Wednesday, December 27, 2017

జైల్ మే రహేగా లాలూ..

‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ, బిహార్ మే రహేగా లాలూ..’ అని గొప్పలు చెప్పుకున్నాడు.. ఇప్పుడు పశువుల నోటికాడి గ్రాసాన్ని కాజేసి మెక్కిన కేసులో మరోసారి జైలుకు వెళ్లాడు.. చారా చోర్ లాలూ ప్రసాద్ యాదవ్ నేరం నిరూపితం అయి జైలుకు పోవడం శుభ పరిణామం.. కానీ పశుగ్రాసం కేసును రెండు దశాబ్దాల పాటు సాగదీయడమే నాకు నచ్చలేదు.

సత్వర న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం కారణంగా నేరగాళ్లు కాలర్ ఎగరేస్తూ సమాజాన్ని శాసించడం దురదృష్టకరం. రాంచీ సీబీఐ కోర్టులో దోషిగా తేలిన లాలూ శిక్షను తప్పించుకోవడానికి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టులను ఆశ్రయించడం ఖాయం.. ఈలోగా ఆయన శిక్షను పూర్తిగా అనుభవించకుండానే నూకలు చెల్లిపోవడం ఖాయం అనిపిస్తోంది..
కోట్లాది రూపాయ ప్రజా ధనం అడ్డగోలుగా దోచుకుంటూ తరతరాలకు సరిపడే సంపదను, వారసత్వ అధికారాన్ని చలాయించే నాయకులకు ఐకాన్ లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు దాదాపుగా ఆయన కుటుంబ సభ్యులంతా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరికి తర్వగా శిక్షలు విధించడమే కాదు, దోచుకున్న సంపదనంతా రాబట్టి బిహార్ ఖజానాకు దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి నాయకులు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వారసులం అటూ, వారి ఆశయాలకే తూట్లు పొడుస్తున్నారు. సమాజాన్ని కులాల పేరిట చీలుస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చీడ పురుగులను భారత రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అవసరం ఉంది.
పై కోర్టులలో త్వరిత గతిన విచారణ పూర్తయి ‘జబ్ తక్ సమోసేమే రహేగా ఆలూ.. జైల్ మే రహేగా లాలూ..’ అని వినాలని కోరుకుంటున్నాను నేను..

24.12.2017

No comments:

Post a Comment