Thursday, August 15, 2013

1947 ఆగస్టు 15 అర్థరాత్రి..

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మాత్రమే కాదు.. దేశం నిలువునా చీలిన రోజు కూడా..
ఒకవైపు దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకాలు ఎగురేసి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్న వేళ.. మరోవైపు సరిహద్దుకు ఆవల కోట్లాది జనం అర్ధరాత్రే పరాయి దేశస్తులైపోయారు.. రెండు వైపులా అమాయకుల రక్తం చిందింది.. ఎందరో అభాగ్యుల మాన, ప్రాణాలు పోయాయి.. మరెంతో మంది అనాధలైపోయారు.. లక్షలాది మంది ఆస్తులు పోగొట్టుకొని కట్టుబట్టలతో తరలి వచ్చేశారు..
బ్రిటిష్ వారు పోతూ, పోతూ భారత దేశాన్ని ఇండియా, పాకిస్తాన్ (పశ్చిమ, తూర్పు) అంటూ మూడు ముక్కలు చేసేశారు.. మహ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం తెచ్చిన తప్పిదం ఇది అంటారు మన నాయకులు.. కానీ ఆ పాపంలో తమకూ భాగస్వామ్యం ఉందనే మాటను మాత్రం మరిచారు..
అప్పటి వరకూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనాటి వృద్ధ నాయకత్వానికి ఇదేమీ పట్టలేదు.. దేశ విభజనను ఆపేందుకు చివరి దాకా ప్రయత్నించామని చెబుతారు.. కానీ వాస్తవాలు వేరు.. మరి కొంత కాలం పోరాడే ఓపిక లేదు.. తమ జీవిత చరమాంకంలో అయినా పదవులు అనుభవిద్దామనే తాపత్రం ఆనాటి మెజారిటీ నాయకుల్లో ఉండేది.. ఈ కారణం వల్లే దేశ విభజనను ఇష్టంగానో, అయిష్టంగానో ఒప్పేసుకున్నారు..
చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎన్నో విశాద సంఘటనలు కనిపిస్తాయి.. చరిత్ర నుండి గుణ పాఠాలు నేర్చుకోవాల్సిన మన నాయక గణం ఆ తర్వాత కాలంలో కూడా ఈ విభజన చరిత్రను కొనసాగించింది.. కాశ్మీర్లో మూడో వంతు పాకిస్తాన్ కబ్జాలోకి పోయింది.. లడాక్, అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ తమ వంటూ చైనా క్లెయిమ్ చేస్తోంది. .టిబెట్ ను చైనా అక్రమించినప్పుడే మనం గట్టిగా వ్యతిరేకించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కచ్చతీవులను శ్రీలంకకు, తీన్ బిగాను బంగ్లాదేశ్ కి ఉదారంగా ఇచ్చేసింది మన ప్రభుత్వం.. పొరుగు దేశాలు మన దేశంలో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నా నాయక శ్రేణుల మొద్దు నిద్ర నటిస్తున్నాయి.. దేశ ఏమైతేనేం వారికి కావాల్సింది అధికారం..
ఇదేనా మన స్వాతంత్ర్యానికి అర్థం.. ఒకనాటి విశాల భారత దేశం క్రమంగా ముక్కలు చెక్కలు అవుతూ వచ్చినా మనకు పట్టదా.. మనం కోల్పోయిన భూభాగాలను సాధించుకోలేమా? తిరిగి అఖండ భారత దేశాన్ని నిర్మించలేమా? చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేమీ లేదు.. ఒక్కసారి ఆలోచించండి..
జై హింద్..


No comments:

Post a Comment