Sunday, October 9, 2016

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ అంతటా సంబురం.. పల్లె, పట్నం తేడా లేదు.. తొమ్మిది రోజుల పాటు అంతటా బతుకమ్మ ఆట పాటలు..
సంస్కృతి అంటే సినిమా పాటలు, డాన్సులు, కప్పగంతులే కనిపిస్తున్నాయి.. సాంప్రదాయ, జానపద కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి.. ఇలాంటి రోజుల్లో కల్తీలేని అచ్చ తెలుగుదనం, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలిచి ఉన్నాయంటే, అది బతుకమ్మ రూపంలోనే అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.. కష్ట సుఖాలు, ఆనందం, ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం, చరిత్ర, పురాణాలు అన్నీ బతుకమ్మ పాటల రూపంలో కనిపిస్తాయి.. బతుకు అమ్మా అనే దీవనే బతుకమ్మగా మారింది..
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రజలకే పరిమితం.. ప్రభుత్వ పరంగా పెద్దగా గుర్తింపు లేదు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో బతుకమ్మ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయింది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. అప్పట్లో పెద్దగా పట్టించుకోని మీడియా, ఇప్పుడు ప్రతి రోజూ పెద్ద ఎత్తున ప్రత్యక్ష ప్రసారాలు చేస్తోంది.. దేశ విదేశాల్లో తెలంగాణ వారు కాకుండా తెలుగువారు, ఇతర భారతీయులు కూడా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు..
దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు బతుకమ్మను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.. గతంలో ఓ పెద్దాయన హైదరాబాద్ ను తానే కట్టాను అన్నట్లుగా చెప్పుకునేవాడు.. ఇప్పుడు బతుకమ్మను తామే కనిపెట్టామన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు కొందరు.. వీరికి మనవి ఏమిటంటే బతుకమ్మను ఇలాగే బతకనివ్వండి.. ప్రజలప పండుగగానే కొనసాగించండి..

బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment