Monday, August 26, 2013

హైదరాబాద్ ఎవరిది?

నాకు దక్కనిది మరొకరికి దక్కకూడనే ఆలోచనా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.. ఇది ఉన్మాద మనస్థత్వం కాదా?.. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కొందరు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు.. అసలు హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని, ఈ నగరంపై తమకూ హక్కు ఉందని లా పాయింట్ లేవనెత్తుతున్నారు.. తెలంగాణకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని అంటున్నారు..
హైదరాబాద్ ఎవరిది అనే వాదనల్లో కొన్ని చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి.. ఈ మహానగర చరిత్ర తెలిసిన వారెవరూ ఇలా మూర్ఖంగా మాట్లాడరు.. సరిగ్గా 422 సంవత్సరాల క్రితం (1591లో) నిర్మించిన నగరమిది.. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు (నిజాంలు) హైదరాబాద్ కేంద్రంగా తమ సామ్రాజ్యాలను నడిపించారు.. 1948లో హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయ్యే నాటికి దేశంలోనేని ప్రముఖ నగరాల్లో ఒకటి.. గోల్కొండ, చార్మినార్ లాంటి ప్రఖ్యాత కట్టడాలతో ప్రపంచ ఖ్యాతి పొందిన చారిత్రిక నగరమిది.. భిన్న సంస్కృతులు, జాతులు, మతాలు, భాషల ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నిజాం పాలన అంతం తర్వాత 8 ఏళ్లపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా(తెలంగాణ, మరాఠ్వాడ, హై.కర్ణాటక) కొనసాగింది..1956లో ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరించిందో అందరికీ తెలుసు.. (మద్రాసు, కర్నూలు భంగపాట్లు) కనుక చరిత్ర లోతుల్లోకి వెళ్లదలుకోలేదు.. సొంత రాజధాని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర నేతలు కేవలం హైదరాబాద్ నగరం కోసమే భాషాప్రయుక్త రాష్ట్రాల వాదన తెర పైకి తెచ్చి తెలంగాణను కలుపుకొని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు (ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ప్రసంగాల రికార్డులను పరిశీలించండి)..
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే సహజంగా అన్ని ప్రాంతాల వారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చారు.. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. కానీ కొందరు సీమాంధ్ర నేతలు తామే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేశామని ప్రగల్భాలు పలకడం ఎందుకు? తొండటు గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడని నగరాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చామని, రాళ్ల హైదరాబాద్ను రతనాల హైదరాబాద్గా మార్చామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారకముందే అన్ని శాసనసభ, సచివాలయం తదితర మౌళిక సదుపాయాలు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నాయి.. హైదరాబాద్ భౌగోళికంగా దేశం నడిబొడ్డున ఉంది.. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది.. ఈ కారణంగానే రక్షణ రంగంతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వం సంస్థలు హైదరాబాద్ ను తమ కీలక స్థావరంగా మలచుకొన్నాయి.. ఇది సీమాంధ్ర నాయకుల కృషి అని ప్రచారం చేసుకోవడం హస్యాస్పదం.. ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది.. 1956 నాటికే హైదరాబాద్ దేశంలో 5వ పెద్ద నగరంగా ఉంది.. ఇప్పటికీ అదే స్థానంలో ఉంది.. హైదరాబాద్ నగర అభివృద్ధి తమ ఘనతే అని డబ్బా కొట్టుకునే నాయకులు దీన్ని కనీసం2,3,4 స్థానాలకైనా తీసుకెళ్ల గలిగారా? దేశంలోని అన్నిప్రముఖ నగరాలతో సమానంగానే ఇక్కడ అభివృద్ధి సాధిస్తూ వచ్చింది కదా? నగరంలో ఇబ్బడి ముబ్బడిగా జనాభా, కాలుష్యం పెంచడం.. చెరవులు, ఖాళీ స్థలాలను మింగేయడం.. హైటెక్ సిటీ, ఫ్లయ్ ఓవర్లు కట్టడం, నేతాజీలు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడ ఆస్తులు పెంచుకోవడం మాత్రమే అభివృద్ధికి కొలమానాలా?..
భౌగోళికంగా సీమాంధ్ర ప్రాంతానికి ఏ దారిలో చూసినా 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.. ఎటు నుండి చూసినా రెండు, మూడు తెలంగాణ జిల్లాలు అడ్డుగా ఉంటాయి.. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండటం సాధ్యమేనా? ఇది సాధ్యం కాదని తెలిసే సీమాంధ్ర నాయకులు కేంద్ర పాలిత ప్రాంత వాదనను తెరపైకి తెచ్చారు.. కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల పాత్ర తగ్గిపోతుంది.. ఇదేం కుట్ర?  హైదరాబాద్ నగరానికి తాగునీరు, విద్యుత్తు, చివరకు పాలు, కూరగాయల లాంటి నిత్యావసరాలు ఈ జిల్లాల నుండే రావాలి.. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఇప్పడు గ్రేటర్ గా అవతరించి ఇతర తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, మెదక్ సరిహద్దులకు విస్తరించింది.. నిజానికి పరిశ్రమలన్నీ ఈ జిల్లాల్లోనే ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని విడదీయడం సాధ్యమేనా? ఏరకంగా చూసినా హైదరాబాద్ చారిత్రకంగా, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిది.. 57 సంవత్సరాల అనుబంధంతో హైదరాబాద్ మాదని వాదిస్తూ, 422 సంవత్సరాల అనుబంధం ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ నగరాన్ని దూరం చేయడం న్యాయమా? ఈ మహానగరం తమకు దక్కే అవకాశం లేదు కాబట్టి తెలంగాణకు కూడా దూరం చేయాలనే శాడిజమే ఇందులో కనిపిస్తోంది.. అంటే తాను పెళ్లి చేసుకునే అవకాశం లేని అమ్మాయిపై యాసిడ్ పోయడం లాంటి వికృత ఆనందం అన్నమాట..
హైదరాబాద్ దూరమైతే నింగి విరిగి నేల మీద పడుతుందా? భూగోళం బద్దలౌతుందా? తెలుగు వారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉంటే ఎవరికి నష్టం? తెలంగాణ వాసులు స్వపరిపాలన కోరుకోవడం నేరమా? రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలా నష్టమో చెప్పగలరా? సీమాంధ్రకు కొత్త రాజధాని వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆ ప్రాంతం మరింతగా అభివృద్ది చెందుతుందనేది వాస్తవం కాదా? శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది.. ప్రయివేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రయివేటు ఉద్యోగాలకు ప్రాంతాలతో సంబంధం ఉండదు.. బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు.. ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పడం లేదు?
హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు.. చాలా కాలంగా వారి మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉంది.. ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉంది.. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకా సమైక్యాంధ్ర పేరిట ఇరు ప్రాంతాల ప్రజల్లో అనవసర అపోహలు సృష్టిస్తూ, సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణితో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నాయి.. సీమాంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా ఇలాంటి స్వార్థ నాయకుల మాటలు నమ్మకుండా సామరస్యతను కాపాడుకోవాలి..

No comments:

Post a Comment