Sunday, October 23, 2016

టపాకాయల బహిష్కరణ చైనాకు చెంప పెట్టు కావాలి

  చైనా మన భారత దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత దేశ దిగుమతుల్లో ఆరో వంతు చైనా నుంచే వస్తున్నాయి.. చైనాకు మన ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువ.. మన వాణిజ్య నిఘా, గణాంకాల డైరెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో చైనాకు మన ఎగుమతులు 18 బిలియన్ డాలర్ల నుండి 9 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఇదే కాలంలో చైనా నిండి మనకు దిగుమతులు 61 డాలర్లకు చేరింది.. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 52 డాలర్లు..
చైనా నుండి కారు చౌకగా వస్తున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఖనిజ, రసాయణ, గాజు, పింగాణి వస్తువుల కారణంగా మన దేశీయ పరిశ్రమలు తల్లడిల్లిపోతున్నాయి.. చైనా నిం ప్రధానంగా మన దేశానికి ప్రధారంగా సెల్ ఫోన్, లాప్ టాప్, సోలార్ సెల్ బ్యాటరీ, స్ప్రింగ్, బేరింగ్, టీవీ రిమోట్, సెటప్ బాక్స్, ఎల్ ఈ డీ, ఎల్ సీ డీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.. రకరకాల ఔషధాలు, పిల్లల ఆట వస్తువులు కూడా భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి..
చైనాలో మానవ వనరులు, ముడి పదార్ధాలు కారు చౌర.. ఆ దేశంలో శ్రమదోపిడి ఎక్కువ.. ఎక్కువ సమయం పని చేయించుకొని, తక్కువ జీతాలు చెల్లిస్తారు.. పేరుకే కమ్యూనిస్టు దేశం.. కానీ పెట్టుబడి, దోపడిదారుకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ కాస్త ఎక్కువే ఉన్నాయి.. ఈ కారణం వల్లే మన దేశంతో సహా ప్రపంచ మర్కెట్ ను కారు చౌక వస్తువులతో ముంచెత్తుతోంది చైనా..
ప్రతి ఏటా మనం దీపావళి పండుగను టపాకాయలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం.. శివకాశీలో పెద్ద సంఖ్యలో ఉన్న టపాకాయల పరిశ్రమలు లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.. ఆ పరిశ్రమకు ఏటా 6000 వేల కోట్ల రూపాయల మేర జరిగే దీపావళి వ్యాపారమే ప్రధానం.. దురదృష్టవశాత్తు కారు చౌకగా మన దేశంలోకి వచ్చిపడుతున్న చైనా తయారీ టపాకాయల కారణంగా దేశీయ టపాకాయల పరిశ్రమకు ముప్పు ముంచుకొచ్చింది.. మన దేశీయ టపాకాయల్లో ఉపయోగించే రసాయణాలతో పెద్దగా ప్రమాదం ఉండదు.. కానీ చైనా తయారీ టపాకాయల్లో నైట్రేట్, సల్ఫర్ అధిక మోతాదులో ఉంటోంది.. చైనా మతాబులు కారు చౌకగా లభిస్తున్నా, మన పిల్లలకు అవి చాలా ప్రమాదకరం.. ఇటీవల కాలంలో చైనా టపాకాయలకు ప్రభుత్వం నిషేధించినా, అవి అక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి పడుతున్నాయి..
మైత్రి అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి.. చైనాతో భారత్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నా, ఆ దేశం మాత్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది.. ముఖ్యంగా సరహద్దుల విషయంలో మన దేశంతో పేచీలు పడుతూ, మన శత్రు దేశం పాకిస్థాన్ కు అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తోంది.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ను వెనుకేసుకు వస్తోంది.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ అనుకూల భారత్ వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్న చైనాకు గుణపఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. మన దేశం నుండి వ్యాపారపరంగా లాభ పడుతూ, మనకు వ్యతిరేకంగా పని చేస్తున్న చైనాతో కఠినంగానే వ్యవహరించాలి.
చైనా తయారీ వస్తువుల బహిష్కరణే మన ముందున్న ఏకైక మార్గం.. దేశీయ మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కాపాడుకోడానికి ఇది తప్పని సరి.. చౌకగా దొరికే వస్తువులను వదులుకోవడం ఎందుకు అని కొందరు వినియోగదారు దృష్టితో ఆలోచిస్తారు.. కానీ దేశీయ పరిశ్రమలు కుదేలైపోతే మనకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా అనే కోణంలో కూడా ఆలోచించాలి..
మేకిన్ ఇండియా స్పూర్తితో దేశీయంగా పరిశ్రమలు ప్రారంభమై, వస్తూత్పత్తి క్రమంగా పెరుగుతోంది.. ఈ కారణంగా భవిష్యత్తులో చైనా దిగుమతులు గణనీయంగా తగ్గిపోతాయి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాపారులు, వినియోగదారులు చైనా వస్తువుల బహిష్కరణ ప్రారంభించారు.. మనం కూడా చైనా వస్తువుల బహిష్కరణను ఈ దీపావళి నుండి మొదలు పెడదాం.. ఇందుకు చైనా టపాకాయల బాయ్ కాట్ నాంది కావాలి.. 

No comments:

Post a Comment