Saturday, August 17, 2013

వీరేనా మన నాయకులు?..

ఏ దేశానికైనా ఆర్థిక, రక్షణ రంగాలు అత్యంత కీలకం.. ఈ రెండూ నిర్వీర్యమైపోతే.. పరిస్థితి ఏమిటో ఊహించారా?... ఆ దేశం పతనం కావడం ఖాయం..
ఇది మరే దేశం సమస్యో కాదు.. 67 ఏళ్ల స్వతంత్ర  భారత దేశం ఇప్పడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో మారకం విలువ రూ.62.03 అయ్యింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సరి సమానంగా ఉన్న డాలర్-రూపాయిల మధ్య క్రమంగా వచ్చిన గ్యాప్ ఇప్పడు ఇంత వరకూ వచ్చింది.. ఆర్థిక పరిస్థితి త్వరలో గాడిలో పడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చింది మొదలు గత 9 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు.. అందుకు విరుద్దంగా దిగజారుతూనే వస్తోంది.. భారత దేశం పరువు గంగలో కలుస్తోంది..
ఈ దేశంలో ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తలకు కొదవలేదు.. ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం.. అసలు వీరంతా భారత దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదు.. దివాళా అంచుకు తీసుకెళ్లి ఏ దేశాన్నికి తాకట్టు పడతారోనని భయమేస్తోంది.. రూ.27 సంపాదించిన వాడు పేదరికంలోంచి బయట పడ్డట్లేనని ప్రకటించినప్పుడే ఈ ఆర్థికవేత్తల మానసిక స్థితిపై అనుమానం వేసింది.. కెన్యాలో బస్తాడు కరెన్సీ నోట్లు తీసుకెళితే గానీ బ్రెడ్డు ముక్క రాదట.. రేపు మన రూపాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందని భయమేస్తోంది..
ఇక దేశ భద్రత విషయానికి వద్దాం.. సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం మన సైనికులకు చంపేసి పోతున్నా ఏం చేయలేని స్థితికి దిగజారింది మన ప్రభుత్వం.. భారత సరిహద్దుల్లో అనునిత్యం పాకిస్తాన్ కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడి, ఉగ్రవాదులను మన దేశంలోకి చొప్పిస్తున్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు మన దేశ పెద్దలు.. అటు చైనా కూడా తరచూ కాలు దువ్వుతూనే ఉంది.. లడక్, అరుణాచల్ లోకి పదే పదే చైనా సైన్యం చొరబడుతున్నా దిక్కు తోచని విధంగా వ్యవహరిస్తోంది మన్మోహన్ ప్రభుత్వం.. ఎక్కడైనా తప్పు చేసినోడే భయపడతాడు.. కానీ యూపీఏ ప్రభుత్వం పొరుగు దేశాలు రెచ్చిపోతున్నా వారిని చూసీ చూడనట్లు వదిలేయడంలోని ఆంతర్యం ఏమిటి?..
పాకిస్తాన్, చైనాలకు గట్టి బుద్ది చెప్పలేనంతగా దిగజారిపోయామా మనం?.. న్యాయం మన వైపు ఉన్నప్పుడు భయం ఎందుకు.. ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలకు ప్రతి విషయం చర్చలతో పరిష్కరించుకుంటామనడం ఊత పదంగా మారిపోయింది.. దేశ ప్రజలు వీరి చేతగానితనాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు..
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఓ సారి గుర్తు చేసుకోండి.. పాకిస్తాన్తో సమస్యలు ఉన్నాయట.. అవేమిటో చేప్పే ధైర్యం లేదా? దేశ ప్రజలకు స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాల్సిన పెద్ద మనిషి అశ్వద్ధామ హత: కుంజర అన్నట్లు మాట్లాడితే ఏమనాలి? పాకిస్తాన్, చైనా 1,15,600 చ.కి.మీ భూభాగాన్ని మన దేశం నుండి ఆక్రమించుకున్నాయి.. ప్రస్తుత యూపీఏ సర్కారు ఈ భూభాగాన్ని తిరిగి సాధించుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.. కనీసం ఉన్న భూభాగాలైనా కాపాడితే అదే పది వేలు..

No comments:

Post a Comment