Sunday, October 9, 2016

దేశ భద్రత విషయంలో ఈ లొల్లి ఏమిటి?

స్వాతంత్ర్యానంతర భారత దేశ చరిత్రను గమనించినట్లయితే సమర్థవంతవైన నాయకత్వం ఉన్నప్పుడే శత్రు దేశానికి గట్టి బుద్ధి చెప్పగలిగాం.. ఈ విజయాలకు కారకులైన మన దేశ ప్రధానులకు ప్రజలు జేజేలు కొట్టారు.. పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల ఫలితాలు విషయాన్నే చెబుతున్నాయి..
1965లో యుద్దానికి దిగిన‌ పాకిస్థాన్‌కు గ‌ట్టి బుద్ది చెప్ప‌డం ద్వారా లాల్ బ‌హ‌ద్దూర్ శాస్త్రి దేశ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లందుకున్నారు.. 1971లో యుద్దంలో విజ‌యం ద్వారా తూర్పు పాకిస్థాన్‌ను విడ‌దీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేయ‌డంతో కీల‌క పాత్ర పోశించిన ఇందిరాగాంధీ విజ‌యేందిర‌గా కీర్తింప‌బ‌డ్డారు.. 1999లో కార్గిల్ లో కాలు దువ్విన పాకిస్థాన్ వెన్ను విర‌చిన అట‌ల్ బిహారీ వాజ‌పేయి మ‌న దేశ పౌరుషాన్ని మ‌రోసారి గుర్తు చేశారు..
ఈ యుద్దాల‌న్నింటిలో భార‌త సైన్యం ఎంతో సమర్ధవంతంగా శత్రువుల‌ను చెండాడింది.. ఎంద‌రో వీర జ‌వానులు అమ‌రులై నిజ జీవిత హీరోలుగా దేశ ప్ర‌జ‌ల హృద‌యాల్లో శాశ్వ‌త స్థానం పొందారు.. యుద్దం చేసింది సైన్యం అయినా, ఇందుకు సంబంధించిన నిర్ణ‌యాల్లో దేశ నాయ‌క‌త్వమే కీల‌క పాత్ర పోషిస్తుంది.. తెగువైన నాయ‌క‌త్వం ద్వారానే అది సాధ్యం.. అందుకే శాస్త్రీజీ, ఇందిర‌, అట‌ల్జీలను దేశ ప్ర‌జ‌లు కీర్తించారు.. ప్రతిపక్షాలు కూడా వారికి అండగా నిలిచాయి..
తాజా విషయానికి వస్తే ఉరీ ఉదంతం త‌ర్వాత భార‌త సైనికులు పీవోకేలో స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ చేప‌ట్టిన‌ప్పుడు దేశమంతా ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.. ప్ర‌పంచ దేశాలు భార‌త్ చ‌ర్య‌ను సమర్ధించాయి.. ఇలాంటి కీలక త‌రుణంలో దేశానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి స‌హ‌జంగానే మంచి పేరు వ‌స్తుంది.. కానీ కొందరు సంకుచిత రాజ‌కీయ నాయకులు, సోకాల్డ్ మేతావులు దీన్ని స‌హించ‌డం లేదు.. నోటికి వ‌చ్చిన పిచ్చి కూత‌లు కూస్తున్నారు.. ఆధారాలు కావాలట ఒకాయనకు.. ఖూన్ దళాల్ అంటాడు ఇంకొకాయన.. యూపీ ఎన్నికల కోసమే సర్జికల్ స్ట్రయిక్స్ అని మరి కొందరి విసుర్లు.. ఇంకా నయం మోదీ, షరీఫ్ కుమ్మక్కై ఆడుతున్న నాటకం అనలేదు ఎవరూ?..
వీరంతా గ్ర‌హించాల్సిన విష‌యం ఒక‌టి ఉంది..  ఫ్రధాని మోదీపై అక్కసు తీర్చుకోవ‌డానికి ఇది తగిన సమయం కాదు.. రాజ‌కీయంగా చాలా అవ‌కాశాలు ఉన్నాయి.. మోదీపై కోపంతో దేశ గౌర‌వానికి భంగం క‌లిగిస్తూ మ‌న సైనికుల త్యాగాల‌ను, మ‌నోభావాల‌ను కించ ప‌రిస్తే ప్ర‌జ‌లు స‌హించ‌రు.. మ‌న దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు ఒక‌టిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది..

No comments:

Post a Comment