Sunday, May 14, 2017

ఈ ప్రమాదాల మర్మం ఏమిటి?

నిన్న పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే సరికి దుర్వార్త..
‘మంత్రి గారి కుమారుడు యాక్సిడెంట్ లో పోయాడు..’
‘అయ్యో పాపం ఎలా జరిగింది?..’
‘వేగంగా వెళ్లుతున్న కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిందట..’
ఆరేళ్ల క్రితం ఇలాంటి వార్తే విన్నాను.. నాటి మంత్రి కొడుకు ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో మరణించాడు.. అంతకు ముందు ఓ మాజీ క్రికెటర్ కొడుకు ఇలాగే మరణించాడు..

ఈ యాక్సిడెంట్లకు కారణం ఏమిటి అంటే మితి మీరిన వేగం, సీటు బెల్ట్ పెట్టుకోక పోవడం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో పిల్లరూ.. ఇలా నానా కారణాలు చెబుతారు.. కానీ అసలు వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోరు?
భాగ్యనగరం విశ్వనగరంగా ఎదుగుతోందని మురిసిపోతున్నాం.. కానీ దానితో పాటు అన్ని రకాల అవలక్షణాలు సంతరించుకుంటున్నాయనే నిజాన్ని మాత్రం నాయకమన్యులు అంగీకరించరు..
విచ్చల విడిగా వెలుస్తున్న పబ్బులు, బార్లు, హుక్కా సెంటర్లు, డ్రగ్స్.. విశృంఖల పాశ్యాత్య సంస్కృతి.. తెల్లవార్ల దాకా తాగి తందానాలాడే వీఐపీల సంతానం.. శివారు ఫార్మ్ హౌస్ లు, రిసార్టుల్లో రేవ్ పార్టీలు.. దీనికి తోడు రహదార్ల మీద వేగంగా కార్లు, బైకు రేసింగ్లు.. మద్యం అమ్మకాలతో ఎక్సైజ్, వాణిజ్య శాఖలకు, డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లతో పోలీసులకు దండిగా డబ్బుల వస్తున్నాయి.. ప్రభుత్వం ఇలా అన్ని వైపులా సొమ్ము చేసుకుంటోంది.. కానీ తన బాధ్యతను మరచిపోతోంది.. ఇదే సంక్షేమ రాజ్య లక్షణం అని భావిస్తే అది మన కర్మ..
ఒక్కసారి అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి.. ఎక్కడిపోతోంది మన సమాజం.. వీఐపీలు మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి ముందు తమ ఇంటిని సరిదిద్దుకోవాలి.. మీ కుటుంబ సభ్యులు, పిల్లలు ఏమి చూస్తున్నారో గమనించండి.. సంపాదించ సొమ్మును విచ్ఛల విడిగా ఖర్చు పెడతామంటే అది మీ ఇష్టం.. కానీ వారికి క్రమశిక్షణ చేర్పించండి. హద్దుల్లో ఉంచండి.. లేకపోతే ఇలా కడుపు కోతలు తప్పవు..
(11 మే, 2017)

No comments:

Post a Comment