Sunday, October 2, 2016

భారత దేశ మహా పుత్రుడు..

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. భారతమాత గొప్ప పుత్రుడు.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖుల్లో, 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసి వ్యక్తుల్లో అగ్ర స్థానంలో నిలిచి మహాత్ముడయ్యారు.. సత్యం, అహింస ఆయన ఆయుధాలు.. సత్యాగ్రహం, సహాయ నిరాకరణ విధానాలను ఆచరణలో చూపించారు.. జాత్యహంకారం, అంటరానితనం, మద్యపానం, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడారు గాంధీజీ..
రామరాజ్యం, గ్రామస్వరాజ్యం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ.. గ్రామ సీమలు సస్యశ్యామంగా ఉంటే దేశం పచ్చగా ఉంటుందని చెప్పేవారు.. గో ఆధారిత ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉన్న గాంధీజీ, సంపూర్ణ గోవధ నిషేధానికి పిలుపునిచ్చారు..
స్వదేశీ, స్వావలంభన కోసం పిలుపునివ్వమే కాదు స్వయంగా నూలు వడికి అవే వస్త్రాలు ధరించారు గాంధీజీ.. ఆనాటి దేశ ప్రజల కష్టాలను చూసి ఒంటిపై రెండే వస్త్రాలు ధరించడం ద్వారా జీవితాంతం నిరాడంభరంగా జీవించారు.. మహిళలు అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని చెప్పారా మహాత్ముడు.. పరిసరాల పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన గాంధీ, స్వయంగా చీపురుపట్టి వీధులు ఊడ్చారు.. మరుగుదొడ్లను శుభ్రం చేశారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు ఇదే స్పూర్తి..
గాంధీజీ బోధనలు ఆనాటి భారత దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలమైనవని, నేటి తరం ఆచరించడం కష్టం అంటారు కొందరు వ్యక్తులు.. కాలానుగుణంగా మార్పులు సహజం.. కానీ గాంధీ బోధనలు, మూల సూత్రాలను స్పూర్తిగా తీసుకొని ఆచరించడం మంచిదే.. గాంధీజీ మాదిరిగా రెండు వస్త్రాలు ధరించాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్ధం ఆచరణ యోగ్యమే కదా.. తన జీవితమే ఒక సందేశం అని ఆచరణలో చూపించిన గాంధీజీ అందరికీ ఆదర్శప్రాయం.

మహాత్మాగాంధీని జాతిపిత అనడం మహా అపరాధం.. కొందరు మిడిమిడి తెలివితో సృష్టించిన పదం ఇది.. గాంధీజీకన్నా 5000 సంవత్సరాల ముందు కాలం నుండే భారతదేశం ఉనికిలో ఉంది.. భారతమాత మహాపుత్రుడు అనడం సమంజసం.. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకొని, స్పూర్తిని నింపుకుందాం..

No comments:

Post a Comment