Sunday, May 14, 2017

నారద జయంతి ఎందుకు జరుపుకుంటున్నాం..

సమాచార భారతి ఆధ్వర్యంలో జరిగిన నారద జయంతి కార్యక్రమం సందర్భంగా నారదున్ని పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది.. ఆ ప్రసంగ సారాంశం ఇలా సాగింది..
ఈరోజు మనం నారద జయంతి జరుపుకుంటున్నాం..
నారదుడు అంటే ఎవరో మీకు తెలుసు.. బ్రహ్మదేవుని పుత్రుడు, విష్ణుమూర్తికి అమిత భక్తుడు.. మన సినిమాల పుణ్యమా అని నారదుడు అంటే అందరికీ ఒక దురభిప్రాయం ఏర్పడింది. నారదుడు కలహప్రియుడని భావిస్తారు.. ఆయనను ఒక హాస్య పాత్రగా మార్చేశారు.. నారద మహర్షిని అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. వాస్తవానికి నారదుడు ఏమి చేసినా లోక కల్యాణం కోసమే చేశారు..
నారద అంటే అర్థం ఇలా ఉంది.. నార అంటే జ్ఞానం.. అంటే ఇచ్చువాడు.. నారదుడు త్రిలోక సంచారి.. లోకాలన్నింటికీ వార్తలను చేరవేస్తుంటాడు. దేవతలను, దానవులను, రుషులను, రాజులను కలిసేవారు.. అంటే ఈ లోకానికి తొలి పాత్రికేయుడు నారదుడు అన్నమాట.. అందుకే నారదుని జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
నారదుడు గొప్ప రాజనీతిజ్ఞుడు.. రాజనీతి, ధర్మం తెలిసిన వాడు.  అంతే కాదు మంచి సంగీతకారుడు. అందుకు ప్రతీకగా ఆయన చేతిలో తంబురను చూడవచ్చు.. నారద భక్తి సూత్రాలను అందించడమే కాదు. వాటిని గానం చేసి, నిరంతరం ధర్మ ప్రచారం చేశాడు..
రామాయణం లాంటి మహాకావ్యం మనకు అందింది అంటే అది నారదుని పుణ్యమే.. రాముడిని వాల్మీకికి పరిచయం చేసి, ఆయనచే రామాయణం రాయించింది నారదుడే.. అలాగే వేద వ్యాసునిచే మహాభారతం, భాగవతం రాయించింది కూడా నారదుడే.. ధృవుడికి నారాయణ మంత్రం ఉపదేశించింది, ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారాయణ భక్తిని, మరమాత్ముని తత్వాన్ని బోధించింది కూడా నారదుడే..
నారదుడు ఒక ఆదర్శ పాత్రికేయుడని మనం చెప్పవచ్చు.. పాత్రికేయుని లక్షణం సమాజానికి వార్తలను అందించడమే కాదు.. సమాజ శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి చెడులను విశ్లేషించడం, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం పాత్రికేయుని విధి.. నారదుడు ఆనాడు చేసిన పని కూడా ఇదే.. ధర్మ రక్షణ, లోక కల్యాణం కోసం వార్తలను చేరవేసేవాడు నారదుడు..
ఏ వార్త ఎవరికి ఎలా చేరవేయాలో నారదుడికి బాగా తెలుసు.. అటు దేవతలకు, ఇటు దానవులకు సమాచారాన్ని అందించినా.  లోక కల్యాణం దాని వెనుక స్పష్టంగా కనిపిస్తుంది.. దానవులపై దేవతలను యుద్దానికి ఉసిగొలిపి, విష్ణుమూర్తిని దశావతారాలు ఎత్తేందుకు ప్రోత్సహించింది కూడా నారదుడే..
తిధి ప్రకారం నారదుని జయంతి వైశాఖ కృష్ణ పాడ్యమి రోజున వస్తుంది. అయితే మన వెసులుబాటును బట్టి నారద జయంతిని నిర్వహించుకుంటున్నాం.. సమాచార భారతి గత 19 ఏళ్లుగా మీడియాకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నారద జయంతిని నిర్వహించి, విశిష్ట పాత్రికేయులను సన్మానిస్తోంది.. ఇందులో భాగంగానే ఈనాటి కార్యక్రమం..










హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన నారద జయంతిలో సీనియర్ పాత్రికేయులు శంకరనారాయణ, అరుణా రవికుమార్, విద్యారణ్య, సీనియర్ ఫోటో జర్నలిస్టు శివకుమార్ గారిని సన్మానించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి.విజయబాబు, ముఖ్యవక్తగా అఖిల భారతీయ ప్రజ్ఞాప్రవాహ్ సంయోజక్ జె,నందకుమార్ హాజరుకాగా, సమాచార భారతి అధ్యక్షుడు జి.గోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు.. సమాచార భారతి కార్యదర్శి ఆయుష్, సహచర మిత్రులు ఓంప్రకాశ్, దేవిక, నీలేశ్ జోషి, వంశీకృష్ణ, మన్యంకొండ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు..

1 comment:



  1. నారదాయ నమః !

    అంతా జిలేబి మయము గా ఉన్నది


    జిలేబి

    ReplyDelete