేని కర్నూలు పట్టణంలో గుడారాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రం పాలన సాగించాల్సి వచ్చింది.. ఆ సమయంలో వారి కన్ను హైదరాబాద్ నగరంపై పడింది..
1948 సెప్టెంబర్ 17న భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతూ వచ్చింది.. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు అధికంగా ఉన్న తెలంగాణను కలుపుకొని విశాలాంధ్రగా ఏర్పడాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.. పావులు కదిలాది.. చివరకు ఆంధ్ర-తెలంగాణ విలీనమై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది.. ఇదీ అసలు చరిత్ర..

కానీ ఇప్పడు ప్రచారంలో ఉన్న చరిత్ర ఎలా ఉందో చూడండి.. పొట్టి శ్రీరాములు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కోసం ఆత్మ త్యాగం చేశారట.. అసలు అప్పటికి (1952)తెలుగు నాయకులకు ఆంధ్రప్రదేశ్ ఆలోచనే లేదు.. వారి ముందున్న కర్తవ్యమల్లా మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్నదే..  అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను గమనిస్తే ఆంధ్రప్రదేశ్(విశాలాంధ్ర) ప్రస్థావనే కనిపించదు.. అమరజీవి త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే ప్రచారాన్ని నిజమని నమ్మిన కొందరు తెలంగాణ ఉద్యమకారులు అప్పట్లో ఆయన విగ్రహాలను ధ్వంసం చేశారు...
ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ఏర్పడాలని కోరడం వేర్పాటు వాదమట.. మరి మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం వేర్పాటు వాదం పరిధిలోకి రాదా?..  పైగా భాషా ప్రయుక్త రాష్ట్రమని, సమైక్య రాష్ట్రమని గొప్పగా వర్ణిస్తుంటారు.. వాహ్వా.. క్యా బాత్ హైజీ..
అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్రను మరుగున, పరచి ఆయన చిత్ర పటాలను సమైక్యాంధ్ర పోరాటానికి వాడుకోవడం ఎంత వంచనో గమనించారా?.. నిజంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయం నెరవేర్చాలని ఉంటే మద్రాసు (నేటి చెన్నై) నగరాన్ని సాధించుకోండి.. అప్పుడే అమరజీవి ఆత్మకు శాంతి చేకూరినట్లు..

No comments:

Post a Comment