Thursday, May 4, 2017

బాహుబలి బాగుంది.. కథే తిరకాసుగా ఉంది

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలనే ఆసక్తి నాకైతే లేదు.. కానీ జర్నలిస్టుగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నందున బాహుబలి-2 ఎలా ఉందంటూ అందరూ నన్ను అడగడంతో ఏమీ చెప్పలేక ఇబ్బంది పడ్డాను.. ఆ చిత్రంపై మాట్లాడాలంటే చూస్తేనే ఆ అర్హత వస్తుందని భావించాను. ఇక వీలు చూసుకొని ఒక మిత్రునితో వెళ్లాల్సి వచ్చింది. బాహుబలి-2 చూడాలంటే అంతకు ముందు ఏం జరిగిందో తెలియాలి. అందుకే బాహుబలి-1 కూడా చూశాను.. రాచ కుటుంబంలో అంతఃపుర కుట్రను కథాంశంగా తీసుకొని మలచిన అద్భుత గ్రాఫిక్ విజువల్స్ ఎఫెక్ట్ బాహుబలి.. ఈ చిత్ర రెండు భాగాలు చూసిన తర్వాత ఎక్కడో కథ అతకలేదు అనిపించింది..
బాహుబలి-1 మిగిల్చిన ప్రశ్నలకు రెండో భాగం పూర్తిగా జవాబులివ్వలేకపోయింది. మహిష్మతి రాజ్యానికి కట్టు బానిస కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం తెలిసింది. బాహుబలి1లో భల్లాలదేవుడి కొడుకు భద్ర తల నరకడం చూపారు.. కానీ భల్లాలదేవుడికి వివాహం జరిగిందా? ఒకవేళ అవివాహితుడైతే కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ప్రశ్నలకు రెండు భాగాల్లోనూ సమాధానం లేదు.. బాహుబలి1లో మహిష్మతి రాజ్యంపై దండయాత్రకు దిగిన కాలకేయుల నేపథ్యం తెలుస్తోంది. కానీ రాకుమారి దేవసేనకు చెందిన కుంతల రాజ్యంపై దాడికి దిగిన పిండారీల గురించి అంతా గందరగోళమే.. బాహుబలి-2 క్లైమాక్స్ చూస్తే మొదటి భాగంలోని యుద్ద దృశ్యాలే బాగున్నాయి. అలాగే మొదటి భాగంలో అస్లాం ఖాన్ ఏ సాయం కావాలన్నా ఈ మిత్రుడున్నాడుఅని కట్టప్పకు మాట ఇచ్చాడు.. కానీ రెండో భాగంలోని క్లైమాక్స్ లో మహేంద్ర బాహుబలి (శివుడు)కి సైన్య బలం లేకున్నా అస్లాం ఖాన్ సాయం తీసుకోలేదు..
కుంతల రాజ్య రాకుమారి దేవసేన నేపథ్యం, అమరేంద్ర బాహుబలితో మహిష్మతి రాజ్యానికి ఎలా వచ్చిందో చాలా చక్కగా చూపించారు.. కానీ ఎంతో ధీరురాలైన ఆమె పాత్ర అబలగా కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అత్త శివగామికి ఎదురు మాట్లాడింది సరే.. కానీ భల్లాల దేవుడి మీద పరాక్రమాన్ని ఎందుకు చూపలేదో అర్థం కానీ విషయం.. బాహుబలి-1లో అవంతిక అందచందాలతో పాటు శూరత్వాన్ని చూపించారు.. కానీ రెండో భాగంలో అవేమీ అక్కర రాలేదు.. క్లైమాక్స్ యుద్దంలో కూడా పనికి రాలేదు..
బాహుబలి రెండు భాగాలు చూసిన తర్వాత నాకు ఎంతో అద్భుతం అనిపించిన పాత్ర కట్టప్ప.. సత్యరాజ్ ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు.. ఆ తర్వాత నన్ను ఆకట్టుకున్న పాత్ర భల్లాలదేవుడు (రానా) బాహుబలిగా నటించిన ప్రభాస్ రేంజ్ ఈ చిత్రంతో పెరిగింది అనడంలో అనుమానం లేదు.. కానీ దర్శకుడు రాజమౌళి మరి కాస్త అద్భుతంగా ఈ పాత్రను తీర్చిదిద్ది ఉంటే బాగుండేది అనిపించింది..
మొత్తానికి రాజమౌళి ఐదేళ్ల పాటు కష్టపడి నిర్మించిన బాహుబలి రెండు భాగాలు నిజంగానే చాలా వండర్.. చిన్నప్పుడు నేను చదువుకున్న చందమామ, బాలమిత్ర కథలను సజీవంగా వెండి తెరపై చూపిన ఈ దర్శకుని హ్యాట్యాప్ చెప్పకుండా ఉండలేదు.. అద్భుతమైన గ్రాఫిక్స్.. ఒక తెలుగు చలన చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, ఇతర భాషల చిత్రాల బాక్సాఫీసులను బీట్ చేయడం చాలా గొప్ప విషయం.

సోషల్ మీడియా అంటేనే రకరకాల వ్యక్తుల భావాల వేదిక.. రంధ్రాన్వేషకులకు నిరంతరం ఇక్కడ పని ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన వాక్ స్వాతంత్ర్యాన్ని సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకోవచ్చు.. మనం సినిమాను వినోదం, ఆహ్లాదం కోసమే చూడాలి. నిజ జీవితంతో అన్వయించుకోవద్దు.. బాహుబలి తీసి కోట్లు గడించిన నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి రైతులకు ఏమైనా సాయం చేయవచ్చు కదా అంటున్నారు.. ఒక సామాజిక స్పృహతో ఇలా మాట్లాడంలో తప్పులేదు.. ఆ భావన బాహుబలి టీంకు మాత్రమే కాదు.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రావాలి.. సమాజం నుండి మనం పొందిన దానిలో ఎంతో కొంత తిరగి సమాజానికి ఇవ్వాలి అనే చింతన అందరు వ్యాపారుల్లోనూ రావాలి..

No comments:

Post a Comment