Saturday, August 10, 2013

పరిణతి చెందిన నాయకత్వమేనా ఇది?..

ఈ రాష్ట్రంలో పరిణతి చెందిన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఎవరికీ విశాల దృక్పథం లేకుండా పోయింది.. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ వాదులు కోరుకోవడం ఎంత సహజమో, రాష్ట్రం ఒకటిగా ఉండాలని సమైక్యవాదులు కోరుకోవడం అంతే సహజం.. ఎవరి కారణాలు వారి ఉన్నాయి.. ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రజలు నిలువునా చీలిపోయారు..
పరిస్థితులను మొత్తం మీద బేరీజు వేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.. ఐదు దశాబ్దాలుగా రగుతున్న సమస్యను ఇంకా ఏమాత్రం వాయిదా వేయలేని స్థితి వచ్చేసింది.. సహజంగానే రాష్ట్ర విభజన అన్నప్పడు రాజధాని, వనరులు, ఆస్తులు, అప్పులు తదితర పంపకాలు సహజం.. ఒక హైదరాబాద్ విషయమే కాదు, చాలా విషయాల్లో అంతిమ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.. రాజకీయ పార్టీలు నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, వత్తిళ్ల మేరకు తెలంగాణ, సమైక్యాంధ్రల పేరిట విడిపోయి తగాదాలకు దిగడాన్ని తప్పు పట్టలేం.. పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి సమస్యలు వారికి ఉన్నాయి..
ఇలాంటి పరిస్థితిలో ప్రధాన పార్టీల అధినాయకులు ఏమి చేయాలి?.. అందరి ప్రయోజనాలు కాపాడే పరిష్కారం దిశగా ఆలోచించాలి. తమ కేడర్ ను ఒప్పించి, మెప్పించే విషయంలో దృష్టి పెట్టాలి.. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్) ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు(తెలుగుదేశం) చేస్తున్న పనేమిటి?.. వారు విశాల ప్రయోజనాలను మరచిపోయి ప్రాంతీయ కోణంలో ఆలోచించే దుస్థితికి వెళ్లిపోయారు.. వారి రహస్య ఎజెండాను ఇప్పుడు చాలా స్పష్టంగా బయట పెట్టుకున్నారు..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఏ విధంగా ఎదుర్కోవానే విషయంలో పరిష్కార మార్గాన్ని చూపాల్సిన నాయకులే ఇప్పడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డు తగిలే ప్రయత్నాలు చేయడం దారుణం.. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషి పాత్రలో హుందాగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం కిరణ్ కుమార్, తమ పార్టీ నాయకత్వ అభిమతానికే వ్యతిరేకంగా ప్రాంతీయ దృక్ఫథంతో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది.. పైగా ఆయన మాట్లాడిని విషయాల్లో చాలా వరకు అవాస్తవాలే ఉన్నాయి..
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయగానే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హుందాగా స్పందించారు.. సీమాంధ్ర రాజధాని ఏర్పాటు కోసం ప్రకటించిన దానికన్నా రెండు మూడు రెట్లు అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ సీమాంధ్ర ప్రయోజనాల ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే పనులకు ఆజ్యం పోయడం దారుణం.. చంద్రబాబు ఒకవైపు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెబుతుంటే, ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో సమైక్యాంధ్ర నినాదాలు చేయడం, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు తమ జిల్లాల్లో తెలంగాణ వ్యతిరేక ప్రదర్శనలు జరడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరిని కప్పి పుచ్చుకోవడానికా అన్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రధాన మంత్రికి రాసిన లేఖలోని అంశాలు ఆయన అంతర్ముఖానికి, ద్వంద్వ విధానాలకు అద్దం పడుతున్నాయి..
భగవంతుడా.. ఈ ఇద్దరు అధినాయకులకు పరిణతిని, విశాల దృక్పథాన్ని ప్రదర్శించే సద్బుద్ధి ఇవ్వాలని, ఇరు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడబడాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment