Sunday, August 18, 2013

ఒమర్జీ సమాధానం మీ దగ్గరే ఉంది..

కాశ్మీరీలను భారత దేశంలో భాగంగా ఎందుకు చూడటంలోదే చెప్పాలని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. దేశ ప్రధాన స్రవంతి నుండి కాశ్మీర్ ను విడిగా చూడటాన్ని తాను ఎన్నోసార్లు ప్రశ్నించానని, దానికి సమాధానం తెలుసుకోవడం కష్టంగా ఉందని వాపోయారాయన.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒమర్ అబ్దుల్లా వేసిన అమాయక(?) ప్రశ్న ఇది..
ఒమర్ అబ్దుల్లా ఈ ప్రశ్నను తన తాత షేక్ అబ్దుల్లాను(జమ్మూ కాశ్మీర్ తొలి సీఎం) అడిగి ఉంటే భాగుండేది.. ప్రస్తుతం ఆయన లేరు కనక, కనీసం తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను(మాజీ సీఎం) అయినా అడగాల్సింది.. అసలు కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదనే భావన అక్కడి ప్రజల్లో ఎందుకు కలిగింది?.. దీనికి కారణం కాశ్మీరీ నాయకులు, అక్కడి వేర్పాటువాద శక్తులు కాదా? ఆ రాష్ట్రాన్ని ఏళ్ల తరుబడి పాలించిన అబ్దుల్లాల కుటుంబానికి ఈ విషయంలో సంబంధం లేదా?
ఈ ప్రశ్నలకు మూలాలన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోనే ఉన్నాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో వినీనం అయ్యే సందర్భంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ  భారత రాజ్యాంగంలో 370వ అధికరణ  చేర్చారు.. వాస్తవానికి ఈ అధికరణ తత్కాలికమే అయినా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ అధికరణను అడ్డు పెట్టుకొనే తాము మిగతా భారత దేశ రాష్ట్రాలకు భిన్నం అని వాదిస్తుంటారు అక్కడి నేతలు.. ఆర్టికల్ 370 ప్రకారం భారత దేశంలోని ఇతర రాష్ట్రాల వారు స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరపరాదు. ఇక్కడి భూములపై వేరే ప్రాంతాల వారికి హక్కులు కల్పించరాదు. కానీ పాకిస్తాన్ ఆక్రమితక కాశ్మీర్ వాసులకు మాత్రం ఇలాంటి నిబంధనలు లేదు.. కాశ్మీరీలు మాత్రం భారత దేశంలో ఎక్కడైనా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు..  ఇలాంటి అడ్డగోలు నిబంధనలను అడ్డం పెట్టుకొని వేర్పాటు వాద నాయకులు 1953 నాటి పూర్వ స్థితిని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు..  దీని ప్రకారం భారత దేశం తరహాలోనే కాశ్మీర్ కు కూడా ప్రధాని పదవి ఉంటుంది.. భారత జాతీయ పతాకం మాదిరే కాశ్మీర్ కు ప్రత్యేక పతాకం ఉంటుంది..
ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా 1953లో జనసంఘ్ (బీజేపీ పూర్వ నామం) అధ్యక్షడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సత్యాగ్రహం చేసేందుకు కాశ్మీర్ వెళ్లగా, షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసింది.. అక్కడి జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు.. కానీ 370 నిబంధన మాత్రం కొనసాగుతూనే ఉంది..
కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులు తాము ప్రత్యేక దేశ హోదా కోసం, పాకిస్తాన్తో విలీనం కోసం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. వీరికి వంత పాడే రీతిలో ఇప్పడు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (అబ్దుల్లా పార్టీ) మరింత ప్రత్యేక ప్రతిపత్తి పేరిట కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది.. ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మిత్రుడైన షేక్ అబ్దుల్లాకు దొడ్డి దారిలో కట్టబెట్టిన అధికారం ప్రజాస్వామ్యం ముసుగులో అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది.. 1947లో పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగం (పీవోకే) తిరిగి స్వాధీనం చేసుకునే మాట దేవుడెరుగు, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు షేక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఫరూఖ్ అబ్దుల్లా, మనవడు(ప్రస్తుత సీఎం) చేసిందేమీ లేదు..
వేర్పాటు వాదులు కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ (హిందువులు)లపై అత్యాచారాలు చేసినా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని తరిమేసినా నోరు మెదపలేదు.. వారి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈనాటికీ లోయ నుండి తరిమేయ బడిన లక్షలాది మంది పండిట్లు జమ్మూ, ఢిల్లీల్లో జీవచ్చవాలుగా బతుకుతున్నారు.. వారి సమస్యను ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోదు..
ఇప్పడు చెప్పండి ఒమర్ అబ్దుల్లాజీ మీరు అడుగుతున్నప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి?..

No comments:

Post a Comment