Tuesday, January 8, 2019

రిజర్వేషన్ల విధానం మారాల్సిందే..


ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో అసలు ఈ విధానంపైనే సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా అంటున్నానని నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అని భావించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాల్సిందే.. కానీ ప్రస్తుత రూపంలో కాదు..
భారత రాజ్యాంగం ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష నిషేధం.. దేశ ప్రజలందరినీ సమాన అవకాశాలుటు కల్పించింది రాజ్యాంగం.. అయితే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఇచ్చారు. మొదట పదేళ్ల పాటు అనుకున్నారు ఈ రిజర్వేషన్లు.. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యాన కాల పరిమితిని పెంచుతూ పోయారు మన నాయకులు. కాలక్రమంలో మరికొన్ని కులాల రిజర్వేషన్ల జాబితాలోకి తెచ్చారు. రాను రాను ఇతర కులాల నుంచి కూడా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వాలపై వత్తిడి పెరుగుతూ వస్తోంది..
రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలా, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనా అనే విషయంలో మొదటి నుంచి అనేక వాదనలు ఉన్నాయి. ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది.
కాలంతో పాటు సమాజం కూడా ఎంతో మారిపోయింది. ఒకనాడు వివక్షను, వెనుకబాటు తన్నాన్ని ఎదుర్కొన్న కులాలు ఈనాడు ఆ పరిస్థితిలో లేవని అందరూ ఒప్పుకోక తప్పదు. అగ్రకులాలు అని చెప్పబడుతున్న కులాలలో పోలిస్తే వారే ఎక్కువ సంఘటితంగా ఉన్నారు. వారు కూడా రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారు.. వీరిలో సంపన్న శ్రేణిని (క్రీమీ లేయర్) గుర్తించి వారిని రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం అన్ని విధాలా సమంజసం. అలాగే ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నట్లుగా ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొందిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం లేదా తగ్గించడం అమలు చేయాలి..
ఆకలికి, పేదరికానికి కులం లేదు.. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడం అన్ని విధాలా సమంజసం.. ధనమూలం ఇదం జగత్ అని మన పెద్దలు అన్నారు. ధనవంతుడు తన పిల్లలతో వ్యాపారం చేయించి స్వయం ఉపాధి కల్పిస్తాడు.. వారి పిల్లలు పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ పేదవారికి అన్ని అవకాశాలు ఎక్కడుంటాయి.. చదువు కొనేఈ రోజుల్లో కులాన్ని ఎవరు చూస్తున్నారు?.. అందుకే డబ్బు లేనోళ్లకు రిజర్వేషన్ల అవసరం ఎక్కువ..
మన దేశంలో రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది వ్యక్తులకు, కుటుంబాలకు మేలు జరిగింది.. అదే సమయంలో ఇవే రిజర్వేషన్ల కారణంగా అన్యాయాలు కూడా జరిగాయి.. బాధితులకు కడుపు మంట సహజం.. ఎందుకు ఈ విషయం ప్రస్థావిస్తున్నానంటే నేను కూడా రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు కోల్సోయిన బాధితున్ని.. సోకాల్డ్  కులంలో పుట్టడమే నేను చేసిన పాపమేమో అని దు:ఖపడ్డ రోజులు ఉన్నాయి..
ప్రస్తుత రిజర్వేషన్ల పద్దతి ఉన్నంత కాలం బాబా సాహెబ్ అంబేద్కర్ కోరకున్న కుల రహిత సమాజం ఏర్పడదు.. నేను ఏ కులానికి వ్యతిరేకిని కాదు.. పేదల పక్షపాతిని మాత్రమే.. అందుకే నేను అర్ధిక ప్రాతిపదిక రిజర్వేషన్లను సమర్ధిస్తున్నాను..


No comments:

Post a Comment