Sunday, December 31, 2017

తమిళనాడుకు రజినీయే బెస్ట్

నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన చిత్రాల్లో కమల్ హాసన్, రజినీకాంత్ నటించినవే ఎక్కువ.. ఎందుకో నాకు మన తెలుగు హీరోల నటన పెద్దగా నచ్చదు.. కమల్, రజినీలు కాలానుగుణంగా తమ నటనా వైవిధ్యాన్ని కొనసాగించడం, వినూత్న ప్రయోగాలకు పెద్ద పీట వేయడం కారణంగా అరుదుగా వచ్చే వారి చిత్రాల కోసం ఎదురు చూస్తుంటాను.

నిజానికి నేను రజినీ కన్నా కమల్ కు పెద్ద అధిమానిని.. నటన వరకే సుమా.. అతని వ్యక్తిగత జీవితం నాకు అనవసరం అనుకున్నా.. ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కమల్ హాసన్ విడుదల చేస్తున్న విచిత్రమైన ప్రకటనలు, ట్వీట్లు నాకు నచ్చలేదు.. కమ్యూనిస్టుల చంకలో చేరి హైందవానికి, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలు నా మనసు విరిచాయి. సైద్దాంతిక గందరగోళం, రాజకీయ పరిపక్వత లేని కమల్ రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. లేకుంటే నా లాంటి ఎంతో మంది అభిమానులు ఆయనకు దూరమైపోతారు.
తమిళనాట ఎంజీఆర్ తర్వాత అంతటి గొప్ప విలక్షణ నటుడు రజినీకాంత్.. మూడున్నర దశాబ్దాలుగా అగ్ర నటుడిగా ఉన్న రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానలు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన తొందర పడకుండా తన నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. జయలలిత తర్వాత ఆమె అంతటి సాహసోపేత, జనాధరణ గల నాయక్తవం లేదు.. ఇలాంటి సమయంలో వేర్పాటువాద శక్తులకు అండగా నిలిచిన కొన్ని సోకాల్డ్ ద్రవిడ పార్టీలు అవినీతి, చిల్లర వేశాలతో ప్రజల ఏవగింపునకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటన చేయడం సంతోషకరం.. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్న రజినీకాంత్ తమిళనాడుకు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏమీ చేయలేకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చేసిన ప్రకటనకు రజినీకాంత్ కట్టుబడి ఉండాలని కూడా భావిస్తున్నాను.

సినిమాలు, రాజకీయాలు వేరు వేరు.. కానీ తమిళనాట ఈ రెండూ దశాబ్దాలుగా అవిభక్త కవలలుగా సాగుతున్నాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించారు. ప్రజాధరణతో రాజకీయాల్లోని వచ్చిన వీరి పాలనా కాలం అంతా అవినీతి మయమే.. ఇలాంటి సమయంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన తన స్వచ్ఛతను కాపాడుకొని అవినీతి దూరంగా నీతివంతమైన, సమర్ధ పాలకుడుగా ఆవిర్భవించాలని మనసారా కోరుకుంటున్నాను.

Saturday, December 30, 2017

ఇక ఉమ్మడి పౌరస్మృతి దిశగా

అది 1985 సంవత్సరం షాబానో అనే వృద్ధురాలు తనను వదిలేసిన భర్త మనోవర్తి చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చేసరికి నాటి ముస్లిం నాయకులు గగ్గోలు పెట్టారు. తమ మత సంబంధమై విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ 1986లో  ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో సంపూర్ణ మెజారిటీకన్నా ఎక్కువ సభ్యులు ఉన్నా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఛాందసవాసుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది.

షాబానో ఉదంతం దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై చర్చకు దారి తీసింది. పర్సనల్ లా ముసుగులో ముస్లిం మహిళలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు చైతన్యవంతులైన ముస్లిం మహిళలు ముమ్మారు తలాక్’కు వ్యతిరేకంగా గళమెత్తారు. భర్త మూడుసార్లు తలాక్ అని ఉచ్చరించగానే వైవాహిక బంధం పెటాకులు అయినట్లేనట.. సుప్రీం కోర్టు ఆదేశాల పుణ్యమా అని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ తప్పని సరైన సరిస్థితిలో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఇక రాజ్యసభ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లాంఛనమే అని చెప్పవచ్చు.
నిజానికి భారతీయ ముస్లింలలో కొన్ని ఛాందస వర్గాలు తప్ప మెజారిటీ వర్గాలు తలాక్విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పని లేని ప్రతిపక్షాలు, వామపక్షాలు మాత్రం వ్యతికేస్తున్నాయి. ఈ వర్గాలకు ఈ చట్టం తీసుకు రావడం ఇష్టం లేకపోవడానికి కారణం ప్రధాని మోదీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతే అని చెప్పక తప్పదు..
ముమ్మారు తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ముస్లిం మహిళల ప్రయోజనాలను రక్షించేందుకు తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి వారు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రపంచంలో ముస్లింల జనాఖా ఎక్కువగా ఉన్న పాకిస్తాన్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాన్, టర్కీ, బంగ్లాదేశ్ తదితర 19 దేశాలు ఏనాడో తలాక్కు తలాక్ చెప్పేశాయి. నిత్యం మన దేశంపై విద్వేషాన్ని విరజిమ్మే మత ఛాందస దేశం పాకిస్తాన్ 1961లో ముమ్మారు తలాక్ ను నిషేధించింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో సెక్యులరిజం ముసుగులో ఇంకెంత కాలం సాగుతాయి ఈ కపట నాటకాలు?

దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిచాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం నిర్దేశించిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆనాడే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని వాంచించారు. దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ఇప్పుడు మనం అంతా ఈ దిశగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇందుకు ముమ్మారు తలాక్ నిషేధం స్పూర్తి కావాలి..

Wednesday, December 27, 2017

మనువు పేరుతో ధర్మంపై దాడి

మ‌నుస్మృతి.. ఈ పేరు విన‌గానే హిందూ వ్య‌తిరేక శ‌క్తులు ర‌గిలిపోతుంటాయి. హిందూ మ‌తంపై దాడికి ఈ గ్రంథాన్ని సాకుగా చూపుతాయి. మ‌నుస్మృతిలోని చాతుర్వ‌ర్ణ వ్య‌వ‌స్థ‌, అంట‌రాని త‌నం, శూద్రులు, మ‌హిళ‌ల‌పై వివ‌క్ష‌, ఘోర‌మైన శిక్ష‌ల‌ను ప్ర‌స్థావించి స‌మాజంలోని కొన్ని వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టి హిందూ మ‌తం నుంచి దూరం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు కాలం చెల్లిన‌, మ‌నుగ‌డ‌లో లేని ఈ శిక్షాస్మృతిపై ఎందుకు ఇంత రాద్దాంతం?
ప్ర‌తి మ‌తంలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. ఇత‌ర మ‌తాల‌తో పోలిస్తే స‌నాత‌న హిందూ ధ‌ర్మంలో కాలానుగుణంగా వచ్చి మార్పులలో మంచిని గ్రహించి చెడును వదిలేస్తూ వచ్చింది.. అందుకే వేలాది సంవ‌త్స‌రాలుగా నిత్య నూతనంగా కొన‌సాగుతోంది హిందూ ధ‌ర్మం. 
ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌రిత్ర‌ను గ‌మ‌నించి చూస్తే పూర్వం రాజ్యాలు ప‌రిపాల‌న కోసం తమదైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నించవ‌చ్చు.. రాజ్యంలో పాల‌కులు-పాలితుల మధ్య సంబంధాలు, పౌరుల విధులు బాధ్యతలు, సమాజంలో వివిధ వర్గాల ప్రజలు, ఎవ‌రు ఏం చేయాలి?.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నులు.. నేరాలు, త‌ప్పులు చేస్తే వారికి విధించాల్సిన శిక్ష‌లు.. ఇలా అన్నింటికీ చ‌ట్టాలు, శిక్ష్మా స్మృతులు ఉంటాయి.. రాజ్యాలు పోయి ప్ర‌జాస్వామ్య పాల‌న వ‌చ్చాక వీటిలో చాలా వరకూ మార్పలు చేర్పులు వచ్చాయి.. ఇందులో కొన్ని ఒక‌నాడు ఒప్పు అనిపించిన‌వి, ఇప్పుడు త‌ప్పు అనిపించ‌డం స‌హ‌జం. 
భార‌తదేశాన్ని ఎంద‌రో రాజులు పాలించారు. విదేశీయుల దండ‌యాత్ర‌లు, వారి పాల‌న చూశాం.. చివ‌ర‌కు స్వాతంత్ర్యం పొంది ప్ర‌జాస్వామ్య పాల‌న అనుభ‌విస్తున్నాం. మ‌న దేశంలో వేలాది సంవత్స‌రాలుగా స‌నాత‌న ధ‌ర్మం కొన‌సాగుతోంది. ఆ కాలంలోని చ‌ట్టాలు, శిక్షాస్మృతుల‌ను మ‌నం నేటి స‌మాజానికి ఆపాదించ‌లేం.. హైంద‌వ స‌మాజం ఎన్నో మార్పుల‌ను కూడా చూసింది. స‌మాజంలో అంట‌రానిత‌నం, వివ‌క్ష‌త‌ల‌ను రెండు వేల సంవత్స‌రాల క్రిత‌మే ఆది శంక‌రాచార్యులు, రామానుజాచార్యులు త‌దిత‌ర మ‌హ‌నీయులు ప్ర‌శ్నించారు. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది సంఘ సంస్క‌ర్త‌లు వీటిపై పోరాటం కొన‌సాగించారు. 
హైంద‌వ ధ‌ర్మశాస్త్రాల్లో మ‌నుస్మృతి ఒక‌టి మాత్ర‌మే లేదు. ఇలాంటి 18 స్మృతులు ఉన్నాయి.. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి... ఇవికాక మ‌రో 18 ఉపస్మృతులు ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి..
ఇక్క‌డ మ‌నం అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. హైంద‌వ ధ‌ర్మానికి మ‌నుస్మృతి ఒక‌టే ప్ర‌మాణికం కాదు.. అందులో కొందరికి మంచి కనిపించవచ్చు, మరి కొందరికి చెడు కనిపించవచ్చు.. అస‌లు ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నుస్మృతి ఎక్క‌డ ఉంది?.. దీన్ని ఎవ‌రైనా ఆచ‌రిస్తున్నారా?.. ఎవ‌రూ ప‌ట్టించుకోని ఈ గ్రంథంపై అస‌లు ఎందుకు ఇంత ర‌భ‌స‌?.. మ‌నం ఇప్పుడు ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ఆధునిక కాలానికి అనుగుణంగా మ‌న‌కు రాజ్యాంగం, చ‌ట్టం, శిక్షా స్మృతులు ఉన్నాయి. అలాంట‌ప్పుడు కొన్ని వ‌ర్గాల‌కు ఎప్పుడో అన్యాయం జ‌ర‌గిపోయింది అంటూ నేటికీ మ‌నుస్మృతిని ప‌ట్టుకొని హిందూ ధ‌ర్మాన్ని నిందంచ‌డం ఎందుకు?. చాలా మంది తెలిసీ తెలియ‌క మ‌నుస్మృతి గ్రంధాన్ని త‌గుల‌బెడుతున్నారు. ప్ర‌తిగా మ‌రి కొంద‌రు రెచ్చిపోయి గొడ‌వ‌కు దిగుతున్నారు. మ‌నం ప‌ట్టించుకున్న కొద్దీ అవ‌త‌లి వారు అలా రెచ్చిపోతూనే ఉంటారు.. కాబ‌ట్టి మీరింతే అని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.. 

అన్య‌మ‌తాల గ్రంథాల్లో ఇంకా దారుణ‌మైన శిక్షాస్మృతులను చూడ‌వ‌చ్చు.. మ‌రి ఆ మ‌తాల‌ను నిందించ‌కుండా హిందూ మ‌తాన్ని మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం ఎందుకు? ఇందులోని కుట్ర కోణాన్ని మ‌నం అర్థం చేసుకోవాలి.. 

జైల్ మే రహేగా లాలూ..

‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ, బిహార్ మే రహేగా లాలూ..’ అని గొప్పలు చెప్పుకున్నాడు.. ఇప్పుడు పశువుల నోటికాడి గ్రాసాన్ని కాజేసి మెక్కిన కేసులో మరోసారి జైలుకు వెళ్లాడు.. చారా చోర్ లాలూ ప్రసాద్ యాదవ్ నేరం నిరూపితం అయి జైలుకు పోవడం శుభ పరిణామం.. కానీ పశుగ్రాసం కేసును రెండు దశాబ్దాల పాటు సాగదీయడమే నాకు నచ్చలేదు.

సత్వర న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం కారణంగా నేరగాళ్లు కాలర్ ఎగరేస్తూ సమాజాన్ని శాసించడం దురదృష్టకరం. రాంచీ సీబీఐ కోర్టులో దోషిగా తేలిన లాలూ శిక్షను తప్పించుకోవడానికి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టులను ఆశ్రయించడం ఖాయం.. ఈలోగా ఆయన శిక్షను పూర్తిగా అనుభవించకుండానే నూకలు చెల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది..
కోట్లాది రూపాయ ప్రజా ధనం అడ్డగోలుగా దోచుకుంటూ తరతరాలకు సరిపడే సంపదను, వారసత్వ అధికారాన్ని చలాయించే నాయకులకు ఐకాన్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులంతా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరికి తర్వగా శిక్షలు విధించడమే కాదు, దోచుకున్న సంపదనంతా రాబట్టి బిహార్ ఖజానాకు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి నాయకులు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వారసులం అటూ, వారి ఆశయాలకే తూట్లు పొడుస్తున్నారు. సమాజాన్ని కులాల పేరిట చీలుస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులను భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అవసరం ఉంది.
పై కోర్టులలో త్వరిత గతిన విచారణ పూర్తయి ‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ.. జైల్ మే రహేగా లాలూ..’ అని వినాలని కోరుకుంటున్నాను నేను..

24.12.2017

అర్థంలేని ఆరోపణలు

మోకాలికి బట్టతలకు ముడి పెట్టడం అంటే ఇదే.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించేందుకు సాకుల కోసం కాచుకున్న శక్తులు విచక్షణ కోల్పోవడం మరోసారి స్పష్టంగా కనిపించింది.. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నాటి టెలికమ్ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు నేరం చేశారనేందుకు ఆధారాలు లేక వదిలేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడులు మొదలయ్యాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని బయట పెట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2008లో జరిగిన కేటాయింపులకు 2001 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకొని అస్మదీయులకు కేటాయింపులు జరిపారని ఆరోపణ. మంత్రి రాజా తన కుటుంబ వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న యూనిటెక్, డాట్ కామ్, స్వాన్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని 2012లో స్వయానా సుప్రీం కోర్టు గుర్తించి 122 లైసెన్సులపై వేటు వేసింది..
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్ష కోట్ల నష్టం జరగిందని కాగ్ నిర్ధారించింది. ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఒకటి ఉంది. కుంభకోణం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, కుంభకోణంతో సంబంధం ఉన్న వారు కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే పార్టీకి చెందిన రాజా, ఆ పార్టీ అధినేత కరుణానిధి తనయ ఎంపీ కనిమొళి.. మరి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సంస్థ ఎవరి కనుసన్నల్లో పని చేసినట్లు.. ఆ సమయంలోనే కీలకమైన పత్రాలను తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కేసు అప్పుడే నీరు గారింది..
తాజాగా సీబీఐ న్యాయస్థానం తీర్పు చెప్పే సమయానికి ప్రాసిక్యూషన్ వాదన వీగిపోయింది. సాక్ష్యాలను ప్రవేశ పెట్టడంలో విఫలం అయ్యారని న్యాయమూర్తి సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.. మరి ఇక్కడ మోదీ ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ ఉన్నట్లు?. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం ఇక్కడ ప్రస్థావనకు వస్తోంది..
కరుణానిధిని పరామర్శించడమే మోదీ చేసిన నేరమా?. దీనికి, తాజా తీర్పుకు ముడి పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. డీఎంకేను తమవైపు తిప్పుకోవడానికే స్పెక్ట్రమ్ కేసును బీజేపీ ప్రభుత్వం నీరు గార్చిందని వాదన. మోదీ ప్రభుత్వం నిజంగా న్యాయస్థానాలను, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసిందని నమ్మగలమా? ఇదే నిజమైతే ఇటీవల చాలా కేసుల్లో న్యాయస్థానాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. అంత పెద్ద కుంభకోణాన్నే ప్రభావితం చేసిన మోదీ, చిన్నా చితకా కేసుల్లో తన ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా చూసుకోలేరా?
నిజానికి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం న్యాయస్థానానికి చేరేందుకు కారణం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన ఈ కేసును అంత తేలికగా వదిలి పెట్టరు.. పై కోర్టుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేందకు అప్పుడే సిద్దమైపోయారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ ఉండొచ్చు.. అసలైన మొసళ్ల పండుగ ముందు ముందు ఉంటుంది.

22.12.2017

వారు ఎలా అమాయకులో?



యూపీఏ హ‌యాం 2009లో వెలుగు చూసిన 2జీ స్పెక్ట్మ్ కుంభ‌కోణంలో నాటి టెలికమ్ శాఖ మంత్రి ఏ.రాజా, ఎంపీ క‌ణిమొళి నిర్దోషులంటూ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తీర్పు ఇవ్వ‌గానే డీఎంకే, కాంగ్రెస్ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. . అవినీతికి ఆధారాలు దొర‌క‌లేద‌ని భావిస్తే వారు నేరం చేయ‌లేద‌ని అర్థం కాదు. నేరాన్ని నిరూపించ‌డంలో ప్రాసిక్యూష‌న్ విఫ‌ల‌మైంద‌ని న్యాయ‌మూర్తి చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించాలి. కుంభ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని న్యాయ‌స్థానం చెప్ప‌లేదు. 
మ‌రి ఈ కుంభ‌కోణం కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.1.76 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ర్ (కాగ్‌) నివేదిక చెప్పింది క‌దా? ఆ సొమ్ము ఎవ‌రు తిన్న‌ట్లు?. దొరికితేనే దొంగ‌లు అనుకోరాదు.. ఇంకా పైకోర్టులు ఉన్నాయ‌ని, అవి నిగ్గు తేలుస్తాయ‌ని మ‌రచిపోవ‌ద్దు.. స‌త్య‌మేవ‌జ‌య‌తే..
21.12.2017

ఇదేం నైతిక విజయమో?

ఓ పెంకి పిల్లోడు స్కూలు మైదానంలో జరిగిన కుస్తీ పోటీలో ఓడిపోయాడు.. కానీ ఇంట్లో వాళ్లందరికీ నేనే గెలిచాను.. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాను.. అని గొప్పలకు పోయాడు.. వాస్తవం ఏమిటో అందరికీ తెలిసినా వాడి సంతోషాన్ని ఎందుకు కాదనాలని ఆహా అలాగా భేష్ అంటూ అభినందించి మునగ చెట్టు ఎక్కించారు..

గుజరాత్ అసెంబ్లీలో వరుసగా ఆరోసారి గెలిచింది భాజపా.. రెండు దశాబ్దాల పాలనలో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత సహజం.. అయినా గెలిపించారు గుజరాతీలు.. ఈ వాస్తవాన్ని గుర్తించలేక తామే గెలిచామన్నంత సంబరపడిపోతున్నారు కాంగ్రెస్ వారు. వాస్తవానికి వారు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ను కోల్పోయినందుకు బాధ పడాలి.. కానీ కింద పడ్డా నైతిక విజయం తమదే అని గొప్పలకు పోతున్నాడు రాహుల్ గాంధీ..
మోదీ విశ్వసనీయతపై, గుజరాత్ అభివృద్ధి నమూనాపై సందేహాలట.. రాహులయ్యా!.. గుజరాతీలు మోదీపై విశ్వాసంతోనే మళ్లీ భజపాకు అధికారం ఇచ్చారు అన్న వాస్తవాన్ని ఎందుకు జీర్ణించుకోలేపోతున్నారు?.. గుజరాతీలకు మీ విశ్వసనీయతపై సందేహం కారణంగానే మీకు అధికారం ఇవ్వలేకపోయారు.. కాకపోతే సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్రను మరోసారి ఇచ్చి గౌరవించారు.. దీన్ని అంగీకరించలేకపోతే మీ కర్మ 2019లో ఇలాగే తిరగబడతది..
మొత్తానికి కాంగ్రెస్ కు భలే సారథి దొరికాడు.. ఆయన చేతిలోని స్టీరింగ్ ఎంత భద్రమో మరో రెండేళ్లలోపే తెలిసివస్తుంది..

20.12.2017